కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కాల గమనంలో కరిగి పోయిన 2019 చిరస్మరణీయ విజయాలను అందించింది. తిరుగులేని రికార్డులను సృష్టించింది. మరపురాని జ్ఞాపకాలను మిగిల్చింది. మానవ చరిత్రకు మరెన్నో విశిష్టతలను కలుగజేసింది. అలాంటి అరుదైన ఘటనల్లో మేటి మాలావత్‌ పూర్ణ చేసిన అపురూప సాహసం.

పర్వతారోహణలో ఇప్పటికే పలు సాహసాలు చేసి దేశానికి ప్రత్యేక విశిష్టతలను సంపాదించి పెట్టిన ఈ తెలుగు బిడ్డ గత నెల 26న మంచు ఖండమైన అంటార్కిటికాలోని అతి ఎత్తయిన విన్సన్‌ మసిఫ్‌ పర్వతాన్ని అధిరోహించింది. 16,050 అడుగుల ఎత్తు గల ఈ పర్వతం ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాల్లో ఒకటిగా రికార్డులకెక్కడమే కాదు, అధిరోహణకు అత్యంత దుర్లభమైనదిగానూ ఉంది. అటువంటి దుస్సాధ్యమైన అధిరోహణను అలవోకగా సుసాధ్యం చేసిన పూర్ణ సాహసాన్ని ‘ఔరా’ అంటూ ప్రపంచమే కొనియాడుతోంది. దీనితో ఆమె ఆరేళ్లలో ఆరు ఖండాల్లోని అరు ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన మహిళగానూ మరో రికార్డును సొంతం చేసుకున్నారు.

2014లో 13 ఏళ్ల 11 నెలల వయస్సులోనే ఆసియాలోని అతి ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన పూర్ణ ఈ ఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అందులోనూ తొలి ప్రయత్నంలోనే ఆ శిఖరాగ్రాన్ని చేరి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ అపురూప విజయంతోనే ఆ బాలిక ఆగిపోలేదు. ఆ విజయోత్సాహంలోనే ప్రపంచపు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తయిన పర్వతాలు అధిరోహించడమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. నాటి నుంచీ ఏడాదికో ఖండంలోని పర్వతం చొప్పున ఈ ఆరేళ్లలో ఆరు శిఖరాగ్రాలను చేరుకుని తన లక్ష్యానికి అడుగు దూరంలోకి వచ్చింది. 2020లో దాన్నీ పూర్తి చేస్తానంటూ పట్టుదలగా ప్రకటిస్తోంది. ఆమె సాధిస్తున్న విజయాలను, ఆమె దీక్షాదక్షతలను ప్రత్యక్షంగా చూస్తున్న ప్రపంచం అది సాధ్యమేనని నమ్ముతోంది. మన తెలుగు వారి కీర్తి ప్రతిష్ఠలను ఆమె ఇనుమడించగలదని అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పర్వతారోహణ అంటే కొండలు, గుట్టలు వంటి ఎత్తులు ఎక్కడమే కాదు. అది ఎన్నో సాహసాలతో కూడిన కృత్యం. పర్వత శిఖరాలను అందుకోవడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. పర్వతాలపై భౌగోళిక స్థితిగతులు మనకు ఏమాత్రం పరిచయం లేనివిగా ఉంటాయి. విషవృక్షాలు, జంతు జాలాలతో కూడిన పరిస్థితులుంటాయి. కొన్ని పర్వతాలు దారీ తెన్నూ తెలియకుండా ఉండేవి అయితే, మరి కొన్ని మంచుతో కప్పబడి ఉంటాయి. ప్రమాదభరితమైన ఈపరిస్థితులకు తోడు వాతావరణం మరింత ప్రతికూలంగా ఉంటుంది. పైకి వెళ్లే కొద్దీ ప్రాణవాయువు తగ్గి పోతూ ఉంటుంది. ఎవరెస్టు వంటి శిఖరంపై అయితే గాలి అందక శ్వాస పీల్చుకోవడమే కష్టంగా ఉంటుంది. కేజీల కొద్దీ బరువును మోసుకుంటూ దారి చేసుకుంటూ ముందుకు సాగడమంటే సామాన్యులకు అనూహ్యం, సాహసులకు దుస్సాధ్యం. అందుకే, పర్వతారోహణ అంటే ప్రపంచంలోనే అత్యంత సాహస కృత్యంగా పేరుపొందింది. అందులోనూ ఖండఖండాల్లోని పర్వతాలపై విభిన్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఉష్ణ మండలంలో ఉండే మనలాంటి వారికి అతిశీతలంగా ఉండే అంటార్కిటికాలోని పర్వతంపై అడుగుపెట్టడమంటే అష్టకష్టాలతో కూడినదే. అలాంటి ఎన్నో ప్రతికూలతలను తట్టుకుంటూ 20 ఏళ్లు కూడా నిండని యువతి ఆరు పర్వతాలను అలుపెరుగకుండా ఎక్కడమంటే మాటల్లో వర్ణించలేని, మానవ శక్తికి మించిన పని. ఇలాంటి ఘనతను సాధించిన వారు ప్రపంచంమొత్తంలోనూ వేళ్లమీద లెక్కబెట్టగలిగనంత మందే ఉన్నారు. అలాంటి అరుదైన వారందరిలోనూ పిన్న వయస్కురాలు పూర్ణ.

ఇప్పుడు సాహసానికే చిరునామాగా ఎదిగిన ఈ తెలుగు అమ్మాయి బాల్యంలో బడికెళ్లడమే ఘనకార్యన్నట్లుగా, చదువుకోవడమే సాహసంగా ఉండేది. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని గిరిజన గ్రామమైన పాకాలకు చెందిన పూర్ణ తల్లిదండ్రులు రెక్కాడితే గానీ డొక్కాడని వ్యవసాయ కూలీలు. అంతటి పేదరికంలో పుట్టిన పూర్ణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంది. 8వ తరగతిలోనే పర్వతారోహణ శిక్షణకు ఎంపికైంది. 9వ తరగతి చదువుతున్నప్పుడే ఎవరెస్టును అధిరోహించింది. ‘జీవితాన్ని గెలుచుకోవడం కన్నా.. ఎవరెస్టును అందుకోవడమే ఈజీ’ అన్న పూర్ణ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తున్నది. ఆమె చేసిన సాహసాలను చాటిచెప్పడానికే ‘పూర్ణ : ద కరేజ్‌ హాజ్‌ నో లిమిట్‌’ అన్న పేరుతో ఈ పర్వతారోహకురాలి బయోపిక్‌ నిర్మితమైంది. నిమ్న స్థాయి నుంచీ అత్యున్నత స్థాయికి ఎదిగిన పూర్ణ ‘అమ్మాయిలు ఏదైనా సాధించగలరు’ అని నిరూపించడమే లక్ష్యంగా మరిన్ని ఘనతలు సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. ఆ సమున్నత లక్ష్యసాధనంలో ఆమె విజయం సాధిస్తుందనడం నిస్సందేహమే!

(Courtesy Andhrajyothi)