Image result for రామాయంపేటలో మరో మానవ మృగం" యువతిని నమ్మించి అత్యాచారం, హత్య
 డ్రైవరును హతమార్చి ఆటో దొంగతనం
 కేర్‌టేకర్‌గా చేరి హైదరాబాద్‌లో వృద్ధురాలిని మట్టుబెట్టి బంగారంతో పరారీ
రామాయంపేట – న్యూస్‌టుడే

ఆమె.. ఓ మధ్యతరగతి గృహిణి.. అనుకోని పరిస్థితుల్లో జైలుపాలైన భర్తను బయటకు తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాల్లో ఓ నేరగాడితో పరిచయమైంది. భారీగా బంగారం, డబ్బు దోచాను.. చెరువుగట్టు మీద దాచాను.. తవ్వుకుని తెచ్చుకుందాం రమ్మన్నాడు అతడు. అమాయకంగా వెంట వెళ్లింది ఆమె. అదే అదనుగా అత్యాచారానికి పాల్పడ్డాడు.. బయటపడుతుందనే ఉద్దేశంతో గొంతు నులిమి చంపేశాడు.

మెదక్‌జిల్లా రామాయంపేట కొత్త చెరువులో ఈనెల 13న దొరికిన గుర్తుతెలియని మహిళ కేసును పోలీసులు చేధించారు. మృతురాలు నిజామాబాద్‌ వినాయకనగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. నిందితుడు అదే జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్‌కుమార్‌గా తేల్చారు. ఈ కేసు వివరాలను తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ బుధవారం విలేకరులకు వెల్లడించారు. అరుణ్‌కుమార్‌ అప్పటికే పలు హత్యలు, దొంగతనాల కేసులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన స్నేహితుడికి ష్యూరిటీ ఇచ్చి నిబంధనలు పాటించకపోవడంతో కామారెడ్డి పోలీసులు కేసు పెట్టారు. దీంతో అతడు భార్యతో కలిసి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. సాయం చేస్తానంటూ అరుణ్‌ వారిని నమ్మించాడు. ఆ ప్రయత్నాలు ఫలించేలోపే అతడిని పోలీసులు అరెస్టు చేసి కామారెడ్డి జైలుకు తరలించారు. ఈ విషయాన్ని గ్రహించిన అరుణ్‌ అతడి భార్యతో చనువు పెంచుకున్నాడు. ఆమెను లోబరచుకోడానికి రకరకాల వస్తువులు కొని ఇచ్చాడు. భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని ఆశపెట్టాడు. తాను దొంగతనాలు చేసిన సొమ్ము, బంగారాన్ని ఒకచోట దాచిపెట్టానని, దాన్ని తీసుకొద్దామని నమ్మించాడు. ఈనెల 5వ తేదీ సాయంత్రం ఆమె స్కూటీపైనే నిజామాబాద్‌ నుంచి రామాయంపేట బయలుదేరారు. రాత్రి 7.30 సమయంలో కొత్తచెరువు చివరి వరకు తీసుకువెళ్లి.. ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. తప్పించుకొనే ప్రయత్నంలో హైదరాబాద్‌కు పారిపోతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ కేసును త్వరగా చేధించిన సీఐ నాగార్జునగౌడ్‌, ఎస్‌ఐలు మహేందర్‌, నార్సింగి రాజేష్‌, చేగుంట సుభాష్‌గౌడ్‌లను డీఎస్పీ అభినందించారు.

అరుణ్‌ నేర చరిత్ర ఇదీ..
* 2015, 2016 సంవత్సరాల్లో నిజామాబాద్‌, ముథోల్‌, ఆర్మూర్‌ మండలాలకు చెందిన ముగ్గురు మహిళలను పెళ్లాడాడు. అతడిని భరించలేక ఇద్దరు భార్యలు వదిలిపెట్టి పోయారు. ఆ విషయం దాచిపెట్టి మూడో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
* 2016లో అరుణ్‌ మరో ఇద్దరితో కలిసి ఒక ఆటో డ్రైవరును హత్యచేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో జైలుకెళ్లగా ఛాతీలో నొప్పి అంటూ ఎత్తు వేసి ఆసుపత్రికి తరలిస్తుండగా పరారయ్యాడు. ఈ కేసులో మూడేళ్ల శిక్ష పడగా, చంచల్‌గూడ జైలులో ఉండి బెయిల్‌పై వచ్చాడు.
* అదే సంవత్సరం నరేశ్‌ అనే వ్యక్తి కళ్లల్లో కారం చల్లి నిజామాబాద్‌లో ద్విచక్ర వాహనం దొంగిలించాడు.
* 2018లో హైదరాబాద్‌ తిరుమలగిరిలోని ఓ ఇంట్లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తూ ఆ ఇంటి యజమానురాలైన వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు.

(Courtesy Eenadu)