కేసీఆర్ ఎక్కడున్నారనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

హైదరాబాద్: ప్రగతి భవన్ ఎదుట ఓ యువకుడు హల్ చల్ సృష్టించాడు. ‘సీఎం కేసీఆర్ ఎక్కడ? ఆయన నా సీఎం. ఆయన ఎక్కడున్నారో తెలుసుకోవడం నా హక్కు’ అంటూ ఆంగ్లంలో రాసి ఉన్న ఓ ప్లకార్డును ప్రదర్శించాడు. ప్రగతి భవన్ ఎదుట భద్రతా సిబ్బంది ఎదుటే ఇతను ప్లకార్డు ప్రదర్శించడం విశేషం. గమనించిన భద్రతా సిబ్బంది అతణ్ని పట్టుకొనేలోపే యువకుడు పరారయ్యాడు. అతను ఓ బైక్‌పై వచ్చి అక్కడ ప్లకార్డు ప్రదర్శించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

గత కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న సంగతి తెలిసిందే. పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల అనంతరం నుంచి కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కనీసం వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షలు కూడా నిర్వహించలేదు. కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించకుండా ఉండడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ప్రగతి భవన్‌లో పలువురు సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకడంతో సీఎం కేసీఆర్‌కు కూడా సంక్రమించి ఉంటుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

విపక్షాలు కూడా సీఎం కేసీఆర్ కనిపించకపోవడంపై విమర్శలకు మరింత పదును పెడుతున్నాయి. సీఎం ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చివరికి ఆయన ఆరోగ్యం గురించి చెప్పాల్సిందేనంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఇక సామాజిక మాధ్యమాల్లోనూ కేసీఆర్ ఎక్కడున్నారనే అంశంపై చర్చ జోరుగా సాగుతోంది. పలువురు నెటిజన్లు #WhereIsKCR అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న వేళ కేసీఆర్ ఎక్కడ అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Courtesy Telugu Samayam