వాస్తవానికి ఒక అధికారిక సర్వే ద్వారా సేకరించిన డేటాను విడుదల చేయకుండా దాచిపెట్టటం ఇదే మొదటిసారి. ఈ సర్వే కోసం పెట్టిన ఖర్చంతా వృధా. కేవలం తన ‘అచ్ఛే దిన్‌’ కట్టుకథకు వ్యతిరేకంగా ఉన్నాయని…జాతి వనరులను ఖర్చు చేసి నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనినిబట్టే అది ఎంతటి ఉన్మాద స్థితిలో ఉందో అర్థమౌతోంది.

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) 2017-18వ సంవత్సరపు వినియోగ వ్యయానికి సంబంధించిన డేటాను విడుదల చేయకూడదని నిర్ణయించింది. సాధారణంగా ఎన్‌ఎస్‌ఓ ఈ వివరాలను ఐదు సంవత్సరాలకు ఒకసారి విడుదల చేస్తుంటుంది. 2011-2012 నుంచి 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో తలసరి వినిమయ వ్యయం (2009-10 సంవత్సర ధరలలో) నెలకు రూ.1,501 నుంచి నెలకు రూ.1,446కు అంటే 3.7 శాతం పడిపోయింది. ఈ విషయాన్ని ‘ద బిజినెస్‌ స్టాండర్డ్‌’ పత్రిక నవంబరు 15వ తేదీ సంచికలో బహిర్గతం చేయటం వల్లనే ఈ నిర్ణయం జరిగింది. వాస్తవంలో తలసరి వినిమయ వ్యయం తగ్గటం చాలా తీవ్రమైన విషయం. గత నాలుగు దశాబ్దాల కాలంలో ఇలా తగ్గటం ఇదే మొదటిసారి. గతంలో 1972-73లో వినిమయ వ్యయం ఒకసారి తగ్గింది. ఆ సంవత్సరం పంటలు సరిగా పండలేదు. చమురును ఎగుమతి చేసే దేశాలు ఆకస్మికంగా ధరలను విపరీతంగా పెంచటం వలన ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. అయితే అవి ముందుగా తెలియకుండా వచ్చే విఘ్నాలు.

చమురు ధర సమస్య దేశం బయట నుంచి వచ్చిన సమస్య. పంటలు పండకపోవటం వాతావరణానికి సంబంధించిన విషయం. వీటిని ప్రభుత్వం ఎదుర్కొనే తీరును తప్పు పట్టవచ్చు కానీ, వీటి ఆవిర్భావానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టలేం. 2017-18వ సంవత్సరంలో ప్రభుత్వ నియంత్రణ పరిధిలో లేని విఘ్నాలు ఏమీలేవు. 2017-18వ సంవత్సరానికి చెందిన సర్వే కాలంలో నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ను ప్రవేశ పెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఈ రెండింటికీ మోడీ ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించవలసి ఉంటుంది. అయితే ఈ వినాశకర నిర్ణయాలు మాత్రమే తలసరి వినిమయ వ్యయం కుదింపును వివరించలేవు. 2011-12 నుంచి 2017-18 సంవత్సరాల మధ్యకాలంలో పట్టణ భారతదేశంలో తలసరి వినిమయ వ్యయం కేవలం 2 శాతం పెరిగింది. అయినప్పటికీ గ్రామీణ భారతదేశంలో అది 8.8 శాతం క్షీణించింది. నోట్ల రద్దు, జీఎస్‌టీల ప్రభావమే కాకుండా గ్రామీణ భారతదేశంలో నిస్పృహకు చెందిన సంకేతాలు చాలా కాలంగా వెలువడుతూనే ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే అసలే నిస్పృహ రాజ్యమేలుతున్న స్థితిని నోట్ల రద్దు, జీఎస్‌టీ మరింతగా దిగజార్చాయి. అంతేగానీ అంతకు ముందు పరిస్థితి సజావుగా ఏమీ లేదు. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సాక్ష్యం ఉత్పత్తి డేటా నుంచి వస్తుంది. వినిమయ వ్యయ డేటాకు భిన్నంగా ఉత్పత్తి డేటా ఉంటుందనే ప్రభుత్వ వాదన నిజం కాదు. ‘వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల’లో వర్తమాన ధరలలో జతైన నికర విలువ ఈ రంగం నుంచి వచ్చే అన్ని రకాల ఆదాయానికి వనరుగా ఉంటుంది.

నికర విలువను వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రజల సంఖ్యతో భాగించి గ్రామీణ భారతదేశం వినిమయ ధరల సూచికను అనుసరించి సవరించి చూశారు. అప్పుడు వ్యవసాయాధారంగా జీవించే ప్రజల వాస్తవ తలసరి ఆదాయం 2013-14 నుంచి 2017-18 సంవత్సరాల మధ్య కాలంలో స్వల్పంగా తగ్గింది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రజానీకంలో భూస్వాములు, వ్యవసాయ పెట్టుబడిదారులు ఉంటారు. వీరి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఆదాయంలో వీరి వాటా ఎక్కువగా ఉండటమే కాకుండా సదరు కాలంలో వీరి ఆదాయం పడిపోలేదని కూడా అనుకోవచ్చు. ఈ కాలంలో మిగిలిన గ్రామీణ ప్రజలందరి, గ్రామీణ కార్మికులందరి ఆదాయం గణనీయంగా పడిపోయి ఉంటుంది. ఈ కాలంలో మొత్తం జనాభాలో వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రజల నిష్పత్తి పడిపోయిందని అనుకున్నా ఈ నిర్ధారణను తప్పుగా చూపేటంతగా పడిపోదు. ఒకవేళ ముగింపు తేదీని 2017-18 నుంచి 2016-17 సంవత్సరానికి మార్చినా, అంటే నోట్ల రద్దు ప్రభావం చూపక ముందు కూడా మనం ఇదే నిర్ధారణకు వస్తాం. వరుస ప్రభుత్వాలు నయా ఉదారవాద విధానాలను అమలు చేయటంవల్ల అప్పటికే నిస్పృహలో వున్న వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నోట్ల రద్దు, జీఎస్‌టీ మరింతగా కుంగదీశాయి. గ్రామీణ భారతదేశంలో 2011-12 నుంచి 2017-18 సంవత్సరాల మధ్యకాలంలో ఆహారం మీద చేసిన వ్యయం తలసరి 10 శాతం దాకా తగ్గింది.

దీనితో దారిద్య్రం పరిమాణం తీవ్రంగా పెరిగి ఉంటుంది. ప్రభుత్వం ఏం చెబుతున్నప్పటికీ నయా ఉదారవాద విధానాల ప్రవేశంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో క్యాలరీల పరంగా నిర్వచించి దారిద్య్రం పెరుగుతూ ఉంది. పంచవర్ష సర్వే సంవత్సరాలైన 1993-94వ సంవత్సరం, 2011-12 సంవత్సరంలో జరిగిన సర్వేలను పోల్చి చూసినప్పుడు ఇదే విషయం మనకు కనపడుతుంది. 2017-18 సంవత్సరంలో దీని పరిమాణం తీవ్రత మరింతగా పెరిగి ఉంటుంది. అనుకూలంగా లేనందున వినిమయ వ్యయానికి సంబంధించిన డేటాను మోడీ ప్రభుత్వం బయటకు రాకుండా దాచి పెట్టింది. గత 45 సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ప్రబలిందని తెలియజేసిన ఉద్యోగ కల్పనకు సంబంధించిన డేటాను బయటకు రాకుండా లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం తొక్కి పట్టింది. ఆ తరువాత ఆ డేటాను అధికారికంగా విడుదల చేసింది. అయితే వినిమయ వ్యయానికి చెందిన డేటాను అసలు విడుదలే చేయకూడదని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22లో జరిగే మరో పంచవర్ష సర్వే దాకా మోడీ ప్రభుత్వం ఆగుతుంది. వినిమయ వ్యయంపై సమాచారాన్ని విడుదల చేయటానికి ముందు అప్పటికల్లా సమాచారాన్ని సేకరించే పద్ధతినే మార్చి అంతా సజావుగానే ఉందనే దృశ్యాన్ని మోడీ ప్రభుత్వం ప్రజలకు చూపుతుంది.

వినిమయ వ్యయానికి సంబంధించిన డేటాను దాచి పెట్టటాన్ని సమర్థించుకోవటానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన చాలా మూర్ఖంగా ఉంది. ‘డేటా నాణ్యత’ ఏమీ బాగాలేదని ప్రభుత్వం అంటోంది. ఈ విషయాన్ని ఎవరో కొందరు అధికారులు, తమకు ప్రీతిపాత్రులైన ‘నిష్ణాతులు’ నిర్ణయించే బదులుగా పరిశోధకులకు, ప్రజానీకానికి వదలి పెట్టాల్సింది. ప్రభుత్వం డేటా విడుదల చేసి ‘డేటా నాణ్యత’ సరిగా లేనందున దానిపై ఆధారపడి నిర్ణయాలు చేయకండని చెబితే సరిపోయేది. నిజానికి 2004-05వ పంచవర్ష సర్వేతో పోల్చినప్పుడు 2009-10 సంవత్సరంలో వెలువడిన పంచవర్ష సర్వే ప్రకారం దారిద్య్రం గణనీయంగా పెరిగింది. అప్పటి ప్రభుత్వం తాజాగా మరింత విస్తృత స్థాయిలో 2011-12 సంవత్సరంలో మరొక సర్వే చేయాలని నిర్ణయించింది. 2009-10 సంవత్సరంలో జరిగిన సర్వే కరువు నెలకొన్న సంవత్సరంలో జరిగింది కాబట్టి దానిని అంతగా పట్టించుకోవద్దని ప్రభుత్వం వాదించింది. అయితే 2009-10 సంవత్సర సర్వే డేటాను ప్రభుత్వం విడుదల చేయకుండా ఆపలేదు. నిజానికి పంటలు బాగా పండిన 2011-12 సంవత్సరంలో అంతకు ముందటి 2009-10 సంవత్సరంతో పోల్చినప్పుడు తలసరి వినిమయ వ్యయం బాగా పెరిగింది. అయితే నయా ఉదారవాద కాలంలో క్యాలరీల పరంగా నిర్వచించిన దారిద్య్రం పెరిగే అవకాశం వుందన్న నిర్ధారణను అది తోసిపుచ్చలేదు.

వాస్తవానికి ఒక అధికారిక సర్వే ద్వారా సేకరించిన డేటాను విడుదల చేయకుండా దాచిపెట్టటం ఇదే మొదటిసారి. ఈ సర్వే కోసం పెట్టిన ఖర్చంతా వృధా. కేవలం తన ‘అచ్ఛే దిన్‌’ కట్టుకథకు వ్యతిరేకంగా ఉన్నాయని…జాతి వనరులను ఖర్చు చేసి నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనినిబట్టే అది ఎంతటి ఉన్మాద స్థితిలో ఉందో అర్థమౌతోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా ఉండగా పి.సి మహల్‌నోబిస్‌ నేతృత్వంలో తీవ్రంగా కృషి చేసి రూపొందించిన గణాంక వ్యవస్థను నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వ ఉన్మాదం మరింత ఆందోళన కలిగిస్తోంది. మహల్‌నోబిస్‌ ప్రారంభించిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైంది. మూడవ ప్రపంచ దేశాలలో ఇటువంటిది మరెక్కడా మనకు కనిపించదు. ఇది మన దేశానికే గర్వకారణం. పరిశోధనలకు ఇది అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తుంది. తన ‘ఘనకార్యాల’ గుట్టు రట్టవుతున్నదన్న దుగ్దతో ప్రభుత్వం ఈ విలువైన వనరును నాశనం చేస్తున్నది. ప్రభుత్వ దమనకాండకు ఇదొక ఉదాహరణగా మిగులుతుంది. వినిమయ వ్యయానికి చెందిన డేటా అధికారిక సూచికలతో సరిపోలటం లేదని ప్రభుత్వం వాదిస్తోంది.

‘డేటా నాణ్యత’ పేలవంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న వాదనకు ఇది ప్రాతిపదిక కాదు. అయితే ఈ డేటా ఇతర వనరుల ద్వారా అందుతున్న సమాచారంతో సరిపోలుతున్నది. ఈ డేటా పైన పేర్కొన్న నిరుద్యోగానికి చెందిన డేటాతో సరిపోలుతోంది. పైన పేర్కొన్న వ్యవసాయ రంగానికి చెందిన డేటాతో ఈ డేటా సరిపోలు తోంది. వర్తమాన ఆర్థిక వ్యవస్థలో పెద్ద ఎత్తున పడిపోతున్న వృద్ధి రేటును, నిత్యం కుదేలవుతున్న వివిధ రంగాల దయనీయ స్థితిపై వస్తున్న వార్తలను ఈ డేటా ప్రతిబింబిస్తోంది. బిస్కట్ల వంటి సామాన్యమైన వినిమయ వస్తువుల అమ్మకాలు కూడా పడిపోతున్నాయి. ఈ వాస్తవం తలసరి వినిమయ వ్యయం నిరపేక్షంగా క్షీణిస్తున్నదన్న నిర్ధారణకు అనుగుణంగానే ఉంది. దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభం గుప్పిట్లో ఉండగా, ఈ సంక్షోభాన్ని అర్థం చేసుకోవటానికి అందుబాటులో వున్న ప్రతి సమాచారాన్ని ఉపయోగించుకోవటానికి బదులుగా మోడీ ప్రభుత్వం విలువైన సమాచారాన్ని బయటకు రాకుండా దాచిపెడుతోంది. ఈ సంక్షోభం నుంచి బయట పడటానికి మోడీ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ వుందో దీనినిబట్టి తేటతెల్లం అవుతోంది.

ప్రభాత్‌ పట్నాయక్‌