భయపెడుతున్న ఆర్థిక మాంద్యపు భూతం

– ప్రొ. సిపి.చంద్రశేఖర్‌

               2008 సంవత్సరంలో సంభవించిన ప్రపంచ వ్యాప్త ఆర్థిక సంక్షోభపు ప్రభావం నుండి ఇంకా పూర్తిగా కోలుకోక ముందే మరో మాంద్యం లోకి దిగజారిపోతామన్న భయం వెంటాడు తోందిప్పుడు. ఇప్పటివరకూ 2008 మాంద్యం నుండి అమెరికా చెప్పుకోదగిన మేరకు బైట పడిందన్న అభిప్రాయం ఉంది. కాని అక్కడ కూడా గత ఏభై సంవత్సరాలలో లేనంత నిరుద్యోగం ప్రస్తుతం ఉంది. అమెరికాతో బాటు చైనా, జర్మనీ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంతవరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోకుండా నిలబెట్టాయి. కాని ఆ చైనా, జర్మనీ దేశాల్లో సైతం ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం తగ్గింది. చైనా పారిశ్రామిక ప్రగతి గత 17 సంవత్సరాలలో చూసుకుంటే ఈ ఏడాది కనిష్ట స్థాయిలో ఉంది. జర్మనీ ఆర్థిక వ్యవస్థ 2018లో తిరోగమన దిశ వైపు మళ్లింది. ఆ తర్వాత మళ్లీ పెరుగుదల మొదలైందని అన్నారు. కాని 2019 ఏప్రిల్‌-జూన్‌ కాలం నాటికల్లా మళ్లీ తిరోగమనం మొదలైంది.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఉత్పత్తి నెట్‌ వర్క్‌తో ఈ రెండు దేశాల ఆర్థిక వ్వవస్థలూ ఎంతగా అనుసంధానించ బడ్డాయంటే ఒక విధంగా ఆ ఉత్పత్తి నెట్‌వర్క్‌కి నాయకత్వమే ఈ రెండు దేశాలూ వహిస్తున్నాయని చెప్పాలి. కనుక ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలో మాంద్యం చోటు చేసుకుంది అంటే అది మొత్తం ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఆసియా, యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. చైనాలో డిమాండ్‌ తగ్గడంతో, థారులాండ్‌లో ఈ ఏడాది వృద్ధి రేటు పడిపోయింది. 2014 తర్వాత ఆ దేశం అతి తక్కువ వృద్ధి రేటు చూస్తున్నది ఇప్పుడే. యూరో జోన్‌ లోని దేశాలన్నింటి ఉమ్మడి జిడిపి వృద్ధి రేటు 0.4 ఉండేది కాస్తా 0.2కి పడిపోయింది. దీంతో అక్కడక్కడా చెదురుమదురుగా జరుగుతున్న చర్చ కాస్తా పెద్ద ఎత్తున మాంద్యం ప్రవేశించబోతున్నదన్న భయంగా మారింది. ఈ భయం వలన మదుపరులు స్టాక్‌ మార్కెట్లోని తమ వాటాలను అమ్ముకుని ప్రభుత్వ బాండ్ల కొనుగోలు వైపు మళ్లడం ప్రారంభించారు.

సాధారణంగా రెండేళ్ల పాటు కాల పరిమితి ఉండే ప్రభుత్వ బాండ్ల మీద వచ్చే వడ్డీ కన్నా, పదేళ్ల కాల పరిమితి ఉండే బాండ్ల మీద వడ్డీ హెచ్చుగా ఉంటుంది. కాని ప్రస్తుతం పది సంవత్సరాల అమెరికన్‌ బాండ్ల మీద రెండేళ్ల బాండ్ల కన్నా తక్కువ వడ్డీ వచ్చే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇటువంటి తలకిందుల పరిస్థితి వచ్చిన వెనువెంటనే మాంద్యం కూడా ప్రవేశించింది.
లోతుగా పరిశీలిస్తే ప్రజల కోనుగోలు శక్తి తగ్గిపోవడమే ఈ ఆర్థిక మాంద్యపు ధోరణుల వెనక ప్రధాన కారణమని అర్థమౌతోంది. ఆదాయాల మధ్య, సంపద కలవారికి, లేని వారికి మధ్య వ్యత్యాసాలు తీవ్రంగా పెరిగిపోవడం వల్లనే కొనుగోలు శక్తి పడిపోతుంది. ఈ వ్యత్యాసాలు పెరగడానికి కారణం నయా ఉదారవాద విధానాలు. చౌకగా కార్మికుల శ్రమ దొరికే దేశాల వైపు ఉత్పత్తి చేసే పరిశ్రమలు తరలిపోవడం ఈ ప్రపంచీకరణ కాలంలో ఒక ముఖ్యమైన ధోరణిగా కనపడుతోంది. దీని పర్యవసానంగా ప్రపంచ మొత్తం మీద కార్మికుల వేతనాలు పడిపోతు న్నాయి. ఇంకోపక్క స్టాక్‌ మార్కెట్‌ వ్యాపారంలో స్పెక్యులేషన్‌ ద్వారా వేగంగా కొందరి వద్ద సంపద కేంద్రీకృతం అవుతోంది. దానికి తోడు ప్రభుత్వాలు సంపన్నులకు పన్ను రాయితీలు భారీగా ఇస్తున్నాయి. ఇవన్నీ కలిసి అసమానత బాగా పెరిగిపోతున్నది.

ఆదాయాలలో వ్యత్యాసాలు

జనాభాలో అతి తక్కువ శాతంగా ఉండే శత కోటీశ్వరుల ఆదాయాలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. అదే సమయంలో దిగువ, మధ్య స్థాయిలలోని అత్యధిక మెజారిటీ ప్రజల ఆదాయాలు పెరగకుండా స్తంభించిపోవడమో, లేక తగ్గిపోవడమో జరుగుతోంది. ఆదాయాలు పెరగనపుడు సరుకుల అమ్మకాలు పుంజుకోడానికి అరువు ఇవ్వడమే మార్గం. 2008 సంక్షోభానికి మునుపు ఈ పద్ధతినే అనుసరించారు. క్రెడిట్‌ కార్డులు, రుణాల ద్వారా వినియోగదారులకు సరుకులను కొనే వీలు కల్పించారు. ఈ అప్పులను తీర్చకుండా పోయే అవకాశం ఉంది. ఆ రిస్క్‌ను రకరకాల పద్ధతుల ద్వారా (ఇన్సూరెన్స్‌, హెడ్జ్‌ పంఢ్స్‌ వగైరా) ఆర్థిక సంస్థలకు బదలాయించారు. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. 2008లో మహా మాంద్యం నెలకొనడానికి దారి తీసింది. మళ్లీ ఇప్పుడు డిమాండ్‌ను (కొనుగోలు శక్తిని) పెంచవలసిన అవసరం ఉంది. కాని కార్మికుల వేతనాలను పెంచకుండా, కొత్త ఉద్యోగాలు కల్పించకుండా కొనుగోలు శక్తిని పెంచేదెలా? వేతనాలను పెంచాలన్నా, కొత్త ఉద్యోగాలు కల్పించాలన్నా పెట్టుబడిదారుల లాభాలు తగ్గిపోతాయి. దానికి ఆ వర్గం సుతరామూ అంగీకరించదు. కొనుగోలు శక్తి పెంచేందుకు వేరే మార్గం లేదు. అందుకే మరో మహా మాంద్యం తలెత్తనుందన్న భయాలు పెరుగుతున్నాయి.

కొత్త భయాలు, షాక్‌లు

ఇతర దేశాల నుండి వచ్చే పోటీ వల్లనే కార్మికుల వేతనాలు పెరగడం లేదని అమెరికాలో ట్రంప్‌, యూరప్‌ లోని మితవాద ప్రభుత్వాలు ప్రచారం చేసి ప్రజలలో తలెత్తిన అసంతృప్తిని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే చైనా నుండి అమెరికాకు దిగుమతయ్యే సరుకుల మీద భారీగా సుంకాలు విధించి ఒక వ్యాపార యుద్ధానికి ట్రంప్‌ తెరతీశాడు. చైనా దగ్గర డాలర్‌ నిల్వలు భారీగా ఉన్నాయి. వీటిని విచ్చలవిడిగా మార్కెట్లో విడుదల చేసి డాలర్‌ మారకపు విలువను దెబ్బతీసి చైనా లాభపడ చూస్తున్నదని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.

అమెరికా మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధానికి చైనా, ఇతర దేశాలు దీటుగా స్పందిస్తు న్నాయి. అమెరికన్‌ ఎగుమతులపై సుంకాలు పెంచుతున్నాయి. దీని వలన అంతర్జాతీయ వాణిజ్యం కుదించుకుపోయి మాంద్యం మరింత వేగంగా ముదిరే ప్రమాదం దాపురిస్తోంది. ఇంకో వైపు యూరోపియన్‌ కూటమి నుండి బ్రిటన్‌ ఎటువంటి ప్రత్యామ్నాయ ఒప్పందమూ లేకుండానే వైదొలగాలన్న వైఖరి తీసుకోవడం వలన ఆ దేశాల నడుమ జరిగే వ్యాపారం కూడా దెబ్బతినే ప్రమాదం పెరిగింది. మహా మాంద్యం ముంచుకొస్తుందనే భయాలను ఇటువంటి షాక్‌లు మరింత పెంచుతున్నాయి.

అయినప్పటికీ, ఈ మాంద్యం నుండి బైటపడే ప్రయత్నాలు ఏవీ జరుగుతున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. ఏదో ఒక విధంగా కొనుగోలు శక్తిని పెంచి మాంద్యాన్ని నివారిం చేందుకు పెట్టుబడిదారీ వ్యవస్థ పూనుకోవాలి కదా! కాని అలా ఏదీ జరగడం లేదు. గతంలో చేసిన ప్రయత్నాలు వికటించిన అనుభవాల నుండి నేర్చుకుంటే ఈమారు మాంద్యాన్ని నివారించ డానికి ప్రభుత్వాలే రంగంలోకి దిగాలి. ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా కొనుగోలు శక్తిని పెంచాలి. కాని ప్రభుత్వ వ్వయం పెరగాలంటే ప్రభుత్వం అందుకోసం అప్పులు చేయాలి. ప్రభుత్వాలు అప్పులు చేసి, వ్యయాన్ని పెంచడం వలన ద్రవ్య లోటు పెరుగుతుంది. ద్రవ్యలోటు పెరగడానికి నయా ఉదారవాదం అంగీకరించదు. పైగా మార్కెట్‌లో నేరుగా ప్రభుత్వం జోక్యం కల్పించుకోవడాన్ని కూడా నయా ఉదారవాదం బలపరచదు. కనుక పెట్టుబడిదారులకే తక్కువ వడ్డీకి అప్పులిచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటు న్నారు. ఇంకోపక్క బాండ్లు, షేర్లు, డెరివేటివ్‌లు వంటి ఆర్థిక ఒప్పంద పత్రాలను పెద్ద ఎత్తున సేకరించి ఆమేరకు మార్కెట్‌లోకి నగదును విడుదల చేసే విధంగా బ్యాంకులను ఒత్తిడి చేస్తున్నారు.

ఇటువంటి ప్రయత్నాలు సైతం ఎటువంటి సానుకూల ఫలితాలనూ ఇవ్వడం లేదు. కొన్ని దేశాలలో అప్పులపై వడ్డీ రేటు తగ్గిస్తూ పోవడంతో ఒక దశలో మైనస్‌ వడ్డీ రేటుకు చేరుకున్నారు. డెన్మార్క్‌ లోని ‘జైస్కే బ్యాంక్‌’ ఈ ఆగస్టు నెలలో మొట్టమొదటి సారి గృహ రుణాలపై మైనస్‌ 0.5 వడ్డీ రేటు ప్రకటించింది. అంటే తీసుకున్న అప్పు కన్నా తక్కువ చెల్లిస్తారన్నమాట! ఇటువంటి చిట్కాలు సైతం మాంద్యాన్ని అడ్డుకోలేకపోతు న్నాయి. తక్కువ వడ్డీకి లభిస్తున్న అప్పుల్ని తీసుకుంటున్న పెట్టుబడిదారులు వాటిని సరుకుల ఉత్పత్తి కోసం పెట్టుబడిగా ఉపయోగించడం బదులు స్టాక్‌ మార్కెట్‌ స్పెక్యులేషన్‌లో పెడు తున్నారు. తీసుకున్న అప్పుల్ని చెల్లించకుండా బకాయి పెడుతున్నారు. తమ కంపెనీల షేర్లను షేర్‌ హోల్డర్ల నుంచి తిరిగి కొనుగోలు చేయడానికి బ్యాంకులిచ్చిన అప్పుల్ని ఉపయోగిస్తున్నారు. దీంతో వారి ఆస్తుల విలువలైతే పెంచుకోగలుగు తున్నారు కాని వృద్ధి రేటు కాని, కొనుగోలు శక్తి కాని పెరగడం లేదు. వృద్ధి రేటు పెరగాలంటే బ్యాంకులు మరింత ధనాన్ని ఉద్దీపనల రూపంలో మార్కెట్‌లోకి విడుదల చేయాలని ఒత్తిడి తెస్తు న్నారు. అలా విడుదలైన సొమ్ముతో తమ ఆస్తుల్ని మరింత పెంచుకుంటూ బ్యాంకులిచ్చిన అప్పులను చెల్లించకుండా ఎగనామం పెడుతున్నారు.

మరిన్ని ఉద్దీపన పథకాల వైపుగా

మాంద్యం పొంచి వున్న పరిస్థితులలో ఐ.ఎం.ఎఫ్‌, ప్రపంచ బ్యాంకు వంటివి ఆయా దేశాల ప్రభుత్వాలను జోక్యం చేసుకోవాలని, ఉద్దీపన చర్యలతో మార్కెట్‌లోకి నగదు విడుదల చేయాలని కోరుతున్నాయి. ప్రభుత్వాలే మౌలిక వసతుల కల్పన కోసం (రోడ్ల నిర్మాణం, విద్యుత్‌ ఉత్పత్తి, నీటి పారుదల వంటి ప్రాజెక్టులు) ఖర్చు చేయాలని, గృహ నిర్మాణం ప్రాజెక్టులు చేపట్టాలని సూచిస్తున్నాయి. మరికొన్ని దేశాలలో మధ్యేవాద- వామపక్ష పార్టీలు పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టి ఆ రూపేణా నగదు మార్కెట్‌లోకి విడుదల చేయాలని సూచిస్తున్నాయి. ఇటువంటి చర్యలు కొనుగోలు శక్తిని పెంచే మాట నిజమే కాని ఈ చర్యలు మాంద్యాన్ని నివారించడానికి ఏ మూలకూ చాలవు.

2008 లో వచ్చినటువంటి సంక్షోభం మళ్లీ వస్తే ఈసారి దాని దెబ్బ గతంలో తగిలిన దానికన్నా గట్టిగా ఉంటుంది. 2008లో జర్మనీ, చైనా, ఇండియా వంటి దేశాలు సంక్షోభ ప్రభావానికి వెలుపల ఉన్నాయి కనుక దాని నుండి తక్కిన దేశాలను బైటకు లాగడానికి కొంత తోడ్పడగలిగాయి. ఈమారు ఈ మూడు దేశాలు కూడా మాంద్యం వైపే పయనిస్తున్నాయి. ఇక బైటకు లాగేదెవరు?

ఈ మాంద్యంలో కార్పొరేట్‌ సంస్థలు తీసుకున్న అప్పులను ఎగ్గొట్టే అవకాశాలు ఎక్కువ. విదేశీ మారకం రూపంలో ఇవి తీసుకున్న అప్పుల్ని తిరిగి చెల్లించేటప్పటికీ ఆ విదేశీ కరెన్సీ విలువ ఇంకా పెరిగి పోయి ఉంటుంది గనుక అటువంటి అప్పుల్ని ఎగ్గొట్టడం జరుగుతుంది. ఫలితంగా ఈ ఎగవేతదారుల ఆస్తులను అమ్మకానికి పెట్టవలసి వస్తుంది. ఆ ఆస్తుల విలువలు పడిపోతాయి. ఈ ఆస్తులను పూచీగా చూపించి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి వుంటారు. ఆస్తుల మీద పడిపోతే అప్పులిచ్చిన బ్యాంకులకు దాని దెబ్బ తగులుతుంది.

బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లు బాగా తగ్గించినందున, మార్కెట్‌లోకి బ్యాంకులు నగదు విడుదల చేసివున్నందున, మాంద్యం వచ్చి మీద పడ్డాక ఇక అదనంగా జోక్యం చేసుకోగలిగే శక్తి ఇంకా తగ్గిపోతుంది. ఈ మాంద్యం నెలకొనకుండా నివారించగలిగే శక్తి, అవకాశం ఈపెట్టుబడిదారీ వ్వవస్థలో ఏ మాత్రమూ కనిపించడం లేదు. దీనికి తోడు ట్రంప్‌, బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌ వంటి నేతలు ఏ క్షణాన ఎటువంటి తిక్కతిక్క నిర్ణయాలు చేస్తారో కూడా తెలియదు. ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలన్నది ప్రశ్నార్థకమే.

(COURTECY PRAJA SHAKTHI)

Leave a Reply