Image result for ఆ మహిళల పరువూ విలువైనదే"సౌజన్య తమలపాకుల

స్త్రీలు కుటుంబంలో అనుభవించే హింసను చూసీచూడనట్టు ఊరుకునే సమాజం, తక్కువ కులం వారిని ప్రేమిస్తే కన్న కూతురునే చంపేసే తల్లి తండ్రులున్న మన సమాజం ఈరోజు ముద్దాయిలను ఉరి తీయాలని కోరుతున్నది.
వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య దేశాన్ని కలిచివేసింది. నవంబర్‌ 27వ తారీకు ఇంటినుండి ఉద్యోగం రీత్యా బయలుదేరిన ఆమె తిరిగి రాలేదు. మాదాపూర్ నుంచి శంషాబాద్ కు వచ్చిన ఆమె, తన స్కూటీ టైర్ పంక్చర్ అయినట్టు, అక్కడి మనుషులను చూస్తుంటే తనకు భయం కలుగుతోందని చెల్లికి ఫోన్ చేసి చెప్పింది. తరువాత కొద్ది నిముషాల్లోనే ఆమె మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. దానితో ఆమె తల్లి, చెల్లెలు ఎయిర్‌పోర్ట్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు ఇస్తే, వారు పాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళమన్నారు. మరుసటి రోజు ప్రియాంక శవం దహనమై కనిపించింది.
28న ప్రియాంక నివాస కాలనీ వాసులు, వెటర్నరీ సంఘ సభ్యులు క్యాండిల్ మార్చ్ చేసారు. తరువాతి రోజు దేశం మొత్తం పలు చోటల నిరసనలు వెల్లువెత్తాయి. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని లేదా తగులబెట్టాలని ప్రజలు డిమాండ్ చేసారు.
ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పే ఒక వర్గం (విమెన్ అండ్ ట్రాన్స్ జేఏసీ) ఉరిశిక్షకు వ్యతిరేకతను ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సి విషయం ఏమిటంటే, ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చి, బహిరంగ శిక్షలు అమలు చేస్తే అణగారిన వర్గాలు మరింత అన్యాయానికి గురి అయ్యే అవకాశం ఉంది. ఆ నలుగురిని ఉరి తీస్తే స్త్రీలు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకగలరా? మరెవరూ అలాంటి వారు లేరా? స్త్రీలపై దౌర్జన్యం అనేది మన సమాజంలో అంతర్భాగంగా వేళ్ళూనికొని వుంది. ఆడపిల్లను కట్టడి చెయ్యటానికి, హింసకుగురిచేయటానికి వెనుదీయనివారు ఈరోజు స్త్రీలపై దాడులను ఖండిస్తున్నారు.
సామజిక మాధ్యమాల్లో ప్రియాంక రెడ్డి ఆ రాత్రి బయటకెందుకు వెళ్ళింది అని, పాశ్చాత్య దుస్తులు ధరించిన మహిళను మానభంగం చెయ్యటం తప్పు లేదని వాదిస్తున్నారు. తమిళ సినిమా దర్శకుడు ఒకాయన సాంప్రదాయ దుస్తులు ధరించకపోవడం, కట్టుబాట్లను గౌరవించకపోవటంవల్లే హింస పెరిగిందంటూ మహిళలపై వారి అస్తిత్వంపై దాడి చేసాడు. ప్రజలకు ఎందుకు వీరి పైన ఆగ్రహం కలగటం లేదు? ఎందుకు కేవలం ఆ నలుగురు ముద్దాయిలను మాత్రమే ఉరి తీయాలంటున్నారు? ఎందుకంటే భారతీయ సమాజంలో కొన్ని రకాల హింసలు అంతర్భాగంగా ఉంటాయి. వాటిని ప్రశ్నించటం అంటే, బ్రాహ్మణీయ భావజాలాన్ని కులసమాజాన్ని ప్రశ్నించినట్టే.
ఇక్కడ ప్రియాంక తల్లి తనకూతురు కనపడకపోవడం కాలనీలో ఎవరితోనూ చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే, ఇప్పుడు ఏ సమాజం ఆమె వైపు నిలబడిందో అదే సమాజం ఒకవేళ ఆమె కూతురు క్షేమంగా ఉండి ఉంటే సమయానికి ఎందుకు ఇంటికి రాలేదో రకరాలుగా చర్చించి, నిందించి వారి పరువుతీసేవారు. అటువంటి హింసాత్మకమైన సమాజం ఇప్పుడు హింసకు వ్యతిరేకంగా నిరసనలు జరుపుతున్నది. స్త్రీలు కుటుంబంలో అనుభవించే హింసను చూసీచూడనట్టు ఊరుకునే సమాజం, తక్కువ కులం వారిని ప్రేమిస్తే కన్న కూతురునే చంపేసే తల్లి తండ్రులున్న మన సమాజం ఈరోజు ముద్దాయిలను ఉరి తీయాలని కోరుతున్నది.
మహిళను గౌరవించే మన సమాజంలో ఒక స్త్రీని చూడగానే అమ్మ గుర్తురావాలి అంటున్నారు కొందరు. భారత సమాజంలో స్త్రీలకు గౌరవం ఉంది కానీ, ఆ గౌరవానికి అందరు స్త్రీలు అర్హులు కాదు. బ్రాహ్మణీయ కుల సమాజ కట్టుబాట్లలో బ్రతికే స్త్రీలు మాత్రమే ఈ గౌరవానికి అర్హులు. ఆడవాళ్లను అమ్మతో పోల్చి, ఆమె త్యాగం, బాధలు, ఓర్పు, పవిత్రతను గుర్తుచేస్తూ గౌరవించమని అర్థించటం క్రూరత్వమే అనిపించుకుంటుంది. ఆమె, ఏ బట్టలు ధరించినా, ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా, ఒంటరిగా ఉన్నా, సెక్స్ వర్క్ చేస్తూన్నా, పేద స్త్రీ అయినా, మధ్య తరగతి అయినా, అర్ధరాత్రి బయట తిరిగినా అందరినీ ఒకే విధంగా గౌరవించమని మన బ్రాహ్మణీయ సమాజం చెప్పదు.
ఈ సమాజంలో అమ్మ అంటే మధ్య తరగతికి చెందిన ఒక స్త్రీ. ఆమెకు కొన్ని లక్షణాలు ఆపాదించి పెట్టారు. ఆమె పెళ్లి తరువాత మాత్రమే తల్లి అవుతుంది. సాంప్రదాయ దుస్తులు ధరిస్తుంది. భర్తకు, పిల్లలకు చాకిరీ చేస్తూ త్యాగశీలిగా పేరు పొందుతుంది. ఈ తీరులో ఉండని స్త్రీలను గౌరవించమని బ్రాహ్మణీయ సమాజం మనకు ఎప్పుడు చెప్పదు. దాంతో స్త్రీలను అదుపుచేయడానికి పురుషులు మానభంగాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారు. ఈరోజున ఎక్కడ విన్నా చూసినా, మానభంగం హత్యలకు గురైన స్త్రీల గురించి, వారి దుస్తుల గురించి, లైంగిక జీవితం గురించి చర్చ జరుగుతుందంటే దానికి కారణం ‘స్త్రీలను గౌరవించండి’ అంటూ కొన్ని షరతులు పెట్టిన మన సమాజం. చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సౌకర్యం మేరకు, అనుకూలమైన దుస్తులు ధరిస్తున్నారు. దీనిని కారణంగా చూపి, పురుషాధిక్యతను, లైంగిక హింసను సమర్థిస్తున్న మన సమాజం మహిళలకు భద్రత చేకూర్చలేదు.
దళిత, ఆదివాసీ స్త్రీలు అగ్రకుల పురుషుల చేతులలో లైంగిక హింసకు గురి అవుతారు. మధ్య తరగతి ప్రజలు అటువంటి హింసను చూసీచూడనట్టు వదిలేస్తారు. ఇప్పటి నిరసనలో పాల్గొన్న ఒక మహిళ పోలీసులను నిలదీస్తూ ఇలా అన్నది: ‘‘ప్రియాంక ఒక చదువుకున్న అమ్మాయి. ఆమె ఒక గౌరవమైన కుటుంబానికి చెందింది. ఆమె లంబాడా తండా నుంచి వచ్చిన అమ్మాయి కాదు, ఇలా జరిగితే ఊరుకోవటానికి’’. ఈ మాటలు వింటూంటే స్త్రీలకు, వారి శరీరాలకు విలువను నిర్ణయించే అంశాలు కులం, వర్గం, మతమేనని అర్థం కావడం లేదూ? స్త్రీ అస్తిత్వానికి ఇంకా గుర్తింపు గౌరవం లేదు. ప్రియాంక రెడ్డి స్థానంలో ఒక పేద ఆదివాసీ మహిళ ఉన్నప్పుడు స్పందించని ఈ సమాజం ఎన్నటికీ మహిళలకు భద్రతను ఇవ్వలేదు.
ఈరోజు బహిరంగ ఉరిశిక్షలు కావాలని కోరే వారి మనస్తత్వం ఏంటి? వీరు ప్రత్యూష, అయేషా వంటి వారిని దారుణంగా మానభంగం చేసి చంపిన వారిపై ఇలాంటి ఆగ్రహం చూపించారా? లేదు. ఎందుకంటే.. దాని వెనుక అగ్రకుల, రాజకీయ నాయకుల హస్తాలున్నాయి. ఆ మహిళలు సినీ రంగానికి చెందిన వారు కాబట్టి, వారి లైంగిక జీవితాన్ని వీరు అనుమానిస్తారు కాబట్టి, వారిపై దాడులను వీరు సమర్థిస్తారు. ఇప్పుడు ముద్దాయిలను దారుణంగా కాల్చి చంపమని అడుగుతున్న హింసాత్మక సమాజంలో స్త్రీలు అసలు మనగలరా? ప్రజలలోను, సమాజంలోను మార్పు కూడా రాకుండా, ముద్దాయిలను నేర నిరూపణ చెయ్యకుండా శిక్షిస్తే అది ప్రజాస్వామ్యంపై అత్యాచారం తప్ప మహిళలకు ఒరిగేది ఏమీ ఉండదు. కుల రహిత, పితృస్వామ్య రహిత సమాజం ఏర్పడే వరకు స్త్రీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా మనగలరు అనుకోవటం పొరపాటు.
అసిస్టెంట్ ప్రొఫెసర్, టిస్స్‌, హైదరాబాదు
(Courtesy Andhrajyothi)