– కాశ్మీర్‌లో పౌరుడిపై జవాను కాల్పులు..మృతి
– పోలీసుల వాదన పూర్తిగా అవాస్తవం : మృతుడి కుటుంబీకులు

శ్రీనగర్‌ : చెక్‌పాయింట్స్‌ వద్ద తన వాహనాన్ని ఆపకుండా వెళ్లాడని జమ్మూకాశ్మీర్‌లో ఓ పౌరుడిపై సీఆర్‌పీఎఫ్‌ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పౌరుడు మృతి చెందాడు. అయితే పోలీసులు చేస్తోన్న ఆరోపణలను మాత్రం మృతుడి కుటుంబీకులు ఖండిస్తున్నారు. ఈ ఘటన బుద్గాం జిల్లాలో చోటు చేసుకున్నది. పీర్‌ మేరాజుద్దీన్‌(23).. శ్రీనగర్‌-గుల్మార్గ్‌ రహదారిపై తన మామతో కారులో వెళ్తుండగా దారిలో ఉన్న ఒక చెక్‌పోస్టు వద్ద జవాను ఆయనపై కాల్పులు జరిపాడు. అంతకముందు మేరాజుద్దీన్‌ రెండు చెక్‌పోస్టుల వద్ద వాహనాన్ని ఆపకుండా వెళ్లాడనీ, దీంతో భద్రతా దళాలు కాల్పులు జరపాల్సి వచ్చిందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రత్యక్ష సాక్షులు, మృతుడి కుటుంబీకులు మాత్రం పోలీసులు చెప్పినదాంట్లో వాస్తవం లేదని ఆరోపించారు.

మృతుడి మామ గులాం హసన్‌ షా జమ్మూకాశ్మీర్‌ పోలీసు విభాగంలో ఏఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీనగర్‌లోని పోలీసు కంట్రోల్‌ రూం వద్ద డ్రాప్‌ చేయడానికి మేరాజుద్దీన్‌ తనతో వచ్చాడనీ, రెండు చెక్‌ పోస్టుల వద్ద పోలీసులకు తన ఐడీ కార్డు చూపడంతో ముందుకెళ్లడానికి భద్రతా సిబ్బంది అనుమతిచ్చిందని హసన్‌ షా చెప్పారు. తాము ఎక్కడా చెక్‌పోస్టులను ఉల్లంఘించలేదనీ, జవాను అకారణంగా కాల్పులు జరిపడంతో మేరాజుద్దీన్‌ చనిపోయాడని గులాం హస్సన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

కాల్పులను ఖండించిన పలు పార్టీలు
ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అక్కడి 2జీ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. మేరాజుద్దీన్‌ మృతితో ఆయన సొంత గ్రామంలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌, ఫైరింగ్‌ పెల్లెట్లను నిరసనకారులపై ప్రయోగించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పజెప్పారు. కాగా, ఈ కాల్పుల ఘటనను ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు ఖండించాయి. ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తును జరిపించాలని డిమాండ్‌ చేశాయి.

Courtesy Nava Telangana