బడ్జెట్‌లో భారీగా కోత
రూ.2,923 కోట్లు తగ్గించిన సర్కారు
– 6.76 శాతం నిధులే కేటాయింపు
గత ఆర్థిక సంవత్సరంలో 7.61 శాతం 

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి రోజురోజుకూ దిగజారుతున్నది. ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని అనేక సంస్థలు చెప్తున్నాయి. ఇంకోవైపు అక్షరాస్యతలో దేశంలోనే తెలంగాణ 32వ స్థానంలో ఉన్నది. ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు. తరగతి గదుల్లో దేశ భవిష్యత్తు ఉంటుందంటారు. ఈ లెక్కన ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి. విద్యారంగ అభివృద్ధికి, అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి. కానీ 2019-20 బడ్జెట్‌లో ప్రభుత్వం ఆ దిశగా కేటాయింపులు చేయలేదు. విద్యారంగానికి ఈ బడ్జెట్‌లో భారీగా కోత విధించింది. మొత్తం రూ.1,46,492 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం రూ.9,899.79 కోట్లు కేటాయించింది. అంటే మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి 6.76 శాతం మాత్రమే. విద్యారంగం పట్ల టీఆర్‌ఎస్‌ సర్కారు వివక్ష చూపుతోందని ఈ గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. ఇందులో నిర్వహణ పద్దు (జీతభత్యాలకు) రూ.9,148.48 కోట్లు కేటాయించింది. ఇక ప్రగతి పద్దు కింద రూ.751.31 కోట్లు ప్రతిపాదించింది. ఈ నిధులతో ప్రభుత్వ విద్యారంగం ఎలా ప్రగతి సాధిస్తుందన్న ప్రశ్న తలెత్తుతున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,74,453 కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.13,278 కోట్లు కేటాయించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 7.61 శాతం ప్రతిపాదించింది. గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధుల్లో రూ.12,823.54 కోట్లు ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఖర్చు చేసిన నిధుల కంటే ఈ ఏడాదిలో రూ.2,923.72 కోట్లు తగ్గించడం గమనార్హం. 

అవసరం రూ.18 వేల కోట్లు… 
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగానికి కేటాయించే నిధులు ఏటా తగ్గుతూనే ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో రూ.1,00,637 కోట్లకుగాను విద్యారంగానికి రూ.10,956 (10.88 శాతం) కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.9,899.79 (6.76 శాతం) నిధులు ప్రతిపాదించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత బడ్జెట్‌లో 4.12 శాతం నిధులకు కోత పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ మొత్తం బడ్జెట్‌ రూ.1,82,017 కోట్లలో విద్యారంగానికి రూ.12,220 (6.71 శాతం) కోట్లు ప్రతిపాదించింది. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కన్నా పూర్తిస్థాయి బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.2,321 కోట్లు కోత విధించింది. విద్యారంగానికి రూ.18 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ రూ.9,899.79 కోట్లు కేటాయించింది. రూ.8,100 కోట్లు తక్కువ కేటాయించడంతో విద్యారంగ ప్రగతి ఎలా ముందడుగు పడుతుందో అందరినీ ఆలోచింపచేస్తున్నది. ఇంకోవైపు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్ల జీతాలకైనా ఈ నిధులు సరిపోతాయా?అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఉపాధ్యాయుల జీతాలకే సుమారు రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. కానీ పాఠశాల విద్యాశాఖ నిర్వహణ పద్దు కింద రూ.7,515 కోట్లు కేటాయించడం వల్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
విద్యారంగానికి ఏటా బడ్జెట్‌ కేటాయింపులు (కోట్లలో) 
ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్‌ విద్యకు కేటాయింపు శాతం 
2019-20 1,46,492 9,899 6.76
2018-19 1,74,453 13,278 7.61
2017-18 1,49,646 12,705 8.49
2016-17 1,30,415 10,738 8.23
2015-16 1,15,689 11,216 9.69 
2014-15 1,00,637 10,956 10.88

2018-19, 2019-20 కేటాయింపుల్లో తేడా (రూ.కోట్లలో) 
విద్యారంగం 2018-19 2019-20 తగ్గుదల 
పాఠశాల 10450.56 8209.01 2241.55
ఉన్నత 1961.47 1367.87 593.6
సాంకేతిక 361.44 322.91 38.53
మొత్తం 12,773.47 9,899.79 2873.68

విద్యారంగానికి (2019-20) కేటాయింపులు (రూ.కోట్లలో) 
విద్యారంగం నిర్వహణ పద్దు ప్రగతి పద్దు మొత్తం 
పాఠశాల 7515.64 693.37 8209.01
ఉన్నత 11312.55 55.32 1367.87
సాంకేతిక 320.29 2.62 322.91
మొత్తం 9,148.48 751.31 9,899.79

 

(Courtacy Nava Telangana)