మనదేశంలోనే కాదు దాదాపు ప్రపంచమంతా మహిళలపై వివక్ష కొనసాగుతోంది. మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నాయి. అయినా జీతాలు, పదవుల్లో అన్యాయం జరుగుతోంది. అంతేకాదు మహిళలపై కొన్ని ప్రత్యేక అణచివేతలు కూడా కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు, వేతనాల్లో దారుణమైన అసమానతలు, వితంతువులపై వివక్ష, ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం వంటి నేరాలు ప్రత్యేకమైనవి. మహిళలకు రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించినా వాటిపై సరైన అవగాహన లేకపోవడం, కనీసం వాటి గురించి తెలియకపోవడంతో అతివలు మరింత అన్యాయాలకు గురవుతున్నారు. తమపై వివక్షను, వేధింపులను ఎదుర్కోవడానికి తమ హక్కుల గురించి తెలుసుకోవాలి.

వారసత్వంలో సమాన వాటా హక్కు: వారసులు అంటే కొడుకులే అని భావించే దేశం మనది. దీనికి అడ్డుకట్టవేయడానికి చట్టాలు ఉన్నాయి. హిందూ వారసత్వ చట్టం 1995 ప్రకారం.. వారసత్వ ఆస్తిలో స్త్రీపురుషులకు సమాన వాటాలు ఇవ్వాలి. అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లొచ్చు.

భ్రూణహత్యల నిరోధక హక్కు: ఆడపిల్లపై వివక్షకు పరాకాష్ట భ్రూణహత్యలు. ఆడపిల్లలను పిండదశలోనే చంపడం నేరం. లింగనిర్ధారణ పరీక్షలను నేరంగా పరిగణిస్తారు. లింగనిర్ధారణ పరీక్షల చట్టం 1994 ప్రకారం మహిళలకు తన గర్భంలోని శిశువును కాపాడుకునే హక్కు వుంది.

గృహహింస నిరోధక హక్కు: ఇంటి విషయాలను బయటికి చెబితే పరువు పోతుందని భావిస్తుంటారు. అందువల్ల అత్తింటి వేధింపులు, భర్త పెట్టే శారీరక, మానసిక హింసలు వెలుగుచూడవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గృహహింస నిరోధక చట్టం 2005ను తీసుకొచ్చారు. ఇంట్లో తనపై వేధింపులకు పాల్పడే కుటుంబ సభ్యులపై మహిళలు కేసు పెట్టొచ్చు.
ప్రసూతి ప్రయోజనాల హక్కు: ప్రసూతి ప్రయోజనాలు కేవలం ఉద్యోగినులకే సొంతం కాదు. అందరికీ ఈ సౌకర్యాలు ఇవ్వాలని చట్టాలు చెబుతున్నాయి. ప్రసవం వల్ల సంపాదన కోల్పోకూడదని ప్రసూతి సెలవుల హక్కు 1961 చెబుతోంది. ప్రస్తుతం 26 వారాలు ప్రసూతి సెలవులుగా నిర్ణయించారు.

న్యాయ సహాయ హక్కు: అన్యాయానికి గురైన మహిళ ఒంటరిగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే న్యాయం జరగడం లేదు. పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోరు. మోసం చేసే అవకాశం కూడా ఉంది. అందుకే ఆమె న్యాయవాదితో కలసి వెళ్లాలి. దీనికి న్యాయ సహాయ హక్కును వాడుకోవాలి. లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీస్‌ 1987లోని సెక్షన్‌12 ప్రకారం న్యాయ సాయం అందుతుంది.
గోప్యత హక్కు: అత్యాచారం, లైంగిక వేధింపులకు గురైన మహిళలు మేజిస్ట్రేట్‌కు మాత్రమే వ్యక్తిగతంగా తమ ఫిర్యాదును తెలపాలి. ఆ సమయంలో మరో వ్యక్తిగాని, అధికారిగాని ఉండకూడదు. అంతేకాకుండా, బాధితురాలు తన వాంగ్మూలాన్ని మహిళా కానిస్టేబుల్‌, మహిళా పోలీస్‌ అధికారి వద్ద మాత్రమే రికార్డు చేయొచ్చు కూడా. సీఆర్పీసీ సెక్షన్‌ 12 ప్రకారం పోలీసులు ఈ సదుపాయం కల్పించాలి.

ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల హక్కు : మారుతున్న టెక్నాలజీని కూడా బాధితులు తమ న్యాయపోరాటం కోసం వాడుకోవచ్చు. మహిళలు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయడానికి ఢిల్లీవంటి కొన్ని రాష్ట్రాలు వీలు కల్పిస్తున్నాయి. దీన్ని జీరో ఎఫ్‌ఐఆర్‌ అంటారు. ఈమెయిల్‌, రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. తర్వాత పోలీసులు బాధితురాలి ఇంటివద్దకే వచ్చి కేసు నమోదు చేసుకుంటారు.

అరెస్ట్‌ కాకుండా: సీఆర్పీసీ సెక్షన్‌ 46 ప్రకారం.. సాయంత్రం 6 గంటల నుంచి పొద్దున 6 గంటల లోపల మహిళలను అరెస్ట్‌ చేయడానికి వీల్లేదు. అరెస్ట్‌ వారంటు జారీ చేసినా ఆమెను ఈ వ్యవధిలో అరెస్ట్‌ చేయకూడదు.
పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండా: సీఆర్పీసీ సెక్షన్‌ 160 ప్రకారం.. ఒక మహిళలను విచారణ కోసం బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించకూడదు. మహిళను పోలీసులు ఆమె ఇంటివద్ద, కుటుంబ సభ్యుల సమక్షంలో విచారించాలి.

సమాన వేతన హక్కు: మనదేశంలో మహిళలకు తక్కువ వేతనాలు సాధారణం. మగవాడితో సమానంగా పనిచేసినా అతనితో పోలిస్తే తక్కువ జీతాలు, కూలి అందుతోంది. కానీ రాజ్యాంగం వీరికి సమాన వేతనం ఇవ్వాలని స్పష్టం చేస్తోంది. ఈక్వల్‌ రెమ్యూనరేషన్‌ చట్టం 1976 కింద యాజమాన్యం.. సమానంగా పనిచేసే స్త్రీపురుషులకు సమాన వేతనం ఇవ్వాలి.
పనిప్రదేశంలో వేధింపులకు అడ్డుకట్ట: పని ప్రదేశాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులు నిరోధక చట్టం 2013 ఈ నేరాలకు అడ్డుకట్ట వేస్తుంది. ఉద్యోగినులు తమపై పనిప్రదేశాల్లో ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడితే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి.

దోషులపై యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
పేరు చెప్పకుండా ఉండే హక్కు: తమకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెబితే కుటుంబ పరువు పోతుందనో, లేకపోతే కుటుంబం కూడా తమను వెలి వేస్తుందనో భారతీయ మహిళలు భావిస్తారు. అందుకే చాలా ఘోరాలు వెలుగులోకి రావడం లేదు. అత్యాచారాలు, దాడులు వంటి తీవ్ర నేరాలకు గురైన మహిళలు తమ పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసుకునే హక్కు ఉంది. సీఆర్పీసీ 228 ఏ సెక్షన్‌ కింద ఫిర్యాదు దశ నుంచి కేసు విచారణ వరకు పేరు రికార్డుల్లోకి ఎక్కకుండానే న్యాయం కోసం పోరాటం చేయొచ్చు.

(Courtesy Nava Telangana)