పబ్‌ల దందా వెనక ఎవరు?

హైదరాబాద్‌ సిటీ : ఓ వైపు సీఎం క్యాంప్‌ ఆఫీస్‌… మరో వైపు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, మాజీల నివాస స్థలాలు. ఎప్పుడు చూసినా పోలీసు పహరా.. బందోబస్తు ఉండే ప్రాంతం అయినా అర్ధరాత్రి ఘటనలకు కేంద్ర బిందువుగా మారుతోంది. గత నెలలో…అంతకు ముందు కూడా వార్తల్లోకెక్కిన పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ పబ్‌ ఘటన మరవక ముందే దాని పక్కనే మరో పబ్‌ వార్తల్లోకెక్కింది. అర్ధరాత్రి సమయంలో పబ్‌లలో.. వాటి ఆవరణలో పోకిరీలకు సినిమా తరహాలో యువతులను వెంబడించే ధైర్యం ఎక్కిడి నుంచి వస్తోందనేది ప్రశ్న. మహిళలు, యువతులు, చిన్నారులకు అభయమిస్తూ పోలీసు శాఖ ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. యువతులకు అర్ధరాత్రి రక్షణ కల్పించడంతో ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? సీఎం క్యాంప్‌ ఆఫీస్‌కు కూత వేటు దూరంలో రక్షించండి అంటూ యువతి పరుగులు తీయాల్సిన పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

కొనసాగుతున్న ఘటనలు
గతంలో పంజాగుట్ట పీఎస్‌ పరిధిలోగల ఓ పబ్‌లో అసభ్యంగా ప్రవర్తించారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఓ యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల సీరియస్‌ అయిన డీజీపీ ఏకంగా పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి విచారించారు. ఆ తర్వాత కూడా అదే పబ్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గత నెలలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి పెద్ద సంఖ్యలో యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లోని ఓ పబ్‌లో తనపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఓ నటి నాయకుడి కుమారుడిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఓ పబ్‌కు వస్తున్న యువతిని కొంతమంది యువకులు నడిరోడ్డుపై వెంబడించడం యువతుల భద్రత ప్రశ్నార్థకంగా మార్చింది. ఇన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా ఉన్న పబ్‌లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేది ప్రశ్నగా మారింది.
సమయపాలనలోనూ చర్యలు నిల్‌
పబ్‌ల నిర్వహణ… సమయ పాలన.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు మార్గదర్శకాలు మాత్రం జారీ చేస్తున్నారు. వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. పబ్‌ల అనుమతులు జీహెచ్‌ఎంసీ నియమావళికి లోబడి ఉండటంతో పోలీసులు పూర్తిస్థాయిలో అదుపు చేయలేకపోతున్నారని కొందరు… మద్యం అమ్మకాల గురించి ఎక్సైజ్‌ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉండటంతో వారే చర్యలు తీసుకోవాలని మరి కొందరు అధికారులు చెబుతుంటారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌, సమయపాలన, బౌన్సర్లపై నిఘా, తాగి వాహనాలు నడిపే వారిపై దృష్టి పెట్టడం లాంటి అంశాలను మాత్రం పోలీసులే చూడాలి. పబ్‌ లోపల ఉన్న యువతుల భద్రత.. వారు వచ్చి వెళ్లే సమయాల్లో పోకిరీల వేధింపుల్లాంటి వాటిపై కూడా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే. జరుగుతున్న ఘటనలు మాత్రం వాటికి భిన్నంగా ఉన్నాయి.
ఫిర్యాదులు వచ్చినప్పుడేనా?
పబ్‌లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా… వాటిని సహించేది లేదని పోలీసులు ప్రకటనలు చేస్తుంటారు. బాధితులు నేరుగా పీఎ్‌సకు వచ్చి ఫిర్యాదులు చేసినప్పుడు చర్యలు తీసుకుంటారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పబ్‌లపై… పబ్‌లకు వచ్చి వెళ్లే వారిపై (ప్రత్యేకంగా యువతులపై) నిరంతర నిఘా పెట్టి… నిబంధనలను కచ్చితంగా అమలు చేయించాల్సిన అధికారులు వివిధ సాకులతో విస్మరిస్తున్నారు. పబ్‌ నిర్వాహకుల్లో పెద్ద వారి వల్లనే పోలీసు చర్యలకు ఆటంకం కలుగుతోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రాజకీయ అండతోనే అత్యధిక పబ్‌లలో వ్యాపారం సాగుతోందని.. నిర్వాహకులపై ఎలాంటి చర్యలు లేకుండా పెద్ద వారు కాపాడుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి.
హైవే క్లబ్‌ వద్ద మద్యం మత్తులో హంగామా
 యువతిని వెంబడించిన ఇద్దరు యువకులు
అదుపులోకి తీసుకున్న
పోలీసులు… కేసు నమోదు

పంజాగుట్ట బేగంపేట హైవే క్లబ్‌ వద్ద అర్ధరాత్రి యువకులు హంగామా సృష్టించారు. మద్యం మత్తులో యువతిని వెంబడించి ఇబ్బంది పెట్టారు. శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి సమయంలో వాణిజ్య కేంద్రాలను మూయించేందుకు పంజాగుట్ట పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. బేగంపేట హైవే క్లబ్‌ వద్దకు రాగా అప్పటికే క్లబ్‌ను మూసి వేశారు. దానికి సమీపంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు హంగామా సృష్టించడం మొదలుపెట్టారు. పోలీసులు వారిని హెచ్చరించినా వినిపించుకోలేదు. అక్కడి నుంచి కొద్ది దూరం వెళ్లి యువకులు అదే దారిలో బాయ్‌ఫ్రెండ్‌తో వెళ్తున్న యువతిని వెంబడించారు. అసభ్య పదజాలంతో మాట్లాడారు. అక్కడే ఉన్న పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మల్కాజిగిరికి చెందిన అనుకుమార్‌, నేరెడ్‌మెట్‌కు చెందిన కిరణ్‌కుమార్‌గా గుర్తించారు. వారిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(Courtesy Andhrajyothi)