న్యూఢిల్లీ : కార్మికహక్కుల పరిరక్షణలో భారత్‌ ర్యాంక్‌ దారుణంగా పడిపోయింది. ‘కమిట్‌మెంట్‌ టు రెడ్యూసింగ్‌ ఇనీక్వాలిటీస్‌’ పేరుతో ఆక్స్‌ఫామ్‌ రూపొందించిన నివేదికలో భారత్‌ 151 స్థానంలో నిలిచింది. ప్రభుత్వ సేవలు, కార్మిక హక్కులు, విద్య, వైద్యం…పలు విభాగాల్లో 158 దేశాలకు ఆక్స్‌ఫామ్‌ ర్యాంకులు విడుదల చేసింది. భారత్‌లో ఉద్యోగ, ఉపాధిరంగాల్లోని కార్మికుల హక్కులు దారుణంగా దెబ్బతిన్నాయనీ, దాంతో భారతదేశ ర్యాంక్‌ 141 నుంచి 151కి దిగజారిందని నివేదిక తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏర్పడ్డ సంక్షోభం కారణంగా దేశంలో అసమానతలు మరింతగా పెరిగాయనీ, ప్రభుత్వాలు ఈ సమస్యపై వెంటనే దృష్టిసారించాలని నివేదిక అభిప్రాయపడింది. ఈ నివేదికలోని మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రభుత్వ సేవల్లో 141వ స్థానం
రాష్ట్రాల వారీగా చూస్తే, ఉత్తరప్రదేశ్‌లో అసంఘటిత కార్మికుల్లో 86.9 శాతం పురుషులున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత కార్మికుల్లో మహిళలు 73.6శాతమున్నారు. ఢిల్లీలో 31.8శాతం మహిళలు, 64.8శాతం పురుషులు పనిచేస్తున్నారు. 2019-20లో విద్యపై తెలంగాణ ప్రభుత్వం చేసిన తలసరి వ్యయం రూ.2,584కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.6,398 ఉంది.

ప్రభుత్వ సేవల్లో భారత్‌ 141 ర్యాంక్‌ పొందింది. కార్మికుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సేవలు, ఆరోగ్యం, విద్య, పన్నులు..ఇలా వివిధ విభాగాల్లో 158 దేశాలకు సగటు ర్యాంకులు విడుదల చేయగా, భారత్‌ 129వ స్థానంలో నిలిచింది. మనదేశంలో వైద్య సేవలకు కేటాయించిన బడ్జెట్‌, సగం మంది జనాభాకు మాత్రమే సరిపోతుంది. దేశంలో 73శాతానికి పైగా ప్రజలు వైద్య సేవలకు తమ జేబు నుంచే ఖర్చు చేస్తున్నారు.

Courtesy Nava Telangana