Image result for Youth uprising in Several countriesవిభిన్న చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంగల ఈక్వడార్‌, లెబనాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, ఇరాక్‌, చిలీ, హైతీవంటి దేశాలలో ఒక నూతన యువ కార్మికవర్గం వర్గపోరాట క్షేత్రంలోకి బలంగా అడుగుపెడుతున్నది. ఈ మధ్యకాలంలో జరిగిన ప్రజాప్రదర్శనలకు అంతర్జాతీయ అంతస్సూచనలు న్నాయని గార్డియన్‌ పత్రికకు చెందిన సైమన్‌ టిస్‌డాల్‌ రాశారు. ఆయన ఇలా అన్నారు.. ‘ఒక్కోదేశంలో జరిగిన నిరసనకు ఒక్కోరకమైన ప్రత్యేకత ఉంది. అయితే వీటి మధ్య గల ఒక ప్రధాన సారూప్యత ఏమంటే ఈ నిరసనలన్నింటిలోనూ యువత పెద్ద ఎత్తున పాల్గొనటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా నెరవేరని యువత ఆకాంక్షలు రాజకీయ టైం బాంబులుగా మారుతున్నాయి. భారతదేశంలో ప్రతినెలా 10లక్షలమందికి 18ఏండ్లు నిండి ఓటు హక్కుకు అర్హులవుతున్నారు. రాబోయే ఐదేండ్లలో మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాలలో దాదాపు మూడు కోట్లమంది యువత కార్మికశక్తిలో భాగమవుతున్నారు’.

చరిత్రలో అత్యంత విద్యావంతులు, పట్టణీకరణకు గురైనవారు, సాంకేతికంగా అంతస్సంబంధంలో ఉన్న తరం రాజకీయంగా చైతన్యవంతం కావటం మొత్తం కార్మికవర్గానికి వ్యూహాత్మకంగా కీలకమౌతుంది. 1990వ దశకం ఆరంభంలో పుట్టిన నేటి యువత సోవియట్‌ పతనానికి కారణమని చెప్పే కాకమ్మ కబుర్లని, ఉదార ప్రజాస్వామ్యం విజయం సాధించిందని, యుద్ధం, వర్గపోరాటం ఉండవనే కట్టుకథలను నమ్మటం లేదు. జాతి, లింగ వివక్షలు లేక వ్యక్తిగత అస్థిత్వాలకు సంబంధించిన విషయాలపైనే కాకుండా సమాజంలోని వనరుల కేటాయింపు జరిగే తీరుపై కూడా వారు తమ నిరసన తెలుపుతున్నారు. అనేక రకాల దురభిమానాలను తిరస్కరించటమే కాకుండా నేటి యువత రాజ్యహింసను కూడా ఎదుర్కొనే సాహసం చేస్తున్నది. అతిగా పెరిగిన సామాజిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, సామ్రాజ్యవాద యుద్ధాలు, నిరంకుశ పాలన, అన్నింటికన్నా మించి ముంచుకొస్తున్న పర్యావరణ సంక్షోభంవంటి పరిష్కరింపబడని 20వ శతాబ్దపు చారిత్రక సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు.

30ఏండ్లకంటే తక్కువ వయసున్న యువత నేడు ప్రపంచ జనాభాలో సగం ఉంది. సహారా ఎడారి కిందవున్న ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ, ఆగేయ ఆసియావంటి అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాలలో యువత 65శాతానికి మించి ఉంది. యువత రాడికల్‌గా మారటం అభివృద్ధిచెందుతున్న ప్రపంచానికే పరిమితం కాలేదు. అమెరికాలో ఒక కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థ గతవారం చేసిన సర్వేలో 23 నుంచి 38ఏండ్ల మధ్యగల యువతలో 70శాతం మంది తాము సోషలిస్టు అభ్యర్థిని సమర్థిస్తామని చెప్పారని ప్రకటించింది. ఐరోపా అంతటా సామాజిక విప్లవానికి యువత మద్దతు పెరుగుతోంది. వాతావరణ సంక్షోభానికి వ్యతిరేకంగా గత ఎండాకాలంలో అమెరికా, ఐరోపాలలో లక్షలాదిమంది తమ నిరసన బహిరంగంగా ప్రదర్శించారు.

కార్మికులలో యువతరం రాడికల్‌గా మారటం పెట్టుబడిదారీ వ్యవస్థ అస్థిత్వానికే ప్రమాదమని పాలకవర్గాలు భావిస్తున్నాయి. యువతీ, యువకులు రాడికల్‌గా మారకుండా చేయటానికి అనుసరించవలసిన వ్యూహాన్ని రూపొందించటానికి పెట్టుబడిదారీ వర్గం ఒక నిష్ణాతుల, విశ్లేషకుల బృందాన్ని నియమించింది. వేగంగా పెరుగుతున్న యువ జనాభాకు తగినంత ఉద్యోగ కల్పన జరగాలని, అలా జరగకపోతే యువత విప్లవంతోపాటు అనేక రకాల విధ్వంసకర కార్యకలాపాలలో పాల్గొంటారని ఒక మేధో అధ్యయనం హెచ్చరించింది. పెట్టుబడిదారీవర్గం ప్రపంచంలోని సంపదనంతా కబళిస్తోంది. ఉద్యోగ కల్పనకు, ఆరోగ్య సంరక్షణకు, ఆవాస సౌకర్యానికి కావలసిన నిధుల కేటాయింపులు జరగటం లేదు. పెరుగుతున్న పట్టణీకరణలో భాగంగా యువతీ, యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇది యావత్‌ కార్మికవర్గాన్ని రాడికల్‌గా మారుస్తుందని ఆ అధ్యయనం హెచ్చరించింది.

రాడికల్‌గా మారుతున్న కార్మిక వర్గాన్ని అణచివేయటానికి అమెరికా సామ్రాజ్యవాదం జాగ్రత్తగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ‘2030-2050సంవత్సరాల మధ్య ప్రపంచానికి ఎదురవనున్న పాలనా సవాళ్ళు’ అనే పేరుతో అమెరికా సైన్యానికి చెందిన ఫ్యూచర్‌ స్టడీస్‌ గ్రూపు చేసిన ఒక అధ్యయనం: ‘జనాభా స్వభావంలో వస్తున్న మార్పులు, అసమానతల పెరుగుదల, మెగా నగరాల ప్రభావం, వనరుల కోసం పెరుగుతున్న పోటీవంటి కారణాలచేత రానున్న కాలంలో రాజ్య వైఫల్యాలు సంభవించటానికి అవకాశం ఉంది’ అని పేర్కొంది. కాబట్టి అటువంటి వైఫల్యాల పర్యవసానాలను ఎదుర్కోవటానికి అమెరికా సైన్యాన్ని ఎల్లవేళలా సర్వసన్నద్ధంగా ఉండేలా చేయటా నికి కావలసిన చర్యలను పాలక వర్గాలు తీసుకుంటున్నాయి.

రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కోసం జరిగే విప్లవ పోరాటంలో కార్మికవర్గానికి విద్యార్థుల, యువతీ, యువకుల సామాజిక శక్తి దన్నుగా ఉంటుంది. అనేక దశాబ్దాలపాటు వర్గ పోరాటం, యువత రాడికలైజేషన్‌ అణచివేతకు గురైన తరువాత అంతర్జాతీయ స్థాయిలో కార్మిక వర్గ పోరాటాలు పెల్లుబుకుతున్న సూచనలు కనపడుతున్నాయి. అయితే ఈ పోరాటాలకు రాజకీయ, చారిత్రక దృక్పథం అలవడేలా చేయగలిగే విప్లవ నాయకత్వం అభివృద్ధి కావటమనేదే అత్యంత కీలకాంశం. అదే నేటి చారిత్రక, రాజకీయ సంధికాలంలో అత్యంత ప్రాధాన్యతగల విషయంగా ముందుకు వస్తుంది.

Courtesy Navatelangana..