Image result for cm kcr granted rtc 1000 crore"డిమాండ్లలో సగం ఓకే అన్నా సమ్మె ఆగేది
కేసీఆర్‌ పంతంతోనే ప్రజలకు ఇబ్బందులు, కార్మికుల మరణాలు
సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్టులు
హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కాలంలో రూ.47 కోట్లు ఇస్తే వారి డిమాండ్లలో ఎన్నో పరిష్కారమవుతాయన్నా.. డబ్బుల్లేవన్నారు. ఇప్పుడు మాత్రం ఆర్టీసీకి ఏటా రూ.1000 కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాదు.. సమ్మె ప్రారంభించినప్పుడు జేఏసీ చేసిన డిమాండ్లలో అనేక డిమాండ్లకు ఇప్పుడు ఆమోదం తెలిపారు. అనేక వరాలను ఉద్యోగులు అడగకుండానే ఇచ్చేశారు. మరి ఇన్నాళ్లు సమ్మెతో ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? కార్మికుల ప్రాణాలు ఎందుకు పోవడం? జేఏసీ కోరిన వాటిలో సగం డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించినా.. సమ్మె అప్పుడే ఆగిపోయే అవకాశముండేది. కానీ, ముఖ్యమంత్రి ఏమాత్రం సానుకూల వైఖరి కనబరచకుండా తనను కాదని సమ్మెకు వెళ్లిన కార్మికులపై పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నించారని, సెల్ఫ్‌ డిస్మిస్‌ అంటూ కార్మికుల్ని ఇరుకున పెట్టారనే వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆయన పంతం వల్లే.. 54 రోజులపాటు బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు పడ్డారని, కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు చోటుచేసుకున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డిమాండ్లలో ఇప్పుడు ఒప్పుకున్నవి
మహిళలకు 90 రోజుల ప్రసూతి సెలవు… ప్రయాణికులు టికెట్‌ తీసుకోకుంటే కండక్టర్‌పై కేసులుండకూడదు… ఉద్యోగ భద్రత కల్పించాలి… సీసీఎస్‌, పీఎఫ్‌ డబ్బులు విడుదల చేయాలి. .. ఆర్టీసీని ఆదుకునేందుకు బడ్జెట్టులో ప్రత్యేక నిధులు… డిపోల్లో మహిళా ఉద్యోగులకు రెస్ట్‌ రూంలు, బాత్‌రూంలు ఏర్పాటు… మహిళా కండక్టర్లకు నైట్‌ డ్యూటీలు ఉండకూడదు.
కోరనప్పటికీ ప్రకటించిన వరాలు
ఒక్క బస్సు కూడా పెవ్రేటుపరం చేయం… పదవీ విరమణ వయస్సు 58-60కి పెంపు… మహిళలకు ఇష్టమొచ్చిన డ్రెస్సు… సమ్మె కాలానికీ జీతం ఒకేసారి చెల్లింపు… చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగం, రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియా… ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్‌ పాస్‌లు… ఉద్యోగుల పిల్లలకు ఫీజు రియంబర్స్‌మెంట్‌… ఉద్యోగుల కోసం గృహనిర్మాణ పథకం.

(Courtesy Andhrajyothi)