– జి, రాములు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72ఏండ్లు పూర్తయ్యాయి. నూతన రాజ్యాంగం అమలులోకి వచ్చి 70ఏండ్లు కావస్తుంది. ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం సుమారు 250ఏండ్లు నాడే వచ్చింది. కానీ మనువాద బ్రాహ్మణీయ భావజాలమే సామాజిక కట్టుబాట్ల రూపంలో ఇప్పటికీ దేశ ప్రజల సామాజిక, సాంస్కృతిక రంగాలను అజమాయిషీ చేస్తున్నది. 1950 జనవరి 26న భారత దేశానికి వచ్చిన కొత్త రాజ్యాంగం ప్రజాస్వామ్య, మతాతీత, సామ్యవాద లక్ష్యాలను ప్రకటించింది. ఇది సహించని మనువాదులు రాజ్యాంగంపై దాడికి పూనుకున్నారు. ఈ రాజ్యాంగ రక్షణ కోసం వామపక్ష ప్రజాతంత్ర లౌకిక సామాజిక శక్తులన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యాంగ పరిణామ క్రమాన్ని పరిశీలించాల్సి ఉంది. భారతీయ సమాజం స్థూలంగా మూడు రాజ్యాంగాలను చవి చూసింది. మొదటిది బ్రిటిష్‌ పాలన స్థిరపడక ముందున్న మనువాద రాజ్యాంగం. బ్రిటిష్‌ పాలనలో అమలైన రాజ్యాంగం రెండవది. మూడవది ప్రస్తుతం అమలులో ఉన్న భారత రాజ్యాంగం.

రాజ్యాంగం అంటే లిఖితమైంది కావచ్చు, లిఖించనిదీ కావచ్చు. ప్రజలు ఏమి చేయాలో, ఏమి చేయకూడదో నిర్దేశించే దానిని రాజ్యాంగంగా భావించవచ్చు. కొన్ని సందర్భాలలో పౌర సమాజం ఈ రాజ్యాంగాన్ని అమలుపరిస్తే పిదప ప్రభుత్వాలే ఈ రాజ్యాంగాలను అమలు పరుచుకుంటున్నాయి. కొత్త మార్పులు చోటు చేసుకునే క్రమంలో ప్రజలను పాత రాజ్యాంగ పరిధులు వెంటాడుతున్నాయి. ప్రస్తుత రాజ్యాంగం ఉనికి లేకుండా చేసి మనువాద బ్రాహ్మణీయ రాజ్యాంగాన్ని పునఃప్రతిష్టించాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆసరా చేసుకొని సంఫ్‌ుపరివార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

మనువాద రాజ్యాంగం ప్రభావాన్ని అర్థం చేసుకున్న వారి కంటే అది ఇప్పుడు ఎక్కడ ఉందని తేలికగా తీసుకొనేవారి సంఖ్యే అత్యధికంగా ఉంటుంది. మనుధర్మ రాజ్యాంగంలో 26 స్కృతులు అంటే చాప్టర్స్‌ (అధ్యాయాలు), 2500 పైగా శ్లోకాలూ ఆర్టికల్స్‌ ఉన్నాయి. ప్రజలను కులాలుగా విభజించి, శ్రామికుల శ్రమను దోచుకునేందుకు కట్టుబాట్లు విధించటమే మనుధర్మ రాజ్యాంగం లక్ష్యం. వీటి తీవ్రత అర్థం కావాలంటే మనుధర్మ రాజ్యాంగంలో ఉన్న కొన్నింటిని పరిశీలిస్తే వాటి స్వభావం అర్థమవుతుంది.
మనుధర్మ రాజ్యాంగంలోని 2వ అధ్యాయం (స్మృతి) 16వ శ్లోకం (ఆర్టికల్‌)ననుసరించి శూద్రులెవరూ చదువరాదు. నిరక్షరాస్యులుగానే ఉండాలి. చదివితే విజ్ఞానవంతులవుతారు. విజ్ఞానవంతులయితే ప్రశ్నిస్తారు. అప్పుడు సహజంగానే అగ్రవర్ణ పెత్తందారీ శక్తులు ఇబ్బందులపాలవుతాయి. కాబట్టి చట్ట ప్రకారమే నిషేధించారు. 8వ అధ్యాయం, 417వ ఆర్టికల్‌ ప్రకారం శూద్రులు ఆస్తికలిగి ఉండకూడదు. రహస్యంగా ఆస్తి కూడబెట్టినా స్వాధీనపర్చుకోవచ్చు. దీని ఉద్దేశ్యం స్పష్టం. శూద్రుల వద్ద సంపద ఉంటే ఆధిపత్య శక్తులను ఎదిరిస్తారు. అందుకోసం చట్టపరంగానే శూద్రులకు సంపద నిషేధించారు. ఈ విధంగా సమాజంలోని 90శాతం ప్రజా సమూహాలకు చదువూ సంపదా నిషేధించిన సమాజాలేవీ ప్రపంచంలో లేవు. ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోనూ, ఉద్యోగాల్లోనూ దీని ప్రభావం చూస్తున్నాం. మనువాద రాజ్యాంగంలోని 8వ అధ్యాయం 413వ ఆర్టికల్‌ ప్రకారం శూద్రులు పై మూడు వర్ణాలకు సేవ చేయాలి. నిరాకరిస్తే చట్టరీత్యా నేరం. శిక్షార్హులు. ఇంకా చెప్పాలంటే అగ్రవర్ణాల వారు తిట్టినా కొట్టినా చంపినా శూద్రులు భరించాలి. శూద్రులు అగ్రవర్ణాల వారిని అగౌరవపరిచినా తీవ్రంగా శిక్షించాలని 8వ అధ్యాయం, 270వ ఆర్టికల్‌ చెబుతోంది.

కులం సమాజాన్ని ఐక్యం కాకుండా చేస్తుంది. సమాజాన్ని ముక్కలు ముక్కలు చేయడమే కాక నిచ్చెన మెట్ల వ్యవస్థ ఏరన్పాటు చేసి ఒక కులం ఇంకొక కులాన్ని అసహ్యించుకునేలాగా చేస్తుంది. అగ్రవర్ణ పెత్తందారీ శక్తులు అందుకొరకు వివిధ కులాల మధ్య వివాహాలు జరగకుండా పౌర సమాజాన్ని మనువాద రాజ్యాంగం ద్వారా కట్టడి చేశారు. కులాంతర వివాహాలను చట్టరీత్యా నిషేధించారు. వాటిని అత్యంత ప్రమాదకర నేరంగా పరిగణించారు. మరల శిక్షలు ఖాయం చేశారు. ఉత్తర భారతంలోని ‘ఖాప్‌’ పంచాయితీ దాని వారసత్వమే. ఆ నియమాన్ని ఉల్లంఘించి కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్ష విధించాలనేది మనువాద రాజ్యాంగం 1వ అధ్యాయం 64వ ఆర్టికల్‌ చెబుతుంది. పై రాజ్యాంగ విధులను కాపాడే బాధ్యత క్షత్రియులది అంటే పాలకులది అన్న మాట. అది కూడా స్పష్టంగా 1వ అధ్యాయం 31వ ఆర్టికల్‌లో ఉంది.

ఈ మనువాద భావజాలమే కట్టుబాట్ల పేరుతో భారతీయ సమాజాన్ని శాసించింది. భక్తి ఉద్యమాలు వేమన, కబీర్‌ తదితరులు ఈ కట్టుబాట్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. బ్రిటిష్‌ పాలకులు తమ పరిపాలన సౌలభ్యం కోసం, వ్యాపార విస్తరణ కోసం, మనువాద రాజ్యాంగంలో మార్పులు చేయడం, కొన్ని అమానుష మనువాద చట్టాలను మార్చడానికీ ప్రయత్నించారు.

1773లో రెగ్యూలేటింగ్‌ చట్టంలో బ్రిటిష్‌వారు మనువాద రాజ్యాంగాన్ని వ్యతిరేకించడంతో ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం ప్రారంభమైనట్టు భావించవచ్చు. మనువాద రాజ్యాంగం శూద్రులకు 8వ అధ్యాయం 417వ ఆర్టికల్‌ ద్వారా నిషేధించగా ఆస్థిహక్కును 1795 ఇండో-బ్రిటిష్‌ చట్టం ద్వారా ఆ హక్కు ఇచ్చింది. 1813 వరకు శూద్రులకు మనుధర్మ రాజ్యాంగం ప్రకారం చదువు నిషేధం. దానిని ఇండో – బ్రిటిష్‌ రాజ్యాంగం 1813లో కల్పించింది. ఇండో-బ్రిటిష్‌ రాజ్యాంగం వచ్చే వరకు బాల్య వివాహాల పద్ధతి ఉండేది. కొన్ని ప్రాంతాలలో చనిపోయిన భర్తతో పాటు భార్యను కూడా చితిలో వేసే సతీసహగమన దురాచారం ఉండేది. దేవదాసీ విధానం నిర్బంధంగా చెలామణి అయ్యేది. 1829లో ఇండో-బ్రిటిష్‌ చట్టాల ద్వారా వీటిని నిషేధించారు. రాజా రామ్మోహన్‌రారు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు లాంటి వారు ఇలాంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడినందుకు బ్రిటిష్‌ వారి తొత్తులని మనువాదులు ముద్ర కూడా వేశారు.

1804లో ఆడశిశువులను చంపే దురాచారాన్ని నిషేధించే చట్టం తెచ్చారు. 1817 వరకు అన్ని కులాల వారికి ఒకే రకమైన నేరానికి ఒకే రకమైన శిక్షలు ఉండేవి కావు. మను రాజ్యాంగం 9వ అధ్యాయం 241వ ఆర్టికల్‌, 8వ అధ్యాయం 366, 379 ఆర్టికల్స్‌ ప్రకారం అగ్రవర్ణాల వారు ఎంత పెద్ద తప్పు చేసినా నామమాత్రపు శిక్షలు మాత్రమే వేయాలని, శూద్రులు చిన్న తప్పు చేసినా అణచి ఉంచడానికి పెద్ద శిక్షలు వేయాలని ఉంది. ఈ మనువాద రాజ్యాంగాన్ని సవరించి సమాన తప్పుకు సమాన శిక్షలు నిర్దేశించే ఇండో – బ్రిటిష్‌ చట్టం తెచ్చారు. బ్రిటిష్‌వారు ఎన్ని చట్టాలు చేసినా, భూస్వామ్య విధానం బలంగా ఉన్న భారతీయ సమాజం మాత్రం మనుధర్మ కట్టుబాట్లనే పాటిస్తూ వచ్చింది. బ్రిటిష్‌వారు కూడా పెత్తందారీ శక్తుల నుంచి వ్యతిరేకత బలంగా వచ్చినప్పుడల్లా వెనక్కి తగ్గేవారు. అయినా వారికి తమ వ్యాపారం, లాభాలు తప్ప భారతీయ సమాజ పురోగతి ప్రాధాన్యత కాదు గదా!

1950 తర్వాత ఉనికిలోకి వచ్చిన స్వతంత్ర భారత రాజ్యాంగం ఇండో-బ్రిటిష్‌ రాజ్యాంగం కంటే ఎన్నో రెట్లు మెరుగైనది. 12 అధ్యాయాలు, 444 ఆర్టికల్స్‌తో చాలా ఆధునిక అంశాలు చేర్చారు. 14వ ఆర్టికల్‌ను అనుసరించి చట్టం ముందు అందరూ సమానం, 17 ప్రకారం అంటరానితనం పాటిస్తే శిక్షార్హం. 19 ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ, 23 ప్రకారం వెట్టి చాకిరీ రద్దు. 24వ ఆర్టికల్‌ ప్రకారం బాల కార్మిక వ్యవస్థ రద్దు, 39 ఆర్టికల్‌ ప్రకారం స్త్రీ, పురుషులకు సమాన పనికి సమాన వేతనం, ఇంకా జాతి సంపద కొందరి దగ్గరే పోగుపడకూడదు. 43వ ఆర్టికల్‌ ప్రకారం గౌరవ ప్రదంగా జీవించడానికి సరిపడా వేతనం ప్రభుత్వం కల్పించాలని ఉంది.

మనుధర్మ రాజ్యాంగం కంటే ఆధునిక చట్టాలు తెచ్చారు బ్రిటిష్‌వారు. మనుధర్మ రాజ్యాంగం, ఇండో బ్రిటిష్‌ రాజ్యాంగం కంటే ప్రస్తుత రాజ్యాంగం ఎన్నోరెట్లు మెరుగైంది. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో రూపొందింది. అయినా అనేక అంశాలలో మనువాద కట్టుబాట్ల ప్రభావం నేటికీ ప్రబలంగానే కనబడుతుంది. మనుషులందరూ సమానం అని రాజ్యాంగం చెబుతోంది.

మనుషులంతా సమానం కాదనీ, దేవుడే శూద్రులను పాదాల నుంచి సృష్టించాడు కాబట్టి సమానం కాదనీ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు శూద్రులు ఎలాంటి ప్రతిఫలం ఆశించక సేవ చేయాలని మనువాద రాజ్యాంగం చెప్పింది. అంటరానితనం, కులవివక్ష నిర్మూలించాలనీ, పాటిస్తే కఠిన శిక్ష విధించాలని చట్టం చెబుతోంది. కానీ కుల వివక్ష తగ్గిందేమీ లేదు. అణగారిన జనాలపై దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం. కుల వ్యవస్థ మంచిదేననీ, కుల నిర్మూలన కోసం పోరాడటం తప్పని చినజీయర్‌ ప్రకటించడం చూస్తూనే ఉన్నాం. సంఫ్‌ుపరివార్‌ కార్యకర్తలే ప్రస్తుత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి తిరిగి మనుధర్మ శాస్త్రాన్ని పునఃప్రతిష్టించాలని అనేక వేదికలను సృష్టించి నిరంతరం ప్రచారం చేస్తూనే ఉన్నారు.

ప్రస్తుత రాజ్యాంగం 39వ ఆర్టికల్‌ ప్రకారం సంపద కొందరి దగ్గర పోగుపడకూడదని ఉంది కానీ ఆచరణలో మనుధర్మ రాజ్యాంగం చెప్పినట్టు సంపదంతా అగ్రవర్ణ పెత్తందారులూ, పెట్టుబడిదారుల దగ్గరే భారీగా పోగుపడింది.

కులాంతర వివాహాలు చేసుకుంటే మరణ శిక్షలు విధించాలని 1వ అధ్యాయం 64వ ఆర్టికల్‌లో మనుధర్మ రాజ్యాంగం చెప్పింది. కులాంతర వివాహాలు తప్పుకాదని ప్రస్తుత రాజ్యాంగం చెబుతున్నది. పైగా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రోత్సాహకాలు కూడా ఇస్తోంది. కానీ మనుధర్మ రాజ్యాంగం ప్రభావంతో ఇప్పటికీ స్వంత తల్లిదండ్రులే కులాంతర వివాహాలు చేసుకుంటున్న తమ పిల్లలను చంపుతున్న ఘటనలు కోకొల్లలు. చెప్పుకునేది ప్రస్తుత రాజ్యాంగం అయినా, ఆచరణలో అత్యధికుల మెదళ్లలో మనువాద రాజ్యాంగమే తిష్టవేసుకుంది. భారత రాజ్యాంగ ప్రభావాన్ని సమాజంపై పడకుండా చేసి మనువాద రాజ్యాంగాన్ని పునఃప్రతిష్టించడమే సంఫ్‌ుపరివార్‌, బీజేపీ ప్రభుత్వాల లక్ష్యం.
మనువాద ప్రచారకులు తాము మనువాదులమని బయటకు చెప్పుకోరు. కానీ చాపకింద నీరులా అంతా విస్తరించి ఉంటున్నారు. అనేక పేర్లతో సంస్థలను ఏర్పాటు చేస్తూ సాంప్రదాయాలు, సంస్కృతులు, పండుగలు అనే పేరిట నిత్యం ప్రజలలో ఉంటారు. దేవుడే మనుషుల్లో అసమానతలు సృష్టించాడంటారు. దేవుడే కులాలనూ, వారి విధులనూ సృష్టించాడంటారు. అవి సహజమంటారు. దేవుడే ధనిక, పేద తేడాలు సృష్టించాడంటారు. పుణ్యం చేసిన వారు ధనికులు అవుతారని అంటారు. పాపం చేసి ధర్మం (మనుధర్మం) తప్పినవాళ్ళంతా పేదలవుతారంటారు. చేతి ఐదువేళ్ళూ సమానంగా ఉంటాయా అంటారు. దళితులను అంటరానివారిగానే ఉంచాలంటారు. వారిని గుడుల్లోకి ప్రవేశించనీయకూడదంటారు. స్వకుల వివాహాలే చేసుకోవాలి అంటారు. కులాంతర వివాహాలు చేసుకుంటే చంపేయాలంటారు. శూద్ర పిల్లలను బడికి ఎందుకు పంపాలి అంటారు. శూద్ర పిల్లలకు ఉచిత విద్య, వసతి గృహాలు ఎందుకంటారు. శూద్రులకు రిజర్వేషన్స్‌ ఎందుకు అంటారు. గోరక్షక దళాలను ఏర్పాటు చేయాలంటారు. దళితులపై, ముస్లింలపై దాడి చేయడం ధర్మమే అంటారు. ఇవన్నీ తెలియకుండానే ఆచరించేవారు 90శాతం ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఇవి మాత్రమే కాదు. కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌ నుంచి అసోం వరకు కష్టాలు వస్తే ఎదిరించకుండా కర్మ, పూర్వ జన్మ ఫలం అని సరిపెట్టుకోమని ఏ రాజ్యాంగం చెప్పింది? మనువాద రాజ్యాంగమే.

ఈ మనువాద రాజ్యాంగం భారత దేశాన్ని పురోగమించ కుండా అడ్డుగా నిలిచింది. అంబేద్కర్‌ నాయకత్వంలో, ఆధునిక ప్రజాస్వామ్య విలువలతో కూడిన, స్వాతంత్య్రోద్యమ వారసత్వంగా రూపొందిన మన రాజ్యాంగ విలువలను ధ్వంసం చేయాలనీ, మనువాద రాజ్యాంగాన్ని మళ్ళీ పునఃప్రతిష్టించాలని సంఫ్‌ుపరివార్‌ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వీరి కుతంత్రాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం మన కర్తవ్యం కావాలిప్పుడు.

Courtesy Nava Telangana