యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు, యువజనులలో అత్యధికులు ఆ శాసనంతో నేరుగా ప్రభావితులయ్యే రెండు వర్గాల- ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలకూ చెందినవారు కాదు. ఈ నిరసనలకు అనివార్యంగా ఒక రాజకీయ ప్రాధాన్యమున్నది. నిరసనకారులలో అత్యధికులు ముస్లిమేతరులు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్న వారు. మతాధార పౌరసత్వమనేది రాజ్యాంగ విహితం కాదని విశ్వసించడం వల్లే వారు ఆ నిరసనల్లో పాల్గొన్నారు.

యువ భారతీయులు ఆగ్రహ భార్గవులవుతున్నారు. యువజన రాజకీయాలలో ఒక నూతన పరిణామాన్ని మనం చూస్తున్నాము. గత వారం రోజులుగాను, ఆ మాటకొస్తే గత కొద్ది నెలలుగా చోటు చేసుకొంటున్న వివిధ సంఘటనలు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే ఆ కొత్త పవనం మన జాతీయ రాజకీయాలనే మార్చివేయగల స్థాయిలో ప్రచండంగా వీస్తోంది. ఇందుకు అవసరమైన ప్రభావశీలత ఆ యువజన ఉద్యమంలో ప్రగాఢంగా వున్నది. ఈ తరం భారతీయుల భావనా ప్రపంచాన్ని చైతన్యవంతం చేయగల ధీమంతులైన నాయకుల, భావాల అన్వేషణలో ఆ ఉద్యమం ప్రస్థానిస్తోంది.

జామియా మిలియా ఇస్లామియా నిరసనలలో పోలీసులు వ్యవహరించిన తీరుకు ఈ సువిశాల భారతదేశపు విద్యార్థిలోకం ఎలా ప్రతిస్పందించిందో గమనించారా? ఆ సద్యోజనిత ప్రతిస్పందనలు కేవలం మైనారిటీ వర్గాల విద్యార్థులు అత్యధికంగా వుండే జామియా, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, మౌలానాఅజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (హైదరాబాద్), నాద్వా కాలేజ్ లకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రగతిశీల రాజకీయ కార్యాచరణకు సుప్రసిద్ధ నెలవులైన జేఎన్‌యూ(న్యూఢిల్లీ), జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం (కోల్‌కతా), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(ముంబై)లో సహజంగానే ఆ నిరసనలు ఉధృతంగా ప్రతిధ్వనించాయి.

విశేషమేమిటంటే తాజా నిరసనలలో ఐఐటీల, ఐఐఎమ్‌ల, ఎఐఐఎమ్ఎస్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విద్యార్థులు కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, పూణే, చండీగఢ్, లక్నో, భోపాల్ నగరాలలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కలిసి ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా వివిధ చిన్న పట్టణాలలోని పలు విద్యా సంస్థల విద్యార్థులు కూడా జామియా విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం వ్యక్తం చేశారు.

అసాధారణమైన ఆందోళనలివి. విద్యార్థి దశ నుంచీ ఇంతవరకు ఇటువంటి ఆందోళనను నేను చూడలేదు. ఏ విశ్వవిద్యాలయ విద్యార్థుల ఉద్యమానికి ఇంత విస్తృత స్థాయిలో మద్దతు లభించిన సందర్భాలు చాలా అరుదు. అందునా విద్యార్థిలోకానికి మొత్తంగా ఎటువంటి హాని జరగడానికి ఆస్కారం లేని ‘ పౌరసత్వ సవరణ చట్టం’ (సిఏఏ) లాంటి అంశంపై ఆందోళనకు ఇంత విస్తృత స్థాయిలో సంఘీ భావం వెల్లువెత్తడం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం. నిరసనలు తెలుపుతున్న అలీగఢ్, జామియా, జేఎన్‌యూ విద్యార్థులతోను, ఇండియా గేట్ వద్ద సంఖ్యానేకంగా గుమిగూడిన విద్యార్థులనుద్దేశించి నేను మాట్లాడాను.

ఏ రాజకీయ బృందమూ సమీకరించకుండా సిఏఏ వ్యతిరేక నిరసనల్లో విద్యార్థులు అసంఖ్యాకంగా పాల్గొవడం నాకు ఎంతైనా విస్మయం కల్గించింది. ఆ యువజన చైతన్యం నన్ను విశేషంగా కదిలించింది. ఇండియా గేట్ వద్ద నిరసనలలో పాల్గొన్న విద్యార్థులు, యువజనులలో అత్యధికులు పౌరసత్వ సవరణ చట్టంతో నేరుగా ప్రభావితులయ్యే రెండు వర్గాల- ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాలకు చెందినవారు కాదు.

ఎన్నడూ లేని విధంగా విద్యార్థినులు చాలా పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొనడం మరింత ముఖ్యమైన విషయం. తమ సొంత ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా సమీకృతులైన వ్యక్తులు పెద్ద ఎత్తున పాల్గొవడమనేది ఏ ప్రధాన ఉద్యమానికైనా చాలా అవసరం. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేక ఉద్యమంలో ఇది ఖచ్చితంగా సంభవించింది. కనుకనే అత్యంత ప్రతికూల పరిస్థితులలోను జామియా విద్యార్థులు తమ ఉద్యమంలో గణనీయమైన ఫలితాన్ని సాధించారు. జామియా మిలియా ఇస్లామియాలో విద్యార్థులు నానా అరాచకాలకు పాల్పడ్డారన్న అధికారిక కథనాలకు మీడియా తొలుత ప్రాధాన్యమిచ్చింది.

అయితే ఆ వెన్వెంటనే విద్యార్థులకు వ్యతిరేకంగా పోలీసుల అమానుష చర్యలకు సంబంధించిన వార్తలు వెల్లువెత్తాయి. నిరసనకారులు దాదాపుగా ప్రతి ఒక్కరి వద్ద మొబైల్ కెమెరాలు వుండడం, సామాజిక మాధ్యమాల విస్తృతి, ప్రభావశీలత విద్యార్థులపై దమనకాండ వార్తల వెల్లువకు ఎంతైనా దోహదం చేసింది. అలాగే పలువురు కళాకారులు, నటీనటులు కూడా విద్యార్థుల నిరసనలకు శీఘ్రంగా మద్దతు తెలిపారు. పోలీసులు, నిరసన తెలుపుతున్న జామియా విద్యార్థుల వెంటబడి తరుముతూ లైబ్రరీ, హాస్టళ్ళలోకే గాక నివాస ప్రాంతాలలోకి కూడా అనుమతి లేకుండా చొరబడిన దృశ్యాలను చూపుతున్న వీడియోలను ఎట్టి పరిస్థితులలోను ఉపేక్షించలేము. సాధారణ విద్యార్థులు తమ ఇంగిత జ్ఞానంతో సిఏఏ వ్యతిరేక నిరసనలకు మద్దతునివ్వకపోతే వాటి ప్రభావం ఇంతగా వుండేది కాదని స్పష్టంగా చెప్పవచ్చు.

ఈ నిరసనలను మరింత లోతుగా పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా వివిధ ఉన్నత విద్యా సంస్థలలో కొంత కాలంగా రాజుకొంటున్న అశాంతిని అవి ప్రతిబింబిస్తున్నాయని విశదమవుతుంది. విశ్వవిద్యాలయాలు క్రమంగా కేంద్రం, రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు దాసోహమంటున్నాయి. ఉన్నత విద్యా సంస్థల అధిపతులు తరుచూ సంకుచితంగా, కక్ష పూరితంగా వ్యవహరించే ప్రభుత్వాధికారుల్లా ప్రవర్తిస్తున్నారు. స్ఫూర్తిదాయక మార్గదర్శకత్వాన్ని నెరపడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా విద్యార్థుల, అధ్యాపకుల విశ్వాసాన్ని పొందలేకపోవడమే గాక తరచూ వారి అవహేళనలకు గురవుతున్నారు.

అటు విద్యార్థులకు, ఇటు అధ్యాపకులకు ఊపిరాడనివ్వని పరిస్థితులు కేంపస్‌లలో పెరిగిపోతున్నాయి. కేంపస్ జీవితం అంతకంతకూ నిరుత్సాహకరంగా మారిపోతోంది. విద్యార్థులపై అంతకంతకూ ఆంక్షలు పెరిగిపోతున్నాయి. విద్యార్థి సంఘాలను నిషేధించకపోయినప్పటికీ వాటి కార్యకలాపాలను నిరుత్సాహపరుస్తున్నారు. ఒక విద్వజ్ఞుని ప్రసంగాన్ని ఏర్పాటు చేయాలన్నా, ఒక సదస్సును నిర్వహించాలన్నా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అయిపోయింది. సామాజిక మాధ్యమాలు నిరంతర పరిశీలనలో వుంటున్నాయి. ఫేస్ బుక్ లో ‘ఆక్షేపణీయ’ వ్యాఖ్యలు పోస్ట్ చేసిన విద్యార్థులను శిక్షిస్తున్నారు. హాస్టల్ టైమింగ్స్, ఇతర నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాలని విద్యార్థినులను హాస్యాస్పదంగా కట్టడి చేస్తున్నారు. సహచర విద్యార్థులతో వారి సంబంధాలను నిఘా బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యార్థినీ విద్యార్థులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

జామియాలో పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసన, కేంపస్‌లలో ఊపిరాడనివ్వని, అణచివేత పరిస్థితులపై నిరసన కూడా. ఈ విద్యార్థులలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి, వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన తొలితరం విద్యావంతులు. కన్న ఊళ్ళలోని పరిస్థితులకు భిన్నంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను తొలిసారి ఆస్వాదిస్తున్నవారు. ఈ స్వేచ్ఛను వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరు. మరి ‘అజాది’ నేటి యువతరానికి అత్యంత ఉత్తేజకరమైన పిలుపు కావడంలో ఆశ్చర్యమేముంది? దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు జామియా, అలీగఢ్ విశ్వవిద్యాలయాల విద్యార్థులకు సంఘీభావం వ్యక్తం చేయడానికి మాత్రమే కాదు, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడానికి కూడా అన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించకూడదు.

ఈ నిరసనలకు అనివార్యంగా ఒక రాజకీయ ప్రాధాన్యమున్నది. నిరసనలలో పాల్గొనే విద్యార్థులలో అత్యధికులు ముస్లిమేతరులు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నవారు. మతాధార పౌరసత్వమనేది రాజ్యాంగ విహితం కాదని విశ్వసించడం వల్లే వారు ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంలో ముస్లింలు, ఈశాన్య రాష్ట్రాల ప్రజలతో పాటు విద్యార్థులు, యువజనులు తమ నిరసనలతో ప్రధాన భాగస్వాములయ్యారు. ఇక్కడ కూడా సమస్య కేవలం పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సి) మాత్రమే కాదు. దేశ విభజన కాలంలోను లేదా మధ్యయుగాలలో ముస్లిం పాలకులు పాల్పడిన తప్పులను సరిదిద్దడానికి ప్రస్తుత పాలకులు పూనుకున్న వివిధ ప్రాజెక్టులతో వారు విసిగిపోయారు. ఎన్నడో జరిగిన చారిత్రక అఘాయిత్యాలకు ఇప్పుడు ప్రతీకార ధోరణితో వ్యవహరించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వర్తమానంలో సంతోషంగా జీవించాలని, భవిష్యత్తులోకి సంపూర్ణ భద్రతతో ప్రయాణించాలని వారు కోరుకుంటున్నారు.

ఇక విద్యా ఉద్యోగరంగాలలో అసమాన అవకాశాల సమస్య ఉండనే ఉన్నది. ఫీజుల పెంపుదలపై కొనసాగుతోన్న జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన వాస్తవానికి ఈ మౌలిక సమస్య మీదే జరుగుతోంది. ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడమే కాదు, జీవితోన్నతికి ఉపయుక్తంగా కూడా లేదు. విద్యార్థి సహాయ కార్యక్రమాలు, పథకాలు అనేవి అత్యంత లజ్జాకర విషయాలుగా కొనసాగుతున్నాయి. ఉన్నత విద్యారంగ ప్రమాణాలు ఒక జాతీయ కళంకం కాలేదంటే అందుకు కారణం ఆ రంగాన్ని గురించి సమగ్ర సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో సేకరించడానికి ఎవ్వరూ సరైన శ్రద్ధ చూపక పోవడం వల్లేనని చెప్పవచ్చు.

కొత్తతరం విద్యార్థులు ఉన్నత విద్యారంగంలోకి ప్రవేశించడంతోనే సంతృప్తిచెందడం లేదు. కొత్త ఆకాంక్షలను తీసుకు వస్తున్నారు. అయితే విశ్వవిద్యాలయ విద్య తమకు మంచి ఉద్యోగాన్ని సాధించిపెట్ట లేదన్న వాస్తవాన్ని వారు అర్థం చేసుకున్నారు. మన దేశంలో నిరుద్యోగం చాలా అధికస్థాయిలో ఉన్నది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాని పరిస్థితి. 19-–24 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కళాశాల పట్టభద్రులలో నిరుద్యోగం మరీ ఎక్కువగా వున్నది. 24 ఏళ్ళకు పైగా వయస్సున్న ఆ పట్టభద్రులలో నిరుద్యోగ రేటు తగ్గిపోయింది. కోరుకున్న ఉద్యోగం రావడం వల్ల గాక, జీవితంలో స్థిరపడడానికి ఏదో ఒక ఉద్యోగంలో చేరడం వల్లే ఆ పట్టభద్రులలో నిరుద్యోగ రేటు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని చెప్పి తీరాలి. ఈ యువజనుల అసంతృప్తి కూడా గత కొద్ది రోజులుగా వెల్లువెత్తుతోన్న నిరసనలకు కారణం కావడంలో ఆశ్చర్యమేముంది?

విద్యార్థుల ఉద్యమం స్వతస్సిద్ధంగా ప్రజ్వరిల్లింది. అది మరింత మమ్మురమవుతుంది. దానికి ఇంకా ఒక సంస్థాగత నిర్మాణం లేదు. ఉద్యమం ప్రగాఢమై ప్రభావశీలమవ్వాలంటే అది ఒక నిర్దిష్ట రూపాన్ని తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. యువ నాయకులు పలువురు ప్రభవిస్తున్నారు. అయితే ఉద్యమాన్ని సమైక్యపరిచి, పటిష్ఠం చేయగల దీక్షాదక్షతలు వారిలో కొరవడ్డాయి. స్ఫూర్తిదాయకమైన కొత్త భావాల కోసం కూడా ఉద్యమం ఆరాటపడుతున్నది. జీవితోన్నతికి అవరోధంగా వున్న ఆర్థిక, సామాజిక శృంఖలాలను త్రెంచు కోవాలన్న వారి కోరికను ఉదారవాదంగాను, గౌరవప్రదమైన జీవనాధారాన్ని సముపార్జించుకోవాలన్న వారి ఆకాంక్షను ఒక సామ్యవాద విప్లవాన్ని సాధించగలిగేదిగాను అర్థం చేసువడం పొరపాటు అవుతుంది. అది ఇంకా, ఒక నామధేయం కోసం అన్వేషిస్తోన్న ఉద్యమమే

(Courtesy Andhrajyothi)