– పద్మ వంగపల్లి

మరో ఆరు రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. సమాన పనికి సమాన వేతనం హక్కుగా దక్కాలని, మెరుగైన పనిప్రదేశాలు కావాలని, పురుషులతో సమానంగా ఓటు హక్కు ఇవ్వాలని నినదించి శతాబ్దం దాటిపోయింది. అయినా సమాన హక్కుల కోసం, సమాన వేతనాల కోసం, భద్రమైన పనిప్రదేశాల కోసం, సాధికారత కోసం నేటికీ నినదించాల్సిన స్థితిలోనే ఉన్నాం. అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ స్ఫూర్తితో ఇతర అన్ని రంగాలతో పాటు భారతదేశంలో నేటికీ మెజార్టీ మహిళలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వ్యవసాయరంగంలోని మహిళా రైతుల, కూలీల కోసం ఇంకా ఉద్యమించాల్సిన స్థితిలోనే ఉన్నాం.
వ్యవసాయానికి సృష్టికర్తలే మహిళలు.. వ్యవసాయమనే వారసత్వ సంపదను కాపాడుతున్నది మహిళలు. అనేక విభిన్నమైన, వైవిధ్యభరితమైన విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో భద్రపరిచింది మహిళలు. విత్తనబ్యాంకుల సృష్టికర్తలు మహిళలు. అందుకే, వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకోవడమంటే, గ్రామీణ భారతాన్ని గురించి మాట్లాడుకోవడం, ఈ దేశానికి అన్నం పెట్టి, తాము మాత్రం పస్తులుంటున్న రైతుల కుటుంబాలు, మహిళలు, పిల్లల జీవితాల గురించి మాట్లాడుకోవడం. వారి ఆరోగ్యం, ఆహారం గురించి ఆలోచించాల్సిన సందర్భం.

మహిళలే కీలకం
నేటికీ వ్యవసాయం, సహజ వనరులపై ఆధారపడిన గ్రామీణ మహిళలు ప్రపంచ జనాభాలో నాలుగోవంతు వున్నారు. అభివృద్ది చెందుతున్న దేశాలలో 43 శాతం వ్యవసాయ కూలీలు మహిళలే. మనకు అందుబాటులో వున్న ఆహారంలో ఎక్కువ భాగాన్ని ఉత్పత్తి చేస్తున్నది ఈ మహిళా రైతులు, వ్యవసాయ కూలీలే. వ్యవసాయానికి సంబంధించిన ఎక్కువ పనుల్లో శ్రమపడుతోంది మహిళలే. నాట్ల నుండి నూర్చడం దాకా అనేకానేక పనుల్లో వారే ప్రధాన శ్రామికులు. జనాభా లో 50 శాతంగా వుండి, వ్యవసాయంలో 75 శాతం పనులు చేస్తున్న మహిళలకు మన దేశంలో 10 శాతం భూమిపై మాత్రమే హక్కు వుంది. ఇది మహిళలపై కొనసాగుతున్న తీవ్ర వివక్షకు నిదర్శనం. భూమి లేదు కాబట్టి వారిని రైతులుగా గుర్తించరు. ప్రభుత్వ రికార్డులలో వ్యవసాయం చేస్తున్న మహిళలు ఎక్కడా రైతులుగా నమోదు కారు. బ్యాంకులు పంట రుణాలు, ఇన్సురెన్స్‌ ఇవ్వవు. వ్యవసాయ శాఖ సబ్సిడీలు, రాయితీలు, శిక్షణలు ఇవ్వదు. మార్కెట్‌ యార్డులలో వారికి కావలసిన వసతులు వుండవు.

రైతుగా గుర్తింపే లేదు
వ్యవసాయం రంగం సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో అనేక మంది మగ రైతులు బలవనర్మరణాలకు పాల్పడుతున్నారు. అయినా వారి ఆత్మహత్యలు వ్యక్తిగత కారణాలతో జరిగినవని కొట్టిపారేస్తున్నారు. అలాంటి కుటుంబాల్లోని మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ప్రభుత్వ సాయం అందకపోగా భవిష్యత్‌లో ఆ భూమినే నమ్ముకుని ఆ మహిళలు వ్యవసాయం చేయడానికి సహకారం అందడం కనాకష్టంగా మారుతోంది. ఇక, మహిళా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఆ చావులకు రైతు ఆత్మహత్యలుగా గుర్తింపే ఉండదు. ఎందుకంటే వారి పేరుతో భూమి ఉండదు. మహిళల్ని రైతులుగా గుర్తించే పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మహిళా రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణా రాష్ట్రం మొదటి మూడు స్థానాల్లో ఉండడం అత్యంత బాధాకరం.

భద్రత లేని జీవితాలు
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం దళిత మహిళలకు ఉచితంగా ఇచ్చిన మూడెకరాల భూమి కూడా అంతగా సాగులోకి రాలేదనే చెప్పాలి. కారణం, అనేక చోట్ల ఉచితంగా ఇచ్చిన భూమి బీడుగా ఉండడమే. ప్రభుత్వం ఈ మహిళలకు రుణసదుపాయం, మౌలిక సౌకర్యాలు, మార్కెట్‌ అవకాశాలు, ఇతర అనేక సహకార వ్యవస్థలు పనిచేస్తే తప్ప ఆ భూమిని వారు సాగుచేయడం సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల విషయానికొస్తే ఓ వైపు వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు కొనసాగుతుండగా మరోవైపు అభివృద్ధి పేరుతో రకరకాల ప్రాజెక్టుల కోసం పెద్దఎత్తున జరుగుతున్న భూసేకరణతో వ్యవసాయం, సహజవనరులపై ఆధారపడిన మహిళలు అందరికంటే ఎక్కువగా నష్టపోతున్నారు. పరిహారంగా ఇచ్చే మొత్తంతో తిరిగి ఈ కుటుంబాలు అనువైన సాగుభూమిని కొనుక్కుని గతంలోలా స్థిర నివాసాలు, భద్రమైనజీవితాలు గడిపేది కష్టమే. అనివార్యంగా వలసజీవులై పోతున్నారు. ముఖ్యంగా ఆత్మగౌరవంతో బతికిన మహిళా రైతులు నగరాలకు వలస వెళ్ళి ఇంటిపనివారుగానో, భవననిర్మాణరంగ కార్మికులుగానో స్థిరపడిపోతున్నారు.

దేశ వ్యాప్తంగా మహిళా రైతులు ఎదుర్కుంటున్న ఇలాంటి అనేక సమస్యల గురించి ‘మహిళా రైతుల హక్కుల వేదిక’ (మకాం) చొరవతో జాతీయ మహిళా కమిషన్‌ భాగస్వామ్యంతో 2017 జనవరి నుండి ఆగస్టు నెలల మధ్య దక్షిణ, తూర్పు, పశ్చిమ, ఈశాన్య, కొండ ప్రాంతాలలో ఐదు ప్రాంతీయ స్థాయి సంప్రదింపులు జరిగాయి. ఈ సమావేశాలలో ఆయా ప్రాంతాలలో చిన్న సన్న కారు రైతులు, భూమి లేని దళిత రైతులు, అడవులపై ఆధారపడే ఆదివాసీ మహిళలు, మహిళా మత్స్యకారులు, రైతు ఆత్మహత్య కుటుంబాలకు చెందిన మహిళలు, పశు పెంపకదారులు.. ఇలా అన్ని రకాల మహిళా రైతులు పాల్గొని తమ డిమాండ్లను ముందు పెట్టారు. ఈ సమావేశాలలో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు హాజరయి చర్చలలో పాల్గొన్నారు. వీటన్నిటి సమాహారంగా ఆగస్టులో రెండురోజుల పాటు జాతీయ స్థాయి సమావేశాలు జరిగాయి. ఇందులో ప్రధానంగా మహిళా రైతులకు వారసత్వ భూమి హక్కులు, ప్రభుత్వ భూమిపై హక్కులు కల్పించాల్సిన ఆవశ్యకతను, వ్యవసాయంలో మహిళలకు ప్రత్యేక పధకాలకు బడ్జెట్‌ కేటాయింపులను 50 శాతం వరకు పెంచి అవి సమర్ధవంతంగా వినియోగించేటట్లు చూడవలసిన అవసరం, మహిళా రైతులను సహకార సంఘాలు/ ఉత్పత్తిదారుల సంఘాలుగా సంఘటితం చేసి ఆ సంఘాల ద్వారా మహిళా రైతులకు అన్ని రకాల మద్దతు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించటం వంటి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. అక్టోబరు 15 ‘గ్రామీణ మహిళా దినోత్సవాన్ని’ ‘మహిళా రైతుల దినోత్సవం’గా జరపాలని ప్రకటించారు. ఒక విధంగా ఇది మహిళా హక్కుల సాధనలో ఒక ముందడుగనే చెప్పాలి.

అస్థిత్వాన్ని గుర్తిద్దాం
ప్రభుత్వాలు చొరవ చూపితే, ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా రైతులను, వారి హక్కులను గుర్తిస్తూ జారీ చేసిన జి.వో అందుకు ఉదాహరణగా చెప్పుకోవాలి.
వ్యవసాయం, ఇతర అనుబంధ పనుల్లో మహిళల శ్రమను గుర్తించనంత కాలం, వారికి దక్కాల్సిన హక్కులు దక్కనంత కాలం, అసలైన అభివృద్ధి ఎప్పటికీ సాధ్యపడదు. వారిని సంఘటిత పరిచి సమూహంలో భాగం చేయనంత కాలం ‘అభివృద్ధి’ నిర్వచనం కూడా అసంపూర్తిగానే మిగిలిపోతుంది. అందుకే ఇకనైనా మహిళా రైతుల, శ్రామిక మహిళల అస్తిత్వాన్ని గుర్తిద్దాం. వారి సాధికారత కోసం, స్వావలంబన కోసం కృషిచేద్దాం. మహిళా రైతులను ఏకం చేయడం, వారిని రైతు సహకారం సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీల్లో సభ్యులనుచేయడం, ఆ సంఘాలను వారే నిర్వహించుకునేలా శిక్షణ ఇవ్వడం తక్షణ బాధ్యతగా తీసుకుందాం. మెరుగుపరుచుకుందాం

మహిళల భాగస్వామ్యంతో గ్రామాలలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి వ్యవసాయ ఉత్పత్తిలో, పంపిణీలో, మార్కెటింగ్‌లో మొత్తంగా గ్రామీణ ఆర్థికాభివృద్ధిని సాధించుకుందాం. విషపూరిత రసాయన వ్యవసాయాన్ని వదిలిపెట్టి సేంద్రియ వ్యవసాయ పద్ధతులను నేర్చుకుందాం. గ్రామీణ ప్రాంతం నుండి మద్యాన్ని తరిమేసి కుటుంబాల ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకుందాం. చిరుధాన్యాల వంటి పౌష్టికమైన ఆహారంతో అనారోగ్యాలకు దూరంగా ఉందాం. పశుపోషణ ఇతర జీవనోపాధుల ద్వారా కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగుపరుచుకుందాం. గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలపడేలా విధానాలు రూపొందించాలని, పెట్టుబడులు పెట్టాలని, అన్ని రకాల మద్దతులను వాస్తవ సాగుదారులకే అందించాలని డిమాండ్‌ చేద్దాం. మహిళా రైతుల ఆత్మగౌరవాన్నికాపాడుకుందాం.
సమష్టిగా ఆలోచిద్దాం.. సంఘటితంగా మారుదాం.. సాధికారత దిశగా అడుగులు వేద్దాం.

ఓ రైతమ్మా.. ఓ రైతక్కా..
నీ చేతుల్లో ..మట్టి కొత్త పరిమళం అద్దుకుంటుంది.
విత్తనం కొత్త రూపు సంతరించుకుంటుంది.
నీ కొడవలితో కోసిన ధాన్యం.. రైతు కుటుంబాల ఆకలి తీరుస్తోంది.
నీ కండలు కరిగించి నూర్చిన గింజలు.. గ్రామీణ జీవితాలను సుసంపన్నం చేయాలి.
నీ స్వేదంతో పండుతున్న పంటలపై ..నీ రక్తంతో తడుస్తున్న పుడమిపై,
సమాన హక్కులు కావాలి.. సాగులో.. సంపదలో సమాన వాటా దక్కాలి..

సీనియర్‌ జర్నలిస్ట్‌

Courtesy Nava Telangana