– మహిళా కార్మికులపై తీవ్ర ప్రభావం : ఐఎల్‌ఓ

న్యూఢిల్లీ : కరోనా.. యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడించిన వైరస్‌ మహమ్మారి.. ఏ రంగాన్నీ వదలలేదు. అన్నిటితోపాటు.. వస్త్ర పరిశ్రమనూ పెను ప్రమాదంలోకి నెట్టేసింది. వస్త్ర రంగంలో మహిళా కార్మికులే అత్యధికం. వీరిపై కరోనా కోలుకోలేని దెబ్బతీస్తున్నది. వివక్ష, వేధింపులు, వేతనాల్లో అంతరాలు, అసమానతలను ఎదుర్కొంటున్న మహిళా కార్మికులపై కోవిడ్‌ ప్రభావం తీవ్రంగా పడిందని (అంతర్జాతీయ కార్మిక సంస్థ) ఐఎల్‌ఓ పేర్కొంది. కుటుంబ బాధ్యతలు, సంరక్షణ వారిపై మరింత భారంగా మారిందని తెలిపింది. ‘వస్త్ర రంగ శ్రామికశక్తిలో మహిళలు 80శాతం మందిపైనే. కరోనా మహమ్మారి ప్రభావం వారిపై మరింత పడుతున్నది. ఆ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ళతో పాటు కరోనా నడుమ.. ఆర్థిక భారాలు, ఇంటి బాధ్యతలతో వారు మరింత సతమతమవుతున్నారు’ అని ఐఎల్‌ఓ ఆసియా పసిఫిక్‌ ప్రాంతీయ కార్యాలయ అధికారి జోనీ సింప్సన్‌ తెలిపారు. మొత్తం శ్రామిక శక్తిలో 75శాతం మంది అంటే 6.5 కోట్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారనీ, 2020 మొదటి అర్ధభాగంలో వారి సంఖ్య 70శాతానికి పడిపోయిందని అన్నారు.

దీనితోపాటు కార్మికుల తొలగింపులు పెరిగాయనీ, అయితే తిరిగి కొన్ని కర్మాగారాలు తెరుచుకున్నా.. అతి తక్కువ శ్రామికులతోనే నడుస్తున్నాయని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో కొనుగోళ్ళు లేక.. మిలియన్‌ డాలర్ల విలువైన ఆర్డర్లు రద్దయ్యాయి. బంగ్లాదేశ్‌, కంబోడియా, ఈజిప్ట్‌, ఇథియోపియా, వంటి దేశాల్లో లక్షలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. కొన్నిచోట్ల చేసిన పనికి వేతనాల చెల్లింపు కూడా జరగలేదు’ అని ఐఎల్‌ఓ నివేదిక పేర్కొంది. ‘వస్త్ర పరిశ్రమలో అత్యధిక మంది మహిళలు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేయటం, సర్వీసు లెక్కలో లేకపోవటం, పనితీరు, అర్హతల రికార్డులు లేకపోవడం వంటివి వివక్షకు దారితీస్తున్నాయి. అసంఘటితరంగంలో మహిళల ఉపాధి వాటా ఎక్కువగా ఉండటానికి ఇది కారణం కావచ్చు. ఎందుకంటే.. దిగువ, మధ్యతరగతి ఆదాయ దేశాల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు మహిళలే అత్యధికంగా ఉన్నారు’ అని తెలిపింది. ఆర్థిక అభద్రతతో పెరిగిన ఉద్రిక్తతల నడుమ మహిళలపై గృహ హింస కూడా పెరిగిందనీ నివేదిక పేర్కొంది. అంతేకాదు, మహిళల ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. మహిళ, పురుష కార్మికులపై కోవిడ్‌ మహమ్మారి దుష్ప్రరిణామాలను ప్రభుత్వం, వ్యాపారులు అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. స్థిరమైన, లింగ వివక్షలేని మెరుగైన విధానాలను ప్రభుత్వం, వ్యాపారులు ఇప్పటికైనా అనుసరించాలనీ, లేదంటే… కోవిడ్‌-19 సంక్షోభం అసమానతలను మరింత పెంచుతుందని తెలిపింది. తిరిగి తెరుచుకున్న పరిశ్రమల్లో హింస, వేధింపులను అడ్డుకునేందుకు ప్రయత్నాలను మరింత పటిష్టంచేయాల్సిన అవసరాన్ని కోవిడ్‌ ముందుకు తెచ్చిందని ఐఎల్‌ఓ పేర్కొంది.

Courtesy Nava Telangana