– లేబర్‌ కోడ్‌ రూల్స్‌ సిద్ధం చేసిన మోడీ సర్కార్‌
– కేంద్ర కార్మిక శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడి

న్యూఢిల్లీ : ప్రపంచ కార్మికులు ఎన్నో దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న ‘రోజుకు 8 గంటల పని’ అనే హక్కును రద్దు చేయడానికి మోడీ సర్కార్‌ సిద్ధమైంది. రోజుకు 12 గంటలు పని..అమలుజేయాలని లేబర్‌ కోడ్‌ తీసుకురాబోతున్నది. పని గంటల్ని మారుస్తూ ‘కోడ్‌ ఆన్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ, హెల్త్‌ అండ్‌ వర్కింగ్‌’ అనే లేబర్‌ కోడ్‌ను సిద్ధం చేసింది. ఇప్పటివరకూ ఉన్న 13 కార్మిక చట్టాల్ని మారుస్తూ, వాటి స్థానంలో ఈలేబర్‌ కోడ్‌ను తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర కార్మిక శాఖ వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. లేబర్‌ కోడ్‌లోని నిబంధనలపై వివిధ వర్గాల నుంచి సలహాలు, సూచనలు, మార్పుల్ని కోరుతూ 45 రోజుల గడువు ప్రకటించింది. తాజా నోటిఫికేషన్‌లో పని గంటల పెంపు, 8 గంటల కంటే ఎక్కువ పనిచేసినా ఆ గంటలకు ఓవర్‌టైం వేతనం ఇవ్వాలి. ఈ లెక్కన డబుల్‌ వేతనం పొందేందుకు అర్హులవుతారని ప్రకటించింది. అయితే మోడీ సర్కార్‌ తీసుకున్న కార్మిక వ్యతిరేక నిబంధనలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరినాటికి నాలుగు లేబర్‌కోడ్‌లపై పార్లమెంట్‌ ఆమోదం పొంది, వీలైనంత తొందరగా చట్టాల్ని అమల్లోకి తీసుకురావాలని మోడీ సర్కార్‌ భావిస్తోంది. పని గంటల్ని పెంచుతూ ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మరికొన్ని రాష్ట్రాలు కొద్ది నెలల క్రితం చట్టాలు చేయటంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు ఊపందుకున్నాయి.

Courtesy Nava Telangana