– మురికివాడలకు అడ్డుగోడ
– గాంధీనగర్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే మార్గంలో నిర్మాణం
– రోడ్ల వెంబడి చెట్లు
– అమెరికా అధ్యక్షుడి మెహర్భానీ కోసం మోడీ పాట్లు

అహ్మదాబాద్‌: భారతదేశానికి అమెరికా అధ్యక్షుడు వస్తున్నారంటే చాలు…! వారి కంటికి పేదలు కనిపించకూడదు. అంతా ఆహా.. ఒహౌ అన్నట్టుగా ఉన్నదని వచ్చిన వారు అనుకుంటే చాలు. ఇది మన పాలకుల తీరు. 2002లో హైదరాబాద్‌కు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ వచ్చినపుడు ఇక్కడ ఉన్న బిచ్చగాళ్లను వెతికి మరీ భాగ్యనగరం బయటకు తరిమారు నాటి ముఖ్యమంత్రి చంద్ర బాబు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా వచ్చినప్పుడూ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ సర్కారు అదే ఫార్ములాను అమలుచేసింది. ఇక ఇప్పుడు గుజరాత్‌లోనూ అదే సీన్‌ రిపీట్‌ కానున్నది. మరో పది రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనున్నది. అయితే ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు ఆయన వస్తుండటంతో అక్కడి బీజేపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నది. సబర్మతి ఆశ్రమ సందర్శన. ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తలను అమెరికా అధ్యక్షుడు కలుస్తారని సమాచారం.

గరీబోళ్ల బతుకులు కనిపించకుండా..
భారత్‌లో లక్షలాది కడుపేద కుటుంబాలు మురికివాడల్లో నివాసముంటున్నాయి. మోడీ సర్కార్‌ వచ్చాక పేదరికం మరింతగా పెరిగింది. బీజేపీ సర్కారు దీనికి పరిష్కారం చూపకుండా ట్రంప్‌ పర్యటించే మార్గంలోని మురికివాడలు ఆయనకు కనిపించకుండా అడ్డుగోడ నిర్మాణం చేపడుతున్నది. ఈ మేరకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు ఒక్కో గోడ ఎత్తును కనీసం ఆరు నుంచి ఏడు అడుగుల వరకు పెంచుతున్నారు. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో ఈ పనులు చకచకా జరుగుతున్నాయి. గాంధీనగర్‌ విమానాశ్రయం నుంచి ఆర్థిక రాజధాని అహ్మదాబాద్‌ మధ్య ఉండే సర్దార్‌ వల్లభ్‌ భారు పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ట్రంప్‌, మోడీలు రోడ్‌ షో నిర్వహించనున్నారు. విమానాశ్రయాన్ని దాటి బయటికి వచ్చాక.. అహ్మదాబాద్‌ వైపు వెళ్లే మార్గానికి ఒక వైపున పెద్ద సంఖ్యలో మురికివాడలు ఉంటాయి. వాటిని దేవ్‌ శరణ్‌ లేదా శరణి ఆవాస్‌ అని పిలుస్తారు. ఇపుడు ఈ మురికివాడలు కనిపించకుండా అడ్డుగోడ కడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

పచ్చదనం కూడా..
గోడ వెనుక ఏమున్నదో తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నంతో… ముందు భాగమంతా రంగులు, మొక్కలతో అలంకరించబోతున్నారు. దీనికోసం సుమారు 2500 మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఈ రోడ్‌షోలో మురికివాడలు కనిపించకుండా బీజేపీ సర్కార్‌ జాగ్రత్త పడుతున్నదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాగే…
2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చారు. దీంతో భాగ్యనగరంలో క్లింటన్‌ రాకపోకలు సాగించే మార్గాల్లోని భవనాలకు రంగులు వేయించింది చంద్రబాబు సర్కారు. అలాగే రెండేండ్ల క్రితం ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హైదరాబాద్‌కు వచ్చినప్పుడూ హడావుడిగా కొత్త రోడ్లను నిర్మించడం, బిచ్చగాళ్లను జైళ్లకు తరలించడం వంటివి టీఆర్‌ఎస్‌ సర్కారు చేసింది. ఇపుడు గుజరాత్‌లో మురికివాడలు కనిపించకుండా బీజేపీ పాలకులు అడ్డుగోడలు కట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షులు వచ్చినప్పుడు వారికి ఇక్కడి వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టడం కోసమే భారత పాలకులు ఇలా చేస్తున్నారని వారు విమర్శలు చేస్తున్నారు.

Courtesy Nava Telangana