చైతన్య

గత ఏడు దశాబ్దాల్లో లేనంతగా పార్లమెంట్‌కు ఎన్నికైన సభ్యులు తొలిసారి 2019లో వివిధ దేవుళ్ల మీద ప్రమాణం చేశారు. ఇప్పటి వరకు చట్టసభలకు ఎన్నికైన వాళ్లు రాజ్యాంగాన్ని మనసా వాచా కర్మణా అమలు చేస్తామని రాజ్యాంగ బద్ధులమై ఉంటామని ప్రమాణం చేసేవాళ్లు. ఈ లౌకిక సాంప్రదాయానికి భిన్నంగా 2019లో బీజేపీ ఎంపీలు ఇష్టం వచ్చిన దేవుళ్ల మీద ప్రమాణం చేసి ఎంపీలుగా పని చేస్తామని లోక్‌సభ వేదికగా ప్రకటించారు. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఎవ్వరికీ కనిపించలేదు. ఈ బరితెగింపే 370 అధికరణం రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితా రూపకల్పన వంటి నిర్ణయాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయబూనుకున్న ‘పౌరసత్వ’ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా సాగుతున్న ఆందోళనలు లౌకికతత్వం గురించిన చర్చను మరోసారి ముందుకు తెస్తున్నాయి. సాధారణంగా లౌకికతత్వానికి రెండు కోణాలున్నాయి. తాత్విక కోణం. రాజకీయ కోణం. తాత్విక కోణం నిర్దిష్ట సమాజ పరిణామంలో అభివృద్ధి చెందుతూ వస్తే రాజకీయ కోణం నిర్దిష్ట రాజకీయ అవసరాల మేరకు రూపుదిద్దుకుంటూ వచ్చింది. తాత్విక కోణంలో చూసినప్పుడు ఫ్రెంచ్‌ తాత్వికులు వోల్టెయిర్‌, మాంటెస్క్యూ ప్రతిపాదించిన అధికారాల విభజన సిద్ధాంతం ప్రామాణికంగా కనిపిస్తోంది. మాంటెస్క్యూతో మొదలైన ఈ సిద్ధాంతం వోల్టేర్‌ నాటికి మరింత పరిణితి చెందింది. రాజ్యం, మతం మధ్య అధికారాలు విభజనతో పాటు మతం రాజ్యం అవసరాలకు లోబడి ఉండాలని వోల్టేర్‌ సూత్రీకరించాడు. ఈ విలువలన్నింటినీ 1789 నాటి డిక్లరేషన్‌ ఆఫ్‌ రైట్స్‌ ఆఫ్‌ మాన్‌ అండ్‌ సిటిజన్‌ (మానవుల, పౌరుల హక్కుల ప్రకనటన)లో క్రోడీకరిస్తుంది ఫ్రెంచి సమాజం. ఈ కాలాన్నే ఆధునిక యూరప్‌ చరిత్రలో పునరుజ్జీవన యుగంగా పిలుస్తుంటారు. అంటే దాదాపు 600 సంవత్సరాల మేధో యుద్ధం తర్వాత పౌర జీవనంలో ఐహిక విషయాలు రాజ్యం ఆధిపత్యం కిందకు, పరలోక విషయాలు మతం, నమ్మకం పరిధికి వచ్చాయి. సుదీర్ఘ చారిత్ర పరిణామాల పర్యవసానమే పౌరసత్వ నిర్ధారణలో ప్రతిఫలించింది. మనిషిని మనిషిగా చూసే పౌరసత్వ చట్టాలు ఉనికిలోకి వచ్చాయి.

అమెరికా అధ్యక్షుడు థామస్‌ జెఫర్సన్‌ లేఖ ఈ చర్చకు మరింత సమగ్రత సమకూర్చింది. ”మతం అన్నది మనిషికి దేవుడికి సంబంధించిన వ్యవహారం. తన విశ్వాసానికి, నమ్మకానికి మనిషికి మరొకరి అనుమతి అవసరం లేదు. ఏ రకమైన రాజ్యమతాన్ని ఏర్పాటు చేయరాదనీ, మత విశ్వాసాల కల్పనకు అవరోధాలు కల్పించరాదన్న అమెరికా రాజ్యాంగ స్పూర్తిని మీ దృష్టికి తెస్తున్నాను” అంటూ 1802లో డాన్బరీ బాప్టిస్ట్‌ అసోషియేషన్‌కు రాసిన లేఖలో జెఫర్సన్‌ ప్రస్తావిస్తాడు. అటువంటి వాటిలో ఆధునికమైనదనీ, సమగ్రమైనదే కాక బహిర్గత, అంతర్గత దోపిదీ అణచివేతలనుంచి వ్యక్తిని విముక్తి చేసేదిగా భారతీయ పౌరసత్వ చట్టం ఉంది. అటువంటి చట్టం స్థానంలో మళ్లీ తిరిగి ఆరేడు శతాబ్దాల తర్వాత మనిషి అస్తిత్వం, సాంఘిక జీవనానికి మతపరమైన ప్రాతిపదిక పునరుద్ధరించటానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన ఈ గతకాలపు మితవాదపు విలువలను ప్రశ్నించేందుకు, ప్రతిఘటించేందుకు జరుగుతున్న ప్రతిఘటనే.

ఈ ప్రతిఘటన లౌకికతత్వం గురించిన చర్చను మరోసారి ముందుకు తెస్తోంది. ఇప్పటివరకు మనం చూస్తోంది అవకాశవాద లౌకికవాదం. రాజ్యాంగం స్పష్టమైన భాషలో పరమత సహనాన్ని ప్రతిపాదించినా ఆచరణలో ఒక మతాన్ని, ఓ విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకుని సాగే రాజకీయాలను నియంత్రించటంలో రాజ్యం, రాజ్యాంగ యంత్రం ఘోరంగా విఫలమైంది. ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌ జిల్లా పోలీసు ప్రధానాధికారి ముస్లింలకు వ్యతిరేకంగా మూకను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించటం ఇంతకాలం రాజ్యాంగ యంత్రంలో కీలక భాగమైన కార్యనిర్వహణాధికార వర్గంలో రాజ్యాంగ స్ఫూర్తిని నింపలేకపోయిన ఫలితమే. స్వయంగా ముఖ్యమంత్రి హౌదాలో ఉండి ఒక హిందువు తల తీస్తే పదిమంది ముస్లింల తలలు తీస్తామని బరితెగించి ఉపన్యాసం చేసిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అజరు బిస్ట్‌ అలియాస్‌ యోగి ఆదిత్యనాధ్‌ ఈ వైఫల్యానికి మూర్తీభవించిన రూపం. అన్ని రాష్ట్రాల్లోనూ ఇటువంటి వాళ్లు మనకు తారసపడతారు.

రాజ్యాంగం పరమత సహనాన్ని, అన్నిమతాల మధ్య వైరంలేని సహజీవనాన్ని పెంపొందించాలని ఆశించింది. పాఠశాల సిలబస్‌ మొదలుకుని పరిశోధనా సంస్థల వరకు మనం పిల్లలకు బోధించే సిలబస్‌ను క్రమక్రమంగా లౌకిక విలువలకు, రాజ్యాంగం ఆదేశించిన లౌకిక విలువలకు ప్రాతినిధ్యం వహించేదిగా మార్చుకుంటూ వస్తున్నాం. నేడు ఆందోళన పథంలో ఉన్న యువతరమంతా అటువంటి విలువలతో కూడిన విద్యా విధానంలో శిక్షణ పొందినవారే. రాజ్యాంగం పట్ల, రాజ్యాంగ విలువల పట్ల ఈ తరానికి, పాలకులకు మధ్య దృక్పథాల్లో వైరం ఉంది. ఈ తరం భవిష్యత్తును దర్శిస్తోంది. పాలకవర్గం మద్దతుతో సంఫ్‌ు పరివారం భావి భారత భవిష్యత్తును మధ్యయుగాల నాటి విలువల్లో దర్శిస్తోంది. గీతను రాజ్యాంగంగా మార్చాలన్న డిమాండ్‌ ముందుకు తెచ్చినా, లేదా కనీసం రాజ్య గ్రంథంగా ప్రకటించాలని సుష్మాస్వరాజ్‌ వంటి వాళ్లు, హర్యానా ముఖ్యమంత్రి వంటి వాళ్లు డిమాండ్‌ చేసినా 21వ శతాబ్ది దిశగా అడుగులు వేస్తున్న భారతదేశానికి మధ్యయుగాల సంకుచిత మనస్తత్వాన్ని మేధోచింతన అంటగట్టే ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగానే యువతరం గొంతెత్తింది. రాజ్యాంగం అందించిన లౌకిక స్పూర్తికి జవసత్వాలు చేకూర్చేందుకు సాగుతున్న ఉద్యమం ఇది.

యువతరం అంటే జూలాయిగా తిరుగుతారని, సమాజం పట్ల ఎటువంటి బాధ్యతలు, లోతైన అవగాహన లేదని, తమకు సంబంధించిన సంకుచిత సమస్యల కోసం మాత్రమే ఆందోళనలు చేస్తారని తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. తాజాగా జగ్గీ వాసుదేవ్‌ వీడియలో ఇలాంటి ధోరణి మనం చూడొచ్చు. స్వయంగా తాను పౌరసత్వ చట్టాన్ని చదవలేదని అంగీకరిస్తూనే కనీసం చట్టం చదవని వాళ్లంతా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్నారన్న తేలికపాటి విమర్శతో ఆయన చర్చ ప్రారంభిస్తాడు. పైగా ఇషా ఫౌండేషన్‌ తరఫున ట్విటర్‌లో పోలింగ్‌ కూడా నిర్వహించటానికి సిద్ధమయ్యాడు. చివరకు చట్టం కూడా చదవని వ్యక్తి తమకు పాఠాలు ఎలా చెప్తాడని నెటిజన్లు అందరూ విరుచుకుపడటంతో ఈ ట్విట్టర్‌ పోలింగ్‌ను ప్రతిపాదనను రద్దు చేసుకున్నాడు. ఇటువంటి వాళ్ల వద్దకు నమ్మకంతో ఏదో మేలు జరుగుతుందని, జరగాలని, ఆశించి జనం వెళ్లటం సహజం. ఈ దేశంలో 20వ శతాబ్దంలో పీఠాధిపతులు రాజకీయాలతో పెనవేసుకోవటం మొదలెట్టిన తర్వాత 21వ శతాబ్దం తొలి దశాబ్దం పూర్తి అయ్యే సమయానికి రాజకీయ నాయకుల్లాగే పీఠాధిపతులు కూడా జైళ్లపాలవుతున్నారు.

స్థూలంగా చైతన్యవంతమైన యువతను సమాజ నిర్మాణంలో అంతర్భాగం కానీయకుండా సాగే ప్రచారమే తప్ప ఇందులో వాస్తవం లేదని ‘పౌరసత్వ’ నిరసనలు రుజువు చేస్తున్నాయి. ఈ ఆందోళనలు ఏదో ఫీజులు తగ్గించమనో, సిలబస్‌ మార్చమనో, జీతాలు, రాయితీలు పెంచాలనో సాగుతున్న ఉద్యమం కాదిది. సమకాలీన పరిణామాలపై యువతరం తక్షణ స్పందన. రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా సాగుతున్న సార్వత్రిక ప్రతిఘటన. ఈ ప్రతిఘటనే రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో లౌకికతత్వాన్ని మరింత విపులంగా వ్యాఖ్యానిస్తోంది. భారతీయ సంస్కృతి అంటే క్రీస్తు పూర్వం వచ్చిన గ్రీకుల మొదలు, మధ్యయుగాల్లో వచ్చిన ముస్లింల వరకు అన్ని మతాలు, సంస్కృతుల సమ్మేళనం అన్నదే ఈ తరానికి తెలిసిన వాస్తవం.

పౌరసత్వం చట్టం, 370 రద్దు వంటి సమయాల్లో పదే పదే వినిపించిన ధోరణి ఒకటి ఉంది. ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు కాబట్టే బీజేపీ చేసే అన్ని పనులకు ప్రజల మద్దతు ఉంది, ఓడిపోయిన వాళ్లు ఓర్వలేక బీజేపీ చేపట్టే చర్యలపట్ల అసత్యాలు, అర్థ సత్యాలతో ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారు అన్నది ఈ ధోరణి. చట్టాలు ఆమోదించటానికి సంఖ్యాబలాన్ని కట్టబెట్టినంత మాత్రాన ఆమోదించే చట్టాలు సార్వత్రిక నైతిక సూత్రాలకు లోబడి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అధికార అహంకారాన్ని వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షం, బూర్జువావర్గం, పత్రికలు విఫలం కావటంతో యువతరం గొంతెత్తింది. రాజ్యాంగ విలువల కోసం సాగే ఈ పోరాటమే భావి భారత భాగ్య విధాత. దేశాన్ని మధ్యయుగాల సంకుచిత మేధో విలువల వైపు మళ్లకుండా వేసే ఆనకట్ట కాలగలదు. అందుకే ఈ ప్రతిఘట నోద్యమాన్ని ఊరూరా విస్తరింపచేయాలి.

(Courtesy Nava Telangana)