* మీడియాతో ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ ప్రధాన కార్యదర్శి ఎఆర్‌.సింధు
రాజమహేంద్రవరం:
ఐసిడిఎస్‌ బలోపేతానికి దేశవ్యాప్తంగా సమరశీల ఉద్యమాలు చేపడతామని, అఖిల భారత మహాసభలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ ప్రధాన కార్యదర్శి ఎఆర్‌.సింధు తెలిపారు. మహిళలు, అణగారిన తరగతులపై వివక్ష, దాడులకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగిస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరుగుతున్న అఖిల భారత మహాసభ రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం సింధు మీడియాతో మాట్లాడారు. బిజెపి అధికారంలోకొచ్చిన తర్వాత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని మహాసభ ఆమోదించిందన్నారు. అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న బిజెపి నేతలను నిర్దోషులంటూ విడిపించి తీసుకురావడం ప్రభుత్వ సిగ్గుమాలినతనానికి నిదర్శనమని విమర్శించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మనువాద సిద్ధాంతాల కారణంగా మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై, మైనార్టీలపై వివక్ష, దాడులు ఇటీవల ఎక్కువయ్యాయన్నారు. దీనిపైనా తీర్మానాన్ని ఆమోదించామని తెలిపారు. బిజెపి ప్రోద్బలంతో మూకదాడులు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు.
సంఘ నిర్మాణం, ఇతర అంశాలను మూడో రోజు చర్చిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్‌ పట్ల అవలంబిస్తోన్న విధానాలు, ఐసిడిఎస్‌ పరిరక్షణ వంటి అంశాలను రెండు రోజులుగా చర్చిస్తున్నామన్నారు. కేంద్రంలో మోడీ అధికారం చేపట్టాక ఐసిడిఎస్‌కు బడ్జెట్‌ తగ్గించిందని, ఆరు నెలలుగా అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారాన్ని అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనీ సింధూ తెలిపారు. ఒక పక్కన ఐసిడిఎస్‌కు నిధుల కోత, మరోవైపు తప్పుడు రికార్డులను చూపిస్తూ, ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. యుపి, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ వంటి బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం తీవ్రమైన సమస్య ఉందన్నారు. గర్భిణులకు రక్తహీనత సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. అక్కడి ప్రభుత్వాలు రికార్డులను తారుమారు చేసి అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పుకొస్తున్నాయని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో అంగన్‌వాడీ ఉద్యోగు లపై తీవ్రమైన వేధింపులు పెరిగాయన్నారు. ఈ మూడేళ్లలో ఐసిడిఎస్‌ పరిరక్షణ, ఉద్యోగ భద్రత, పింఛను సౌకర్యం వంటి అంశాల్లో పోరాటాలు నిర్వహించామని తెలిపారు. వీటిని సమీక్షించి, భవిష్యత్తులో మరిన్ని సమరశీల ఉద్యమాలు సాగించే విధంగా మహాసభలో చర్చిస్తామన్నారు. కాశ్మీర్‌లో 370 రద్దు తర్వాత అక్కడి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఐసిడిఎస్‌ను పంచాయతీలకు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ ఐసిడిఎస్‌ సెంటర్లు ప్రారంభమవ్వక పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదని తెలిపారు. కాశ్మీర్‌లో గతంలో కేంద్రం ఇచ్చే పారితోషికంతోపాటు అదనపు పారితోషికమూ ఇవ్వకుండా, జీతాలకు కోత కూడా విధిస్తోందన్నారు.

అంగన్‌వాడీ పిల్లలకూ ‘అమ్మఒడి’ వర్తింపజేయాలి : సుబ్బరావమ్మ
అంగన్‌వాడీ పిల్లలకు కూడా అమ్మఒడి పథకాన్ని వర్తింపజేయాలని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్సు యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐసిడిఎస్‌ పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. కేంద్రం రానురాను బడ్జెట్‌ తగ్గిస్తోందన్నారు. నెలల తరబడి జీతాలు, గ్యాస్‌, సెంటర్ల అద్దెలు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులే పెట్టుబడులు పెట్టి కేంద్రాలను నడిపిస్తున్నారని తెలిపారు. వేతనం పెంపు విషయంలో అన్యాయం జరిగిందన్నారు. ఐసిడిఎస్‌ సేవలకుతోడు అదనపు పనులతో అంగన్‌వాడీ ఉద్యోగులు తీవ్రస్థాయిలో సతమతమవుతున్నారన్నారు. బిఎల్‌ఒ విధులు, సర్వేలు, ఇతర పనులు భారంగా మారాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ ఉద్యోగులకు పని భారం తగ్గించాలని, ఐసిడిఎస్‌ను రక్షించాలని తదితర డిమాండ్లతో రాబోవు రోజుల్లో మరిన్ని పోరాటాలు నిర్వహించేలా మహాసభలో చర్చిస్తామన్నారు.

Courtesy Prajasakti…