– బీఆర్‌డీ కళాశాలలో నివేదికలు తారుమారు..!
– ఏఈఎస్‌, జేఈ రోగుల వివరాల నమోదు నిలిపివేత
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మెదడువాపు వ్యాధి (ఎన్‌సెఫాలిటిస్‌)తో బాధపడే రోగుల సంఖ్యను తగ్గించామని చెబుతున్న బీజేపీ సర్కారు వాస్తవాలను దాస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నేతృత్వంలోని బీజేపీ సర్కారు నిజాలను దాచిపెడుతూ తప్పుడు నివేదికలు తయారుచేస్తున్నదని బాబా రాఘవ్‌ దాస్‌ (బీఆర్‌డీ) మెడికల్‌ కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. రెండేండ్ల క్రితం ఇదే ఆస్పత్రిలో మెదడువాపు సంబంధిత వ్యాధితో సుమారు 72 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఈ రకమైన వ్యాధి భారీన పడి ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్యను తగ్గించామనీ, ఆ మేరకు చర్యలు తీసుకున్నామని యోగి సర్కారు చెబుతున్నది.
ఈ ఏడాది ఆగస్టులో సీఎం మాట్లాడుతూ.. గోరఖ్‌పూర్‌లో అక్యూట్‌ ఎన్‌సెఫాలిటిస్‌ సిండ్రోమ్‌ (ఏఈఎస్‌), జపానిస్‌ ఎన్‌సెఫాలిటిస్‌ (జేఈ)తో బాధపడే రోగులను 35 శాతం తగ్గించామని తెలిపారు. దీని భారీన పడి మరణించే వారి సంఖ్యనూ 65 శాతానికి తగ్గించామని ఆదిత్యానాథ్‌ చెప్పారు. అయితే, దీనిపై ఆస్పత్రి వర్గాల వాదన మరో విధంగా ఉంది. బీఆర్‌డీ యాజమాన్యం సర్కారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ నివేదికలను తారుమారు చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఏఈఎస్‌, జేఈ ల రికార్డును నిర్వహించడం లేదని పలువురు వైద్యులు ఆరోపిస్తున్నారు. అనధికారిక సమాచారం మేరకు.. ఈ ఏడాది జనవరి నుంచి 331 మందికి జేఈ పాజిటివ్‌ అని తేలగా, తీవ్రమైన జ్వర సంబంధిత వ్యాధి (అక్యూట్‌ ఫిబ్రైల్‌ ఇల్‌నెస్‌-ఏఎఫ్‌ఐ)తో 1,563 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారని వారు తెలిపారు. ఏఎఫ్‌ఐ సోకిన వారికి సైతం ఏఈఎస్‌ మాదిరిగానే తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ వచ్చి పడిపోవడం, కండరాల నొప్పి, అలసిపోవడం వంటి లక్షణాలుంటాయి. అయితే ఏఈఎస్‌, జేఈ కేసులను ఆస్పత్రి నమోదుచేయక వాటిని సైతం ఏఎఫ్‌ఐ కిందే చేస్తున్నారని బీఆర్‌డీ వైద్యులు అంటున్నారు.
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 1,563 రోగులలో 215 మంది (13.7 శాతం) రోగులు జేఈ.. స్క్రబ్‌ టైఫస్‌ రోగులు 350 (22.37 శాతం) మంది.. డెంగ్యూ, చికున్‌గున్యా కింద 150 మంది (10 శాతం) కేసులు నమోదైనట్టు సమాచారం. అయితే బీఆర్‌డీ యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. ఈ ఏడాదిలో ఏఈఎస్‌, జేఈ భారీన పడి 89 మంది రోగులు మాత్రమే తమ ఆస్పత్రిలో చేరారనీ, వారిలో పది మంది పిల్లలు మరణించారని బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ గణేశ్‌ కుమార్‌ తెలిపారు.

Courtesy Navatelangana…