• వనస్థలిపురం డీమార్ట్‌ వద్ద ఇంటర్‌ విద్యార్థి మృతి
  • కొట్టడం వల్లేనని తండ్రి ఆరోపణ
  • కొట్టలేదు.. ఫిట్స్‌ కావచ్చు: డీమార్ట్‌
  • లంబాడీ ఐక్యవేదిక నాయకుల ధర్నా

వనస్థలిపురం/హయత్‌నగర్‌ : వనస్థలిపురంలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. డీమార్ట్‌లో షాపింగ్‌కు వెళ్లిన ఓ ఇంటర్‌ విద్యార్థి అదే డీమార్ట్‌ ఎదుట అనుమానాస్పద స్థితిలో  చనిపోయాడు. చాక్లెట్‌ దొంగిలించాడన్న నెపంతో సెక్యూరిటీ గార్డులు తమ కుమారుడిని కొట్టారని, అందువల్లే చనిపోయాడని ఆ విద్యార్థి  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  సూర్యాపేట జిల్లా జెగ్గుతండాకు చెందిన లావుడ్యా సతీశ్‌(17) హయత్‌నగర్‌లోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నాడు.

ఆదివారం రాత్రి ఇద్దరు మిత్రులతో కలిసి వనస్థలిపురం డీమార్ట్‌కు వెళ్లాడు. అక్కడ సతీశ్‌ చాక్లెట్లను దొంగిలించాడని సెక్యూరిటీ గార్డులు అతన్ని తనిఖీ చేశారు. సతీశ్‌తో వచ్చిన మిత్రులు అప్పటికే పారిపోయారు. సతీశ్‌ కూడా పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడు డీమార్ట్‌ ముందు తాళ్లతో ఏర్పాటు చేసిన బారికేడ్‌ను దాటుతూ కిందపడ్డాడు. వెంటనే ప్రైవేటు అస్పత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. అయితే సెక్యూరిటీ గార్డులు కొట్టడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని సతీశ్‌ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న లంబాడీల ఐక్య వేదిక నాయకులు సోమవారం డీమార్ట్‌ వద్ద, కాలేజీ ఎదుట ధర్నాలు నిర్వహించారు. డీమార్ట్‌ అద్దాలను ధ్వంసం చేశారు. పోలీసులు పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, చెప్పులు కొనుక్కోవాలని అడిగితే,  గార్డియన్‌ అనుమతితోనే సతీశ్‌ను బయటికి పంపించామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది. తమ భద్రతా  సిబ్బంది సతీశ్‌పై దాడి చేయలేదని డీమార్ట్‌ యాజమాన్యం చెప్పింది. అతడికి ఫిట్స్‌ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది. డీమార్ట్‌లోని సీసీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని వనస్థలిపురం ఇన్‌సెక్టర్‌ వెంకటయ్య తెలిపారు.

Courtesy Andhrajyothi