వైద్యపరంగా మరణాల ధ్రువీకరణలో స్త్రీలపై వివక్ష
ఆస్తి హక్కులు, కుటుంబ వారసత్వ పత్రాల జారీలో ప్రాధాన్యత లేకపోవడమే కారణం..
చివరి సంక్లిష్ట సమయాల్లో తగిన వైద్యం అందక తనువు చాలిస్తున్న మహిళ
దేశవ్యాప్తంగా మొత్తం మరణాల్లో వైద్యపరంగా ధ్రువీకరిస్తున్నవి కేవలం 22 శాతమే!
అధిక మరణాలు గుండె వ్యాధులకు సంబంధించినవే!
న్యూఢిల్లీ: జాతీయ జనాభా లెక్కల విభాగం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 128.85 కోట్లుగా ఉన్నది. దేశంలో ప్రతీ నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే, 15 మంది మరణిస్తున్నారు. పౌర నమోదు వ్యవస్థ(సీఆర్‌ఎస్‌) ద్వారా దేశంలో ఎక్కడ ఎవరు కన్నుమూసినా, జన్మించినా 21 రోజుల వ్యవధిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించాలి. అయితే, దేశంలో సంభవిస్తున్న మరణాల్లో కేవలం 22 శాతం మరణాలు మాత్రమే వైద్యపరంగా ధ్రువీకరించబడుతున్నాయి.
14.1 లక్షల మందికి మాత్రమే!
రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, హత్యలు తదితర కారణాలతో దేశవ్యాప్తంగా ఏటా దాదాపు డెబ్భై నుంచి ఎనభై లక్షల మంది మరణిస్తున్నారు. అయితే, ఇందులో కేవలం 22శాతం(14.1 లక్షలు మాత్రమే) మరణాలు వైద్యపరంగా ధ్రువీకరించబడుతున్నాయి. వైద్యపరంగా మరణాలను ధ్రువీకరించడంలో గోవా (100శాతం) అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ(61.5శాతం), మణిపూర్‌(55.1శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. ఇక, వైశాల్యం పరంగా పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు (43.3శాతం), మహారాష్ట్ర(38.9శాతం), కర్నాటక(30.4శాతం) రాష్ట్రాలు మిగతా పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే, కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాయి. తక్కిన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత అధ్వాన్నంగా(10శాతం కంటే తక్కువ) ఉన్నట్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాల్లో అత్యధిక చావులు గుండె సంబంధిత వ్యాధులకు సంబంధించినవే కావడం గమనార్హం. గుండె వ్యాధుల మూలంగా దాదాపు 34శాతం మంది చనిపోతున్నారు. తర్వాతి స్థానాల్లో అంటువ్యాధులు(10.4శాతం), శ్వాసకోశ వ్యాధులు (9.2శాతం) ఉన్నాయి.
మహిళపై వివక్ష
వైద్యపరంగా మరణాల ధ్రువీకరణ గత 27 ఏండ్లలో 12.7 శాతం నుంచి 22 శాతానికి(ఈ పెరుగుదల అత్యంత అల్పం) పెరిగింది. ఈ వృద్ధి గ్రామాల్లో కంటే పట్టణాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, వైద్యపరంగా మరణాల ధ్రువీకరణ జరుగుతున్న విషయంలో కూడా లింగ వివక్షత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ధ్రువీకరించిన మరణాల్లో దాదాపు 61.9శాతం మరణాలు పురుషులవే! ఈ లెక్కన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చివరి క్షణాల్లో ఆస్పత్రు ల్లోకి తీసుకొస్తున్న వాళ్లలో పురుషుల సంఖ్యే అధికమని నివేదిక పేర్కొంది. దీనికి గల కారణాలను కూడా నివేదిక విశ్లేషించింది. దేశంలో ఇప్పటి వరకూ అధిక ప్రాంతాల్లో ఉన్న ఆస్తులన్నీ పురుషుల పేర్లపైనే ఉన్నాయి. వారి మరణానంతరం ఆ హక్కులు పొందాలంటే, వాళ్ల మరణాన్ని వైద్యులు, ప్రభుత్వం ధ్రువీకరించాలి. అలాగే, కుటుంబ వారసత్వాన్ని కొనసాగించాలంటే తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరన్న విధానాలు ఈ పరిస్థితికి మరో కారణం అవుతున్నాయి. ఈ కారణాల చేతనే పురుషుల మరణాల్ని వైద్య ధ్రువీకరణ కోసం రిజిస్టర్‌ చేయిస్తున్నారు. ఆఖరి నిమిషంలో వైద్య సేవల్ని అందిస్తు న్నారు. అయితే, ఇలాంటి అత్యంత కీలకమైన ధ్రువీకరణ పత్రాల్లో మహిళలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం మూలంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో, ఆఖరి సంక్లిష్ట పరిస్థితుల్లో వైద్య సేవలు అందుకోవడంలో మహిళలు తీవ్ర వివక్షకు గురై.. బలై పోతున్నారు.

Courtesy Nava telangana…