• ఈ దేశంలో అనేకమందికి తెలియదు
  • సందేహాలు తీరేదాకా ఎన్‌పీఆర్‌కు నో
  • కేంద్రంతో భేటీలో రాష్ట్రాల స్పష్టీకరణ

న్యూఢిల్లీ : విపక్ష-పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) పై కసరత్తును కేంద్రం మొదలెట్టింది. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన ఈ సమావేశాన్ని పశ్చిమబెంగాల్‌ బహిష్కరించింది. రాజస్థాన్‌ సహా కొన్ని కాంగ్రె్‌స-పాలిత రాష్ట్రాలు ఈ విధివిధానాలపై అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరం చెప్పాయి.

ఎన్‌పీఆర్‌ వివరాలు సేకరించేటపుడు తలిదండ్రుల జన్మస్థల వివరాలెందుకు? ఈ దేశంలో అనేకమందికి తామెక్కడ పుట్టినదీ తెలియదు. అనేకమంది ప్రదేశాలు మారుతూండవచ్చు. తలిదండ్రులు జీవించి ఉండకపోవచ్చు. పేర్లు సైతం తమకు తెలియకుండానే మార్చేసి ఉండవచ్చు.. ఈ వివరాలు ఇవ్వడం అసాధ్యం’’ అని రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీబీ గుప్తా అన్నారు.

ఎన్యూమరేటర్లు వేయబోయే అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. కేరళ కూడా దీనికి హాజరైంది. అసోంలో జాతీయ పౌర జాబితా(ఎన్నార్సీ) ఇప్పటికే రూపొందించిన నేపథ్యంలో ఆ రాష్ట్రం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య ఎన్పీఆర్‌ సర్వే చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. కాగా, జనాభా లెక్కలు(2021) సేకరించే సమయంలో ఎన్పీఆర్‌ ఊసే ఎత్తవద్దని కలెక్టర్లకు కేరళ సర్కారు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.

సాంకేతిక సమావేశమే: తెలంగాణ
సమావేశంలో తెలంగాణ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్‌ ఇలంబర్తీ, కోఆర్డినేటర్‌ జీ కిషన్‌, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పాల్గొన్నారు. జనగణన, ఎన్‌పీఆర్‌ సాంకేతిక అంశాలు, ఎలా చేపట్టాలన్నదానిపై ప్రజంటేషన్‌ ఇచ్చారని గౌరవ్‌ ఉప్పల్‌ ఆంధ్రజ్యోతికి చెప్పారు. జనగణన చేసే వారికి, సూపర్‌వైజర్లకు ఎంత మొత్తంలో పారితోషికం చెల్లించాలన్నదానిపై వివరించారని తెలిపారు. గతంలో పారితోషితం తక్కువ ఇచ్చే వారని, దాన్ని ఏ ప్రాతిపదికన పెంచాలి అన్న అంశంపై వివరించారని తెలిపారు.

జనాభా నియంత్రణకు చట్టం: భాగవత్‌
దేశ పురోగతి కోసం జనాభా నియంత్రణ అనివార్యమని ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చెప్పారు. మతాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబం ఇద్దరు పిల్లలకే పరిమితమయ్యేలా చట్టం రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆ చట్టానికి సంఘ్‌ పూర్తి మద్దతునిస్తుందన్నారు. అపరిమిత జనాభా కారణంగా దేశాభివృద్ధి కుంటుపడే ప్రమాదముందని హెచ్చరించారు. సీఏఏ సబబేనని, అయితే దీనిపై ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని భాగవత్‌ వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi