పరువు పేరిట విచక్షణ కోల్పోయి, నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్న రాక్షసత్వం ఒక కన్న తల్లికి కడుపు కోత, ప్రేమించి పెళ్ళాడిన అమ్మాయికి గుండె కోత మిగిల్చింది. ఆ తల్లి పేగు తల్లడిల్లుతోంది… కట్టుకున్న భార్య హృదయం కన్నీటి వరదవుతోంది. కులోన్మాదం, ఆర్థిక అంతరాలూ, పురుషాధిక్య భావజాలం ఆ ఇద్దరు మహిళల జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చాయి. మొన్న అమృత… ఇప్పుడు అవంతి…. ఈ ఘాతుకాలు ఇంకెన్నాళ్ళు? అని ప్రశ్నిస్తున్నారు

కిందటి నెల 24న పరువు హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన హేమంత్‌ తల్లి లక్ష్మీరాణి, భార్య అవంతి… తమ ఆవేదనను వారు పంచుకున్నారు. 

ఆ పరువు ఇప్పుడు మిగిలిందా?  
-లక్ష్మీరాణి, హేమంత్‌ తల్లి
‘‘కన్నవాళ్ల తాపత్రయమంతా బిడ్డల జీవితం బాగుండాలనే! అలాంటిది చేతికి అందివచ్చిన మా అబ్బాయి మాకు దూరమయ్యాడు. హేమంత్‌ చాలా మంచివాడు. నేను నా కొడుకును కోల్పోతే వాళ్ళు మంచి అల్లుడిని పోగొట్టుకున్నారు. పైగా వాళ్ల జీవితాలనూ నాశనం చేసుకున్నారు. మా హేమంత్‌ లాంటి అబ్బాయి మళ్లీ దొరకడు. వాడు చాలా పరిణతి ఉన్నవాడు. కుటుంబం పట్ల చాలా బాధ్యతతో ఉంటాడు. నన్ను కానీ, వాళ్ల నాన్నను కానీ ఎన్నడూ ఇబ్బంది పెట్టి ఎరగడు. డిగ్రీ పూర్తయ్యాక, ఒక తెలుగు సినిమాలోనూ నటించాడు. ఆ ఫీల్డ్‌ తనకు నచ్చలేదు. తరువాత రెండేళ్లు ఉద్యోగం చేశాడు. ఆ అనుభవంతో సొంతంగా ఇంటీరియర్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు.  అంతా బాగుందనుకున్న  సమయంలో నా పిల్లాడిని పొట్టనపెట్టుకున్నారు.

వాళ్ళకు ఆ హక్కు ఎక్కడిది?
మా అబ్బాయి ఒంటిమీద నేనెన్నడూ ఒక్క దెబ్బయినా వెయ్యలేదు. నాకు తెలిసి ఎవరి మీదా వాడు చెయ్యి ఎత్తలేదు. అలాంటి వాడిని రెండు చేతులూ కట్టేసి, ఉరి వేస్తారా? (ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకొంటూ…) ఏ పరువు కోసం నా కొడుకును చంపారో, ఆ పరువు ఇప్పుడు మిగిలిందా? నాకు కడుపు కోత మిగిల్చారు. ఈ దుఃఖం ఒక జీవితంతో పోతుందా? ఇరు కుటుంబాలూ మాట్లాడుకుంటే సరిపోయే దానికి ఇంత దూరం తెచ్చారు. అసలు ఒక మనిషిని చంపే హక్కు మరో మనిషికి ఎక్కడుంది? ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా, మూడు పూటలా అన్నమే తింటాం కదా! అహంకారాన్ని వదిలేసి… ఆ అమ్మాయి తల్లీ తండ్రీ కాస్త ఆలోచించి ఉంటే ఇవాళ ఆ పద్దెనిమిది మందీ జైల్లో ఉండే పరిస్థితి వచ్చేది కాదు. మాకూ కడుపుకోత తప్పేది.

పుట్టింటికి వెళ్లనంటోంది…
కూతురిని తమకన్నా పెద్దింటికి పంపాలని ఏ తల్లితండ్రులైనా అనుకోవడం సహజం. అయితే అవంతి, హేమంత్‌లు ప్రేమించు కున్నారు. హేమంత్‌తో కలిసి ఉంటే జీవితాంతం తాను సంతోషంగా ఉంటానని అవంతి అనుకుంది. కూతురు సంతోషానికి మించిన ఐశ్వర్యమేముంది? మా కుటుంబం హైదరాబాద్‌ వచ్చి పదిహేనేళ్లయింది.  హేమంత్‌ ఎలాంటివాడో మా కాలనీ వాళ్లందరికీ తెలుసు. మరి, అవంతి కుటుంబానికి తెలియదా? వాళ్లలా మాకు కోట్ల రూపాయల ఆస్తి లేకపోవచ్చు. కానీ ఉన్నదాంట్లో సంతోషంగా బతుకుతున్నాం. అవంతి కూడా ‘‘ఆర్నెల్లు టైమ్‌ ఇవ్వండి డాడీ! తానేంటో హేమంత్‌ నిరూపించుకుంటాడు’’ అని వాళ్ల నాన్న కాళ్లా వేళ్లా పడింది.

అప్పుడే భయపడ్డాను….
‘మిర్యాలగూడలో ప్రణయ్‌ హత్య’కు సరిగ్గా వారం ముందు అనుకుంటా… హేమంత్‌ అవంతిల ప్రేమ గురించి తెలిసింది. ‘హేమంత్‌ ఇప్పుడే జాబ్‌లో చేరాడు కదా! రెండేళ్లు ఆగమన్నా’ను. మిర్యాలగూడ ఘటన మీడియాలో చూశాక, ప్రణయ్‌ స్థానంలో హేమంత్‌ను ఊహించుకొని భయపడ్డాను. ‘‘అమ్మా! మీ పెద్దవాళ్లు ఒప్పుకోకపోతే ఆగిపోండి’’ అని అవంతితో చెప్పాను. ‘‘మా వాళ్లు అలాంటి వాళ్ళు కాదు ఆంటీ! అయినా, మా కన్నా మీదే పెద్ద క్యాస్ట్‌ కదా’’ అని అమ్మాయి అంది. ‘అలాంటిదేమీ జరగద’ని హేమంత్‌ కూడా నాకు ధైర్యం చెప్పాడు.

కులం – జీవితం…
అమృత, అవంతి… ఇలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు పరువుకు బలవ్వాలి? కులం మనుషులు పెట్టింది. జీవితం దేవుడు ఇచ్చింది. కులాభిమానం ఉంటే ఉంచుకోండి. అంతేకానీ అవతలివాళ్ల ప్రాణాలు మాత్రం తీయకండి. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పుగా మనమంతా అనుకోవచ్చు. కానీ తల్లితండ్రులు ఇరవై ఏళ్లే పెంచుతారు. మిగతా ఎనభై ఏళ్ల జీవితాన్ని వాళ్లు ఎంచుకోవడంలో తప్పేమిటి? నా పిల్లాడిలా మరెవరూ చనిపోకూడదు. అందుకనే దోషుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

అమృతతో కలిసి ఉద్యమిస్తా
… అవంతి, హేమంత్‌ భార్య
‘‘నేను పెళ్లిచేసుకున్న సంగతి రెండు, మూడు వేల మందికే తెలిసింది. అదే నా తల్లితండ్రులు చేసిన పని గురించి ఇప్పుడే దేశమంతా మాట్లాడుకుంటోంది. జీవితభాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లేదా? ప్రేమ వివాహం చేసుకోవడం నేరమెలా అవుతుంది? పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొని, విడాకులు తీసుకున్న జంటలు లేరా? నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదని నాకు తెలుసు. ఎన్ని కోట్లు కట్నంగా ఇచ్చినా, హేమంత్‌లాంటి మంచి వ్యక్తిని నాకు భర్తగా మా డాడీ తీసుకురాలేడు. ‘‘హేమంత్‌తో ఒకసారి మాట్లాడండి. మమ్మల్ని మేము నిరూపించుకొనే అవకాశం ఇవ్వండి’’ అని బతిమాలాను. అయినా వాళ్లు వినలేదు. ఈ ఘటన తర్వాత అమృత నాతో ఫోన్‌లో మాట్లాడారు. పరువు హత్యలను నిరోధించే ప్రత్యేక చట్టం కోసం అమృతతో పాటు మాలాంటి బాధితురాళ్లతో కలిసి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నా.

అందుకే హేమంత్‌ ఇష్టం….
ఇంటర్‌లో ఉన్నప్పుడు మా మధ్య ప్రేమ మొదలైంది. అప్పటి నుంచీ మా మధ్య బంధం పెరుగుతూ వచ్చింది. మేము తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, ఆ తరువాత విచారించిన సందర్భాలేవీ లేవు. మాకు పరిచయమైన మొదటి రోజు నుంచీ నాతో నిజాయతీగా ఉన్నాడు. అతను అన్ని విషయాల్లో సరైన ప్లానింగ్‌తో ఉంటాడు. అతని ప్రవర్తనే నాకు నచ్చింది. నన్ను యూకేలో ఎమ్మెస్‌ చదివించాలనుకున్నాడు. అందుకోసం ఇద్దరం యూకే వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాం. వీసా ప్రాసెసింగ్‌ కూడా చివరి దశలో ఉంది. నా తల్లితండ్రులు నన్ను ఎలా చూడాలనుకున్నారో, అలా నన్ను ఉన్నతంగా ఉంచేందుకు ప్రయత్నించాడు. అందుకే హేమంత్‌ అంటే చాలా ఇష్టం.

మమ్మల్ని బతకనిస్తారనుకున్నా…
మేమిద్దరం పెళ్లిచేసుకున్నాక, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ను కలిశాం. చందానగర్‌ పోలీసుల మీద నమ్మకం లేక ఆయన దగ్గరకు వెళ్లాం. ఆయన మమ్మల్ని ‘లవ్‌బర్డ్స్‌’ అంటూ ఆశీర్వదించారు. అప్పటికే మా పేరెంట్స్‌ నుంచి బెదిరింపులొస్తున్నాయి. ఆ సంగతి తెలుసుకున్న ఆయన మా వాళ్ల మీద నన్ను కంప్లైంట్‌ రాసి ఇమ్మన్నారు. మా వాళ్లు కొన్నాళ్ల తరువాతైనా మారతారనుకొని, నేనే వద్దన్నాను. మా పాటికి మమ్మల్ని బతకనిస్తారనుకున్నాను. కానీ మా అమ్మా నాన్నా నా హేమంత్‌నే మింగేశారు (కన్నీటితో…). ఇంత జరిగినా, మా నియోజకవర్గ ఎమ్మెల్యేకానీ, కార్పొరేటర్‌కానీ మమ్మల్ని కనీసం పరామర్శించలేదు. వాళ్ళు మా డాడీకి చాలా సన్నిహితులు. మా ఇంటి దగ్గర జరిగిన ఒక కార్యక్రమానికి వచ్చారు, కానీ మా ఇంటికి వచ్చి, మాకు ధైర్యం ఇవ్వలేకపోయారు. తమ నియోజకవర్గ ప్రజల పట్ల వాళ్లకు బాధ్యత లేదా?

వాళ్లలో పరివర్తన కష్టమే…
హేమంత్‌కు ఇలా కావడానికి కారణం మా అమ్మ. మా మేనమామకు అప్పులున్నాయట! వాటిని మా వాళ్లు తీరుస్తామనడంతో ఈ ఘాతుకం చేశాడు. మా మేనబావలు, కజిన్స్‌ కూడా ఈ హత్యలో పాలు పంచుకున్నారు. వాళ్లందరూ కార్పొరేట్‌ కంపెనీల్లో పెద్ద ఉద్యోగస్థులు. అయినా, వాళ్లు కులపిచ్చిని మాత్రం వదలలేకపోయారు. నా వల్ల ఇదంతా జరిగిందనుకుంటున్నారు…. అంతేగానీ ఒక నిండు ప్రాణాన్ని తీశామని మాత్రం వాళ్లు బాధపడటం లేదని తెలిసింది. హేమంత్‌ని చంపిన వాళ్లకు బెయిల్‌ వస్తే నాతో పాటు మా అత్తమామలు, మా మరిది ప్రాణాలకు ప్రమాదమే. వాళ్లు చేసిన తప్పుకి చట్టప్రకారం శిక్ష అనుభవించాలి.

Courtesy Andhrajyothi