చాలా ఔదార్యంతో కూడిన ప్రజాస్వామ్యంలో ప్రజా వేగులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జర్నలిస్టులదీ ఇదే పరిస్థితి. ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న పరిణామం భారత్‌లో ఎమర్జెన్సీ (1975-77) నాటి చీకటి రోజులను మరోసారి గుర్తుకు తెచ్చాయి. గత సోమవారం ఆస్ట్రేలియాలోని ప్రముఖ పత్రికలు ఫ్రంట్‌ పేజీలను ఎలాంటి వార్తలు లేకుండా నల్ల రంగుతో బయటకొచ్చాయి. 1970లలో సరిగ్గా ఇదే పరిస్థితి ఏర్పడిన విషయం భారతీయ పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనలో పత్రికలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ వార్తలను ప్రచురించే పరిస్థితి లేదు. అన్ని పత్రికలపైన ప్రభుత్వం సెన్సార్‌ విధించింది. దీనికి నిరసనగా ఆనాడు పత్రికలు సంపాదకీయాలు, వార్తల స్పేస్‌ను ఖాళీగా పెట్టి ప్రచురించాయి. ఇప్పుడు ఆస్ట్రేలియన్‌ పాఠకులు ఆ పరిస్థితిని చూస్తున్నారు. చాలా తీవ్రమైన పోటీతత్వం ఉన్న ఆస్ట్రేలియా పత్రికా రంగంలో దాదాపు అన్ని ప్రధాన పత్రికలు ఏకతాటిపై నిలిచి అసాధారణమైన రీతిలో నిరసన తెలిపాయి. ఆస్ట్రేలియాలో వరుసగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా వేగుల చర్యలను, పరిశోధనాత్మక జర్నలిజాన్ని నేరస్త చర్యలుగా పరిగణించి, వారిని శిక్షించే చర్యలు చేపట్టింది. ఈ ఏడాది జూన్‌లో సిడ్నీ ప్రధాన కేంద్రంగా ప్రచురణ అవుతున్న ఆస్ట్రేలియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ (ఎబిసి), న్యూస్‌ కార్ప్‌ ఆస్ట్రేలియా జర్నలిస్టు సంస్థలపై దాడులను తిప్పికొట్టేందుకు ఆస్ట్రేలియా మీడియా వినూత్న రీతిలో తన నిరసన తెలిపింది. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వార్తా కథనాలు ప్రచురించడాన్ని నేరంగా పరిగణించడం, ఆస్ట్రే లియా పౌరులపై ప్రభుత్వ ఏజెన్సీల నిఘా వంటి చర్యల వల్ల ప్రభుత్వ తప్పిదాలను బయటపెట్టడం, పరిశోధనాత్మక జర్నలిజం కొనసాగించడం దుర్లభంగా మారుతుంది. గోప్యత సంస్కృతి ఒక పెద్ద గుదిబండలా తయారవుతుంది. గోప్యత, గూఢచర్యానికి సంబంధించి ఆస్ట్రేలియా పార్లమెంటు గత ఇరవై ఏళ్లలో అరవైకి పైగా చట్టాలు చేసింది. ప్రజా వేగుల పరిరక్షణ చట్టాన్ని మోరిసన్‌ ప్రభుత్వం సమీక్షిస్తున్నది. పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలు తెలుసుకునే హక్కు ప్రమాదంలో పడే పరిస్థితి ఇప్పటికే నెలకొంది. దీనికి తోడు గత ఏడాది తీసుకొచ్చిన గూఢచర్య వ్యతిరేక చట్టం మరీ ప్రమాదకర మైనది. దీని నుంచి మీడియాను మినహాయించాలని పలు పత్రికా సంస్థలు డిమాండ్‌ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. జర్నలిస్టులు ఇన్‌సైడ్‌ వార్తా కథనాలు రాయాలన్నా, ప్రజా వేగులు ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పరిశోధనాత్మక కథనాలు ఇవ్వాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఆస్ట్రేలియా పన్ను శాఖ కార్యాలయంలో అవినీతి, అధికార దుర్వినియోగాన్ని బయటకు వెల్లడించిన ప్రజా వేగులను నేరస్తులుగా పరిగణించి, 161 ఏళ్ల వరకు జైలులో మగ్గే క్రూరమైన క్లాజును ప్రయోగించింది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అత్యంత గోప్యత కలిగిన ప్రజాస్వామ్య దేశంగా మారిపోతున్నదని ఎబిసి మేనేజింగ్‌ డైరక్టర్‌ డేవిడ్‌ ఆండర్సన్‌ వ్యాక్యానించారు. అప్రతిష్టపాలైన ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ మాత్రం తన చర్యను సమర్థించుకుంటూ, చట్టానికి ఎవరూ అతీతులు కాదని సూక్తులు వల్లించారు. ఈ దాడుల తరువాత ముగ్గురు జర్నలిస్టులను ప్రాసిక్యూట్‌ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిని కోర్టులో సవాల్‌ చేయాలని మీడియా సంస్థలు నిర్ణయించడంతోబాటు, ‘ రైట్‌ టు నో కొయెలేషన్‌’ (తెలుసుకునే హక్కు వేదిక) గా అవి ఏర్పడ్డాయి. దీనికి పలు టివి, ఆన్‌ లైన్‌ సంస్థలు మద్దతు తెలిపాయి.
ఇదిలాఉండగా పసిఫిక్‌ ప్రాంతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అక్కడ ప్రజా వేగులను వేధిస్తున్నాడు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తనకు ప్రధాన ప్రత్యర్థి కావచ్చనుకుంటున్న డెమొక్రటిక్‌ నేత జోరు బిడెన్‌ను దెబ్బతీసే లక్ష్యంతో ఉక్రెయిన్‌ గ్యాస్‌ కంపెనీ వ్యవహారంలో బిడెన్‌, ఆయన కుమారుడు హంటర్‌ బిడెన్‌ను ఇరికించేందుకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లదిమిర్‌ జెలెన్‌స్కీతో ఫోన్‌లో మంతనాలు సాగించారు. వీరిరువురు నేతల మధ్య టెలిఫోన్‌లో సాగిన మంతనాలను రికార్డు చేసి ప్రజా వేగు ఒకరు బయటపెట్టడంతో అది ట్రంప్‌ మెడకు ఉచ్చులా బిగుసుకుంది. దీనిని ఆధారంగా చేసుకుని ట్రంప్‌ పై అమెరికన్‌ కాంగ్రెస్‌లో అభిశంసన విచారణ ప్రక్రియ చేపట్టారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు కోసం ట్రంప్‌ విదేశీ సాయం కోరడం చట్ట విరుద్ధం. కనుక ఆయనపై ఈ అభిశంసన విచారణ చేపట్టారు. తీదీనిపై రుసరుసలాడుతున్న ట్రంప్‌ ఆ ప్రజా వేగు పేరు బయట వెల్లడించాలని పట్టుబడుతున్నారు.ఆ ప్రజా వేగు గూఢచర్యానికి పాల్పడ్డాడని, రహస్య సమాచారాన్ని అనధికారికంగా సేకరించినందున ఆయనను శిక్షించాలని ట్రంప్‌ రంకెలేస్తున్నారు. ఇదీ ట్రంప్‌ మార్కు దాడి.
ఇక భారత్‌ విషయానికొస్తే పార్లమెంటు 2014 ఫిబ్రవరిలో ప్రజా వేగు పరిరక్షణ చట్టాన్ని ఆమోదించినా, ఆ వెంటనే దానిని తిరగదోడి, తూట్లు పొడిచేలా సవరణను ప్రతిపాదించింది. ఈ సవరణ బిల్లు రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉండడంతో ప్రజా వేగు పరిక్షణ చట్టం ఇప్పటికీ అమలులోకి రాలేదు. 2003 నుంచి ఇప్పటివరకు సత్యేంద్ర దూబే, షణ్ముగం మంజునాథ్‌ వంటి ప్రముఖులతో సహా 70 మంది ప్రజా వేగులు అత్యంత కిరాతకంగా చంపబడ్డారు. పెండింగ్‌లో ఉన్న సవరణ చట్టంలో ప్రజా వేగులను కాపాడేందుకు కానీ, ప్రభుత్వ అక్రమాలను బయటపెట్టే మీడియాను శిక్షల నుంచి మినహాయించేందుకు కానీ ఎలాంటి ప్రతిపాదన లేదన్నది నిష్టుర సత్యం. సుప్రీం కోర్టు 2013లో ప్రజా వేగులకు సంబంధించి ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతి రేఖలా నిలిచింది. కోర్టులో విచారణ సమయంలోనూ ప్రజా వేగు పేరును వెల్లడించాల్సిన అవసరం లేదని కోర్టు ఇచ్చిన తీర్పు కొంతలో కొంత ఊరటనిస్తుంది. ఔదార్యం గల ప్రజాస్వామ్యంలో ప్రజా వేగులు స్వేచ్ఛగా వ్యవహరించలేని దుస్థితి నెలకొనడానికి ప్రభుత్వాలే కారణం. తమ అవినీతిని, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వాలు ‘దేశ భద్రత’ అనే అంశాన్ని ముందుకు తెస్తున్నాయి. ఇటువంటి నిరంకువ చర్యలు ప్రజా జీవితంలో పారదర్శకతకు, పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టుగా పరిణమిస్తాయి.

(సెంటినల్‌ పత్రిక సౌజన్యంతో)