భగవత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
ఇంత తెలివితక్కువగా మాట్లాడతారా : సోనమ్‌కపూర్‌

గాంధీనగర్‌ : ఉన్నత చదువులు చదివి, అధికాదాయం సంపాదించే కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆరెస్సెస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భగవత్‌ మాట్లాడుతూ… ‘ఈరోజుల్లో విడాకుల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ప్రజలు అనవసర విషయాల మీద తగువులు పడుతున్నారు. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివినోళ్లు.. ఐశ్వర్యవంతుల కుటుంబాలే విడాకులు ఎక్కువగా తీసుకుంటున్నాయి. విద్య, సంపాదనతో వచ్చిన పొగరు కారణంగా వారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలోనూ అంతరాలు పెరిగిపోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అంతేగాక.. ‘మనం పాటించే ఆచార వ్యవహారాలే హిందూ వ్యవస్థకు బలమైన పునాది. 2 వేల ఏండ్లుగా వాటిని సమాజం పాటిస్తున్నది. ఆడవాళ్లు ఇంటికే పరిమితమవడం అప్పటినుంచే కాదు.. సమాజం స్వర్ణయుగం అని చెప్పుకునేప్పటి నుంచి ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయి’ అంటూ మాట్లాడారు.

సోనమ్‌ కపూర్‌ ఆగ్రహం
భగవత్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచక్షణ కలిగిన వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి..? అంటూ ఆమె ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘ఇలా ఎవరైనా మాట్లాడుతారా..? ఈ వ్యాఖ్యలు చాలా మూర్ఖంగా ఉన్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇదే విషయమై సామాజిక మాధ్యమాల్లోనూ నెటిజన్లు మండిపడుతున్నారు. సమాజం పురోగతి చెందుతున్నా భగవత్‌ వ్యాఖ్యలు మాత్రం ఇంకా మహిళలను వంటింటి కుందేళ్లుగానే ఉంచేలా ప్రతిబింబిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓవైపు మహిళలు అన్ని రంగాల్లో ముందుకుపోతున్నా.. ఆరెస్సెస్‌ చీఫ్‌ మాత్రం ఇంకా పితృస్వామ్యవ్యవస్థ భావాజాలాన్నే వ్యాపిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

Courtesy Nava Telangana