జావేద్ అఖ్తర్ Image result for జావేద్ అఖ్తర్"
కవి, సినిమా రచయిత
(హిందుస్థాన్ టైమ్స్)

హేతుయుక్తంగా ఆలోచించేవారు, శాంతివాదులు, ప్రేమ, ఐక్యత గురించి మాట్లాడేవారు జాతి వ్యతిరేకులు అనే భావన ఒకటి పాకిస్థాన్‌లో ప్రబలంగా ఉన్నది. మనమూ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని శిరసా వహిస్తున్నాం! పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతూ కాన్పూర్ ఐఐటి విద్యార్థులు ఆలపించిన మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత హమ్ దేఖేంగేహిందూ మత వ్యతిరేకమైనదని ఆ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ పెద్దలు భావించడమే అందుకొక తార్కాణం.

మతంతో సంకుచితంగా మమేకమవ్వడం వర్తమాన భారతదేశ వాస్తవాలలో ప్రముఖమైనది. అయినప్పటికీ పాత సంవత్సరం నిష్క్రమిస్తూ కొత్త సంవత్సరం ఆగమిస్తున్న వేళ సంభవించిన పరిణామాలు ఎంతైనా ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థ (కాన్పూర్‌లోని) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సైతం కొందరు, ఉర్దూ మహా కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ (1911–-84) కవిత్వం గురించి తమ అజ్ఞానాన్ని, అవగాహనా రాహిత్యాన్ని ప్రదర్శించడం నన్ను అమితంగా విస్మయపరిచింది. ఫైజ్ తన (స్ఫూర్తిదాయక, అజరామర కవితలు రచించిన) ఉర్దూ భాష గురించి గానీ, (ఉర్దూ) కవిత్వ సంప్రదాయాల గురించిగానీ, మరీ ముఖ్యంగా ఆ మహాకవి గురించి గానీ వారికి ఏమీ తెలియదనే విషయం విశదమైంది (ప్రస్తుతం మన దేశంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న యువ భారతీయుల ఉద్యమంలో ఆ కవిత ఒక వివాదానికి కేంద్రమయింది). ‘హమ్ దేఖేంగే’ కవితను ఫైజ్ మహాకవి ఎటువంటి దుస్తర పరిస్థితులలో రాశారన్న విషయమై కూడా కాన్పూర్ ఐఐటి పెద్దలకు ఎలాంటి అవగాహన లేదని కూడా స్పష్టమయింది.

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టోను జనరల్ జియా ఉల్ హక్ 1977లో అధికారం నుంచి కూలదోశాడు. దరిమిలా జనరల్ జియా అత్యంత నిరంకుశంగా పాకిస్థాన్‌ను పాలించాడు. జియా మత ఛాందసవాది. ఆయన పాలనలో పాకిస్థాన్ ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జియా మత ఛాందసవాద, తాలిబానీకరణ పాలనను ప్రతిఘటిస్తూ ఫైజ్ అహ్మద్ ఫైజ్ 1979లో రాసిన కవితే ‘హమ్ దేఖేంగే’. పాకిస్థానీ మహిళలు చీర కట్టుకోవడాన్ని జియా నిషేధించారు. ఆ సైనిక పాలకుని ఆదేశాన్ని ధిక్కరిస్తూ ప్రముఖ గాయని ఇక్బాల్ బానో (1935–2009) నల్ల చీర ధరించి లక్షలాది ప్రజలు పాల్గొన్న ఒక బహిరంగ సభలో ఫైజ్ గీతాన్ని ఆలాపించారు. ఫైజ్ కవిత చైతన్య భావ లహరికి, ఇక్బాల్ బానో గాన ఝరికి భావావేశపరులైన జనావళి ముక్తకంఠంతో ఇంక్విలాబ్ జిందాబాద్ అని తమ సైనిక పాలకుని గుండెలు పిక్కటిల్లేలా పదే పదే నినదించారు.

‘హమ్ దేఖేంగే’ హిందూ మత వ్యతిరేక పద్యమని ఆక్షేపించడం అర్థర‍‍హితం. ఎంత అసంబద్ధమంటే- కరడుగట్టిన భారత్ వ్యతిరేకి, మత ఛాందసవాది, తాలిబని మనస్తత్వంతో వ్యవహరించిన జనరల్ జియా ఉల్ హక్ హిందూ మత అభిమాని అని అనడమే సుమా! మహాకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ మతవాది కానే కాదు. ఆయన అజ్ఞేయవాది లేదా నిరీశ్వర వాది. ‘హమ్ దేఖేంగే’ కవితను రచించక ముందు కూడా ఒక పరిపూర్ణ శాంతి వాదిగా ఆయన మతాల అమానుషాలను నిరసిస్తూ పలు కవితలు రాశారు. ‘సుబహే- ఆజాదీ’ (1947ఆగస్టు) అనేది అందుకొక ఉదాహరణ. భారత దేశ విభజన ఆయనను అమిత ఆవేదనకు గురి చేసింది. ఆ సందర్భంగా రాసిన కవితే ‘స్వాతంత్ర్యోదయం’. ఫైజ్ తన వ్యధిత హృదయాన్ని ఇలా ఆవిష్కరించాడు:

‘ఏ దాగ్ దాగ్ ఉజాలా, యే షబ్––గజీదా సహర్
వో ఇంతిజార్ థా జిస్ కా యే వో సహర్‌ తో నహీఁ
ఏ వో సహర్ తో నహీ జిస్ కి ఆర్జూ లే కర్
చలే ధే యార్ కె మిల్ జాయేగీ కహీఁ నా కహీఁ’
(రక్తపు మరకలతో ఆచ్ఛాదితమైన ఈ స్వాతంత్ర్య వేకువ
నిశీధి కాటు వేసిన ప్రభాతం.
ఆశించిన ఉషోదయం కాదు ఇది.
ప్రగాఢంగా ఆకాంక్షించి, ఎక్కడో ఒక చోట కలుసుకోవచ్చని
మిత్రులు నిండునమ్మకంతో బయలుదేరింది ఈ ఉషస్సు కోసం కాదు)

పైజ్ అజ్ఞేయవాద లేదా నాస్తికవాద భావాలు తరచు ఆయన కవిత్వంలో ప్రతిబింబిస్తుంటాయి. ఉదాహరణకు ‘దువా’ (ప్రార్థన) అన్న కవితను చూడండి:

‘ఆయియే హాథ్‌ ఉఠాయే హామ్ భీ
హమ్ జిన్హే రస్నే దువా యాద్ నహీఁ
హమ్ జిన్హే సోజే మొహబ్బత్ కె సివా
కోయీ బూత్ కోయీ ఖుదా యాద్ నహీఁ’
(రా, మనం కూడా భక్తి ప్రత్తులతో చేతులు ఎత్తి నమస్సులు అర్పిద్దాం
ప్రార్థించే సంప్రదాయాన్ని మరచిపోయిన మనం
భగవంతుని కోసం ప్రేమతో జ్వలించడం మినహా
ఏ ప్రతిమనూ పూజించని, ఏ వేలుపునూ ధ్యానించని మనం…)

కాన్పూర్ ఐఐటిలో ఫైజ్ కవిత ‘హమ్ దేఖేంగే’ పట్ల వ్యక్తమయిన అభ్యంతరాలు ముఖ్యంగా ఈ చరణాల పట్ల ఆక్షేపణే అయివుండవచ్చు:

‘జబ్ అర్జే–ఖుదా కే కాబా
సబ్ బూత్ ఉఠాయే జాయేంగే
హమ్ అహ్లే సఫా మర్దూ డే హరామ్,
మస్నద్ పే బిఠాయే జాయేంగే
సబ్ తాజ్ ఉచ్ఛలే జాయేంగే,
సబ్ తఖ్త్ గిరాయే జాయేంగే
బస్ నామ్ రహేగా అల్లా కా…’
(భగవంతుని నిలయం నుంచి
అనృత ప్రతిమలు తొలగించినప్పుడు
మనం, (మంగళప్రపదమైన ప్రదేశాలలోకి నిరోధింపబడిన) విశ్వాసులం
ఉన్నతాసనాలను అధిష్ఠించినప్పుడు
సింహాసనాలు కూలిపోయినప్పుడు
అల్లా కీర్తి మాత్రమే నిలుస్తుంది)

ఇక్కడ అర్జ్–ఎ–ఖుదాకే కాబా అంటే సౌదీ అరేబియాలోని కాబా కాదు, అది విశాల అవని అని అర్థం చేసుకోవాలి. అలాగే భూత్ అంటే ప్రతిమలనికాదు. కవి అర్థం తమను తాము దేవుళ్ళుగా భావించుకుంటున్న నియంతృత్వ పాలకులు అని. గమనార్హమైన విషయమేమిటంటే ఫైజ్ తాను తీవ్రంగా వ్యతిరేకించే మత ఛాందసవాదుల పదావళినే, నియంతృత్వ పాలకులకు వ్యతిరేకంగా తన సందేశాన్ని సకల ప్రజలకు అందించేందుకై, ఈ కవితలో ప్రతిభావంతంగా, అర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఈ విశేషమే ‘హమ్ దేఖేంగే’ను మహా ఆసక్తికరం చేసిందని చెప్పవచ్చు.

ఆ తరువాయి పంక్తి కూడా పూర్తిగా ఇదే విధమైన ప్రతీకాత్మకతతో నిండి వున్నది: ‘ఉఠేగా అనల్ హక్ కా నారా (‘నేనే సత్యం’ అన్నది జయ నినాదమవనున్నది). అనల్ -హక్‌ను ఉన్నది ఉన్నట్లుగా ‘అహం బ్రహ్మస్మి’ అని చెప్పవచ్చు. ఉపనిషత్తులు ప్రవచించిన ఈ భావన ఏకోశ్వరోపాసన మతాలయిన ఇస్లాం, జుడాయిజం, క్రైస్తవంకు పరాయి భావన. ఆ మూడు మతాల వారు సృష్టిని, సృష్టికర్తను రెండు వేర్వేరు అస్తిత్వాలుగా పరిగణిస్తారు. హిందూ అద్వైత వేదాంతం, ఇస్లామిక్ సూఫీ వాదం ఈ విభజనను అంగీకరించవు. ఈ రెండు భావ స్రవంతులూ సమస్తమూ- నక్షత్రాలు, పక్షులు, మానవులు- భగవంతుని అభివ్యక్తీకరణలే అని పూర్తిగా విశ్వసిస్తాయి. కనుక అనల్ -హక్ అనేది మీరు ఎంతగా విశ్వసించినా సంప్రదాయ ఇస్లామిక్ భావన కాదు.

చారిత్రకంగా చూస్తే అనల్-హక్ అని చెప్పడం చాలా సందర్భాలలో ఒక నేరంగా పరిగణించినట్టు అర్థమవుతుంది. 1659లో సర్మద్ షా అనే సూఫీ సాధువు అనల్ -హక్ అని ఘోషించినందుకు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ఆ ఫకీరుకు శిరచ్ఛేదం చేయించాడు. ఫైజ్ కవిత ‘హమ్ దేఖేంగే’ను జనరల్ జియా నిషేధించడానికి కారణాలలో ఒకటి ‘అనల్-హక్’ భావనను ఘోషించడమే. ఔరంగజేబు, జియా తరువాత అనల్-హక్ భావనను వ్యతిరేకిస్తున్నవారు కాన్పూర్ ఐఐటిలోని ఆక్షేపకులే. ఇంకా ఏమి చెప్పాలి? మరో పంక్తి ‘బస్ నామ్ రహేగా అల్లా కా…’ (అల్లా కీర్తి మాత్రమే నిలుస్తుంది)ని కూడా పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నారు. అల్లాను కవి ఫైజ్ ఎలా వర్ణించాడో చూడండి: ‘జో మంజర్ భీ హై నజర్ భీ’ (కన్పించేది, కన్పించిన దాన్ని సృష్టించినది అంతా ఆయనే). అంటే సృష్టి, సృష్టికర్త ఒకటే అని, భిన్న అస్తిత్వాలు కావని కవి ఉద్ఘోషించాడు. ఇంతకూ ఆ కన్పించేది ఎవరు? ప్రజలే. కవిత ఆఖరిపాదంలో కవి ఇలా అంటాడు: ‘ఔర్ రాజ్ కరేగి ఖల్ఖ్- ఎ-ఖదా, (అప్పుడు భగవంతుని ప్రజలే పాలన చేస్తారు). కవి ఇంకా ఇలా అంటాడు: ‘జో మై భీ హై, ఔర్ తుమ్ భీ హో’ (ప్రజలే నేను, కనుక మీరు కూడా). హమ్ దేఖేంగే, హమ్ దేఖేంగే (మనం చూస్తాం, మనం చూస్తాం) అనే స్ఫూర్తిదాయక శబ్దజాలంతో ఫైజ్ తన కవితను ముగిస్తాడు.

ఫైజ్ అహ్మద్ ఫైజ్ అజరామర కవితలలో ఇది ఒకటి మాత్రమే. తరచు మతఛాందసవాదులను సవాల్ చేస్తూ ఆయన ఆరు దశాబ్దాల పాటు కవిత్వం రాశాడు. ఆయన అవిభక్త భారతదేశపు కవి. దేశ విభజన అనంతరం కూడా ఉపఖండమంతటా ఆ మహా కవి భాషలు, మతాలు, దేశాలకు అతీతంగా ప్రజల గౌరవాదరాలు పొందాడు. స్వాతంత్ర్యానం‍తరం పాకిస్థాన్‌లో ఆయన చాలాకాలం జైల్లో మగ్గిపోయాడు. ‘రావల్పిండి కుట్ర’ (ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కమ్యూనిస్టులు పన్నిన కుతంత్రమని పాలకులు ఆరోపించారు)లో భాగస్వామి అన్న ఆరోపణను ఫైజ్ పై మోపారు. సోవియట్ యూనియన్ ఒత్తిడి చేయకుండా వుంటే పాక్ పాలకులు ఆ మహాకవిని ఉరితీసేవారనే చెప్పవచ్చు. జైలు నుంచి విడుదలయిన అనంతరం ఫైజ్ విదేశాల్లో ప్రవాసానికి వెళ్ళారు. స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన్ని మళ్ళీ జైల్లో పెట్టారు. ఫైజ్ తన అంతరాంతరాలలో భారతీయుడు అని పాకిస్థాన్ లోని కరడుగట్టిన మిత వాదులు భావించేవారు. హేతుయుక్తంగా ఆలోచించేవారు, శాంతివాదులు, ప్రేమ, ఐక్యత గురించి మాట్లాడేవారు జాతి వ్యతిరేకులు అనే భావన ఒకటి పాకిస్థాన్‌లో ప్రబలంగా ఉన్నది. మనమూ ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని శిరసావహిస్తున్నాం!

(Courtesy Andhrajyothi)