చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్‌ విస్ఫోటం చెంది, ‘కొవిడ్‌-19’ అంటువ్యాధి విజృంభించాక, లాక్‌డౌన్‌ సమయంలో తన జీవితంలో చోటు చేసుకున్న అనుభవాలను ప్రసిద్ధ చైనా రచయిత్రి ఫాంగ్‌ ఫాంగ్‌ (ఇది కలం పేరు. అసలు పేరు వాంగ్‌ ఫాంగ్‌) పుస్తకంగా తీసుకువచ్చారు. నిర్బంధాలను ఎదుర్కొంటున్న ఆ రచన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం. అందులోని ముఖ్యాంశాలు…

ఫాంగ్‌ ఫాంగ్‌ నివాసం ఉంటున్న వూహాన్‌ నగరం ప్రాణాంతకమైన కరోనా వైరస్‌కు పుట్టినిల్లు. కేసుల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది జనవరిలో అక్కడ లాక్‌డౌన్‌ విధించారు. ఈ నేపథ్యంలో, ఫాంగ్‌ ఫాంగ్‌ జనవరి చివరి నుంచీ రోజువారీగా ఆన్‌లైన్‌ డైరీ రాయడం మొదలుపెట్టారు. ఆమె రచనలను ఆంగ్లంలోకి అనువదించే మిషెల్‌ పెర్రీ ఆ డైరీలోని అంశాలను అనువాదం చేయడం ప్రారంభించారు. ఈ మధ్యనే, ఆ రచనలను ‘వూహాన్‌ డైరీ’ పేరిట ప్రచురించారు.

ఈ అరవై అయిదేళ్ళ రచయిత్రి లాక్‌డౌన్‌ సమయంలో రాసుకున్న వ్యక్తిగత అనుభవాలు మిగిలిన ప్రపంచం చదవాల్సిన అవసరం ఉందా?

అవును… ఉంది. ఎందుకంటే, చైనా లాంటి నిర్బంధ దేశంలో గొంతెత్తి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతి కొద్దిమందిలో ఆమె ఒకరు. మీడియా మీదా, సోషల్‌ మీడియా మీదా కఠినమైన ఆంక్షలు ఉన్నప్పటికీ, అధికారులను ఆమె నిలదీస్తూనే ఉన్నారు. లోపాలు ఎత్తి చూపిస్తూ, అధికారులు చెప్పే అవాస్తవాలను ప్రశ్నిస్తున్నారు. ఫాంగ్‌ డైరీ లాక్‌డౌన్‌ సమయంలో సమాజ పరిస్థితులకే కాదు, నోరు నొక్కేసిన ప్రజలను కూడా ప్రతిబింబిస్తుంది. అలాగే ప్రపంచం కరోనా కోరల్లో చిక్కుకొని ఆరు నెలలైన నేపథ్యంలో, ఈ పుస్తకం ఒక హెచ్చరికలా కూడా అనిపిస్తుంది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు…

జనవరి 27: ప్రతి ఒక్కరూ ఇప్పడు ఫేస్‌ మాస్కుల కొరత గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అది ఒక పెద్ద సమస్యై కూర్చుంది. ఒక జోక్‌ చూశాను: చైనా కొత్త సంవత్సరానికి చాలా విలువైన సరుకుల్లో పోర్క్‌ స్థానంలో ఫేస్‌ మాస్కులు వచ్చి చేరుతాయని!

జనవరి 29: అన్నిటినీ వదిలేసి, ఇవాళ మధ్యాహ్నం వరకూ నిద్రపోవాలని నిర్ణయించుకున్నా. ఇంకా మంచం మీద ఉండగానే, నా డాక్టర్‌ ఫ్రెండ్‌ ఒకరు పంపిన మెసేజ్‌ నా ఫోన్లో మెరిసింది: ‘‘మీ గురించి శ్రద్ధ తీసుకోండి, ఏది ఏమైపోయినా బయటకు వెళ్ళొద్దు! బయటకు వెళ్ళొద్దు! బయటకు వెళ్ళొద్దు’’! డాక్టర్‌ పంపిన ఆ మెసేజ్‌తో వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయికి చేరిందని అర్థమయింది. వెంటనే మా అమ్మాయికి ఫోన్‌ చేశాను. బాక్సుల్లో అమ్మే ఆహారం కొనడానికి సూపర్‌మార్కెట్‌కి వెళుతున్నానని చెప్పింది. నేను వెళ్ళొద్దన్నాను. ఇంట్లో తినడానికి వట్టి అన్నమే ఉన్నా సరే, బయటకు పోవద్దన్నాను. నా కూతురుకు వంట చెయ్యడం అంటే బద్ధకం అనీ, అందుకే బయటికి వెళ్ళాలనుకుంటోందనీ నా అనుమానం. సరే, కాసేపయ్యాక నాకు కాల్‌ చేసి అడిగింది – ‘‘అమ్మా! క్యాబేజీ ఎలా వండాలి’’ అని!

జనవరి 31: చిన్న సూపర్‌మార్కెట్లలో కొన్ని ఇంకా తెరిచే ఉన్నాయి. రోడ్ల పక్క కూరగాయల బండ్లు కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి. మూడు దుకాణాలు తిరిగి, చివరికి కోడిగుడ్లు సంపాదించాను. ‘‘వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో దుకాణం తెరిచావ్‌! నీకు ఇన్ఫెక్షన్‌ సోకుతుందని భయంగా లేదా?’’ అని వాటిని అమ్ముతున్న మహిళను అడిగాను. ‘‘మేం బతకాలి కదా! మీరూ బతకాలి…!’’ అంది ఆమె.

ఫిబ్రవరి 2: ఒక న్యూస్‌ క్లిప్‌ చూసి నాకు చాలా బాధనిపించింది. ఒక అమ్మాయి తన తల్లి శవాన్ని తీసుకువెళుతున్న బండి వెనకాల నడుస్తోంది. ఏడుస్తోంది, కళ్ళ వెంట నీళ్ళు కారుతున్నాయి. తల్లికి సరైన పద్ధతిలో అంత్యక్రియలు చేసే పరిస్థితి కూడా లేదు. తన తల్లి చితాభస్మాన్ని వాళ్ళేం చేస్తారో కూడా ఆమెకు బహుశా తెలియకపోవచ్చు!

ఫిబ్రవరి 6: డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ మరణించారు. ఈ వైరస్‌ గురించి మొదటగా బయట మాట్లాడినందుకు జరిమానాను ఎదుర్కొన్న ఎనిమిది మంది వైద్యుల్లో ఆయన ఒకరు. తరువాత ఆయనకే కరోనా వైరస్‌ సోకింది. ఆయన మరణ వార్త విని ఇప్పుడు నగరంలో ప్రతి ఒక్కరూ ఆయన కోసం రోదిస్తున్నారు. నా గుండె బద్దలయింది.

ఫిబ్రవరి 7: లీ వెన్‌లియాంగ్‌ పని చేస్తున్న వూహాన్‌ సెంట్రల్‌ ఆసుపత్రిలో మరణించింది ఆయన ఒక్కరే కాదు… కరోనా వైరస్‌తో మరో ముగ్గురు వైద్యులు కూడా మరణించారని విన్నాను. ప్రతి ఆసుపత్రిలోనూ ఎంతోమంది వైద్య నిపుణులు అనారోగ్యం పాలైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. రోగులను కాపాడడం కోసం వాళ్ళు సొంత ఆరోగ్యాలనూ, కొన్ని సందర్భాల్లో ప్రాణాలనూ త్యాగం చేస్తున్నారు. ‘‘ఈ వైద్యులందరూ అనారోగ్యం పాలయ్యాక, ఇదో అంటు వ్యాధి అని అందరూ తెలుసుకుంటారు. కానీ ఆ మాట పైకి అనడానికి ఎవరూ ధైర్యం చెయ్యరు. ఎందుకంటే నోర్లు కుట్టేసుకున్నారు’’ అని నా డాక్టర్‌ ఫ్రెండ్‌ నాతో అన్నారు.

ఫిబ్రవరి 8: నేను రాస్తున్న ప్రతి పోస్టునూ, దాన్ని పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే సెన్సార్‌ వాళ్ళు తొలగిస్తున్నారు. అయినా నేను రాయడం కొనసాగిస్తున్నాను. రాయడం కొనసాగిస్తే రానురానూ నాకు పరిస్థితులు కష్టంగా ఉండవచ్చని కొంతమంది స్నేహితులు కంగారు పడుతున్నారు. కానీ నా వరకూ అంతా బాగానే ఉంటుందనుకుంటున్నా.

ఫిబ్రవరి 11: ఈ రోజు మధ్యాహ్నం నా కోసం నాలుగు వంటకాలు చేసుకున్నాను. అన్నం కూడా ఎక్కువ వండాను. నా పెంపుడు కుక్కకు డాగ్‌ ఫుడ్‌ అయిపోయింది. అది పదహారేళ్ళ నుంచీ నా జీవితంలో భాగం.. క్వారంటైన్‌ ప్రారంభం కావడానికి ముందు దానికి తెచ్చిన ఆహారం అయిపోయింది వెటర్నరీ డాక్టర్‌కి ఫోన్‌ చేసి ఏం చెయ్యాలని అడిగాను. నా పెంపుడు కుక్కకు మామూలు అన్నం పెట్టొచ్చని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నాతో పాటు దాని కోసం మరికాస్త వండుతున్నా.

ఫిబ్రవరి 24: తాత్కాలిక ఆసుపత్రుల్లో చేరిన కొందరు రోగులు కోలుకున్నాక కూడా బయటకు వెళ్ళడానికి ఇష్టపడడం లేదని విన్నాను. ఆ ఆసుపత్రులు విశాలంగా ఉంటాయి. అద్భుతమైన భోజనం పెడతారు. వినోద ప్రదేశాలు కూడా ఉంటాయి. అక్కడ రోగులు పాడుకోవచ్చు, నాట్యం చెయ్యొచ్చు! ఇదంతా చాలా వింతగా, ఒక చెత్త జోక్‌లా అనిపిస్తోంది.

ఫిబ్రవరి 25: నా పాత క్లాస్‌మేట్లలో ఒకరు ఫోన్‌ చేశారు. అతను బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతూ ఉంటే, అతని మూడేళ్ళ మనవరాలు ‘‘తాతయ్యా! ప్లీజ్‌ బైటికి వెళ్ళొద్దు. బయట ఒక పెద్ద వ్యాధి ఉంది’’ అని చెప్పిందట! కానీ గుండె బద్దలైపోయే కథేంటంటే, ఆ తాతయ్య కొన్ని రోజులుగా చస్తూనే ఉన్నాడు. అతని మనవరాలు, కరోనా కారణంగా బయటకు వెళ్ళడం అంటే భయపడుతోంది. కాబట్టి, అతను చాలా రోజుల నుంచీ బిస్కట్లు తిని కాలక్షేపం చేస్తున్నాడు. చాలా కథలు అలాగే ఉన్నాయి. ‘‘నువ్వు బయటకు వెళితే జబ్బు పడతావు’’ అని తల్లి తండ్రులు భయపెట్టడంతో ఎంతో మంది పిల్లలు బయటకు వెళ్ళే ధైర్యం చెయ్యలేకపోతున్నారు. నిజా నికి వైరస్‌ ఇప్పటికే మన గుండెల్లోకి వచ్చే మార్గం కనుక్కుంది. అది మన లోపల ఒక రాకాసిలా బతికే ఉంది.

మార్చి 5: చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం, శీతకాలం నిద్ర నుంచి కీటకాలు మేలుకొనే రోజు ఇది. ఇది క్వారంటైన్‌లో 43వ రోజు. మామూలు రోజుల కన్నా ఇప్పుడే బిజీగా ఉన్నట్టనిపిస్తోందని కొన్ని రోజుల కిందట నా ఫ్రెండ్‌ ఒకరికి చెప్పాను. నేను టీవీలో ఏ కార్యక్రమాలూ చూడలేదు. సినిమాలు చూడాలనుకున్నా ఒక్కటీ చూసే అవకాశం దొరకలేదు. మా పొరుగింటావిడ తాంగ్‌ జియోహీ మనవరాలు భోజనం చేస్తున్న వీడియో చూపించారు. ఆ పిల్ల తినడం చూడడానికి చాలా బాగుంది. ‘‘పగటిపూట జియోహీ మనవరాలు భోజనం చేస్తున్న వీడియోలూ, రాత్రి వేళ ఫాంగ్‌ ఫాంగ్‌ డైరీతో నేను గడిపాను. ఈ రోజుల్ని నేను ఇలాగే వెళ్ళదీస్తున్నాను’’ అని ఒక ఫ్రెండ్‌ చెప్పారు. ఆ వీడియోలూ, నా ఫ్రెండ్‌ మాటలూ నాకు నవ్వు తెప్పించాయి.

మార్చి 6: ఎట్టకేలకు వూహాన్‌లో రోజువారీ కరోనా కొత్త కేసులు వందకన్నా తగ్గాయి. ఈ రోజు ఆన్‌లైన్‌ ఛాట్‌ గ్రూపుల్లో ఎక్కువగా కనిపించిన మాట – ‘కృతజ్ఞత’. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీకీ, దేశానికీ పౌరులు కృతజ్ఞతలు తెలపాలని వూహాన్‌లో రాజకీయ నాయకులు కోరారు. వాళ్ళ ఆలోచనా విధానం చాలా వింతగా ఉంది. ప్రభుత్వమే అందరు వైద్య రంగ నిపుణులకూ, చైనాలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేసిన 40 వేల మంది తెల్ల దుస్తుల దేవతలకూ కృతజ్ఞతలు చెప్పాలి. ప్రజల ప్రాణాలు కాపాడినందుకు ప్రభుత్వమే వారికి కృతజ్ఞతలు చెప్పాలి. కరోనా విజృంభించినప్పుడు, ఈ సంక్షోభంలో నగరంలో కార్యకలాపాలు జరిగేలా చేసిన వర్కర్లకూ, కార్మికులకూ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలపాలి. ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొని కూడా, ఇళ్ళలో తమను తాము బందీలుగా చేసుకున్న 90 లక్షల మంది వూహాన్‌ ప్రజానీకానికి ప్రభుత్వం ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ళ సహకారం లేకపోతే ఈ వైరస్‌ అదుపులోకి వచ్చేది కాదు. ఆ తరువాత ప్రజల క్షమాపణలను ప్రభుత్వం అర్థించాలి.

మార్చి 24: ఇది క్వారంటైన్‌లో 62వ రోజు. వూహాన్‌ బయట అన్ని జిల్లాల్లో అధికారికంగా లాక్‌డౌన్‌ తొలగించారు. వూహాన్‌ నగరంలో ఏప్రిల్‌ ఎనిమిదో తేదీ నుంచి తొలగిస్తారు. మా హౌస్‌కీపర్‌ నాకు మెసేజ్‌ పంపింది. బహుశా రేపటి నుంచి తను పనిలోకి రావచ్చట! నాకిది చాలా పెద్ద రిలీఫ్‌. మా హౌస్‌ కీపర్‌ వంట బాగా చేస్తుంది. ఎప్పుడూ మా ఇంటికి వచ్చే కొలీగ్స్‌ రాత్రి భోజనానికి కూడా ఉండిపోతూ ఉంటారు. మేం మళ్ళీ స్వేచ్ఛగా తిరగడానికి అనుమతిస్తే, వాళ్ళు డిన్నర్‌ కోసం మళ్ళీ రావడం మొదలెడతారు. నా కష్టాల రోజులన్నీ ఇప్పుడు దాదాపుగా తీరిపోయినట్టే!

(ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్‌ ఇండియా సౌజన్యంతో)

Courtesy Andhrajyothy