• యువకుడి బాబాయి మృతి
  • ఆగ్రహంతో అమ్మాయి కుటుంబంపై ప్రతిదాడి

బయ్యారం : తమ కూతురిని ప్రేమవివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి కుటుంబీకులు కక్షగట్టారు. అతడిపై దాడి చేసేందుకు యత్నించి, యువకుడి బాబాయిని హత్య చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడి కుటుంబీకులు అమ్మాయి కుటుంబంపై దాడికి దిగారు. వరసగా చోటుచేసుకున్న ఈ ఘటనలు మహబూబాబాద్‌లో కలకలం రేపాయి. గార్ల మండలం పోచారానికి చెందిన మాతంగి ప్రశాంత్‌, అదే గ్రామానికి చెందిన లావణ్యను 3 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అమ్మాయి తండ్రి కోటయ్య అంగీకరించలేదు. ఈ క్రమంలో సింగారం-2లో తాపీ పనిచేస్తున్న ప్రశాంత్‌ వద్దకు బుధవారం సాయంత్రం వెళ్లి దాడికి దిగారు.

ప్రశాంత్‌, తన బాబాయి మాతంగి రమణయ్యతో కలిసి బయ్యారం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరారు. ఇంతలో వారిని అడ్డుకున్న అమ్మాయి తరపు బంధువులు, వారి కళ్లల్లో కారం చల్లారు. రమణయ్యను ఓ గదిలో నిర్బంధించి.. తీవ్రంగా కొట్టి పరారయ్యారు. ప్రాణాపాయ స్థితికి చేరిన రమణయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతుడి బంధువులు కోపంతో ఊగిపోయారు. గంధంపల్లిలో అమ్మాయి బంధువుల దుకాణంపై దాడి చేసి నిప్పుపెట్టారు. రమణయ్య హత్యకు సంబంధించి 8మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Courtesy Andhrajyothi