Image result for uttar pradesh caa& nrc killings"ఉత్తరప్రదేశ్ లో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్టుగా గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా తెలుస్తోంది.

అది ఉత్తరప్రదేశ్ లోని నెహ్టౌర్ టౌన్ దగ్గర్రో ఉండే నైజా సరాయ్ ప్రాంతం,డిసెంబర్ 20 వ తేదీన సమయం మధ్యాహ్నం 1:30 సమయంలో ఆ ప్రాంతంలో గుమిగూడిన ప్రజలనుద్దేశించి 55 ఏళ్ల రఫీక్ అహ్మద్ “మీరంతా ప్రశాంతంగా ఇళ్లకు వెళ్లండి,ఎవరూ రాళ్లు రువ్వొద్దు” అని లౌడ్ స్పీకర్లో ప్రసంగించారు.

 నిజానికి అక్కడ గుమిగూడిన జనాల సంఖ్య పెద్దదే ఐనా వారంతా కూడా అక్కడి మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం వచ్చినవారే తప్ప పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా అధికారిక నిరసన కార్యక్రమాలేవీ ఆ చోట జరగలేదు.

రఫీక్ అహ్మద్ ప్రార్థనలు ముగించుకుని బయటికి వస్తుంటే ఒక పోలీస్ అధికారి ఆయన్ని ఆపి పబ్లిక్ ఎనౌన్స్ మెంట్ చేయాల్సిందిగా కోరారు. అహ్మద్ ఆ ప్రాంతంలో మున్సిపల్ కాంట్రాక్టరుగా పనిచేస్తారు,సిటీలో ఆయనకి చాలా మంచి పేరుంది.

 అహ్మద్ ఆ పోలీస్ అధికారి చుట్టూ సివిలియన్ దుస్తుల్లో ఉన్న కొందరి చేతుల్లో లాఠీలని గమనించి వాళ్లెవరని పోలీస్ అధికారిని ప్రశ్నించాడు,ఐతే అతని నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు.

 కొన్ని నిముషాల తర్వాత అహ్మద్ పక్క వీధిలో నుంచి వెళ్తుండగా టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగిస్తున్న శబ్దాలు విన్నాడు,అంతలోనే ఆయన తలపై బలంగా లాఠీతో కొట్టడంతో రక్తం కూడా కారింది.

 మేమంతా షాకయ్యాం,ఎవరూ అక్కడ రాళ్లు రువ్వలేదు. ఐనా కూడా పోలీసులు లాఠీ ఛార్జ్ చేసారు” అని అహ్మద్ వివరించారు.

 పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాలో ఉన్న నెహ్టౌర్ టౌన్ లో సుమారు 50,000 వరకూ జనాభా కాగా అందులో ముప్పావు వంతు ముస్లింలే. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం ఇదే.

 డిసెంబర్ 11న పార్లమెంటు ఆమోదించిన ఈ వివాదాస్పద చట్టం ప్రకారం వేరే దేశాల నుంచి వలస వచ్చిన ముస్లింలకి తప్ప మిగతా అందరికీ పౌరసత్వం ఇచ్చే ప్రక్రియని సులభతరం చేసారు. ఐతే మత ఆధారితంగా వివక్ష చూపించే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

 ఇదే కాక హోం మంత్రి అమిత్ షా దేశంలో ఉన్న పౌరులందరూ ఇక్కడ చట్టబద్ధంగా నివసిస్తున్నారో తెలుసుకోవడానికి జాతీయ పౌర జాబితాని తయారు చేస్తామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హిందువులు,సిక్కులు,బౌద్ధులు,జైనులు,క్రిస్టియన్లు భయపడనవసరం లేదనీ స్పష్టం చేసారు. ముస్లింలని మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా వారిని భయకంపితులని చేసారు. దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 24 మంది చనిపోగా అందులో 17 మంది ఉత్తరప్రదేశ్ వాసులే కావడం గమనార్హం.

 పోలీసులు తమపై చేసిన దాడికి రాజకీయ ప్రోద్బలం ఉందని నెహ్టౌర్ వాసులు భావిస్తున్నారు. ఇద్దరు యువకులు ఇప్పటికే చనిపోగా ఇంకో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, చాలామంది భయంతో టౌన్ వదిలి వెళ్లిపోయారు.

 ఇదంతా మేం ఏం నిరసనా చేపట్టకుండానే జరిగిందంటే ఒకవేళ నిజంగా నిరసన చేసుంటే మా పరిస్థితి ఏమయ్యుండేదో ఊహించుకుంటేనే భయమేస్తోంది” అని మహమ్మద్ జైద్ చెప్పారు. ఆయన తండ్రి రషీద్ అహ్మద్ నెహ్టౌర్ ఛైర్మన్ గా 17 ఏళ్లు పనిచేసి ఈమధ్యే చనిపోయారు.

 చాలామంది నైజా సరాయ్ వాసులు కూడా ఇదే అంటున్నారు. తాము ఏవిధమైన నిరసనలూ చేపట్టకపోయినా తమపై అమానుషంగా లాఠీ ఛార్జ్ చేసారని,సివిల్ దుస్తుల్లో వచ్చిన ఆరెస్సెస్,హిందూత్వ మూకలే ఈ విధంగా చేసాయని స్పష్టంగా చెబుతున్నారు. వీరంతా పోలీసులకి మిత్రులుగా కూడా చలామణీ ఔతున్నారనే అనుమానం వ్యక్తం చేసారు. ఐతే లాఠీ ఛార్జ్ పోలీసులు మొదలుపెట్టిన తర్వాత మాత్రం కొంతమంది యువకులు వారికి ఎదురుతిరిగారు. ఆ యువకులపై బుల్లెట్ల దాడి మొదలైంది.

 ఐతే నెహ్టౌర్ ఎస్సై రాంచంద్ర సింగ్ మాత్రం అలా ఏం జరగలేదంటున్నారు. గుంపులు హింసాత్మకంగా మారడంతోనే తాము దాడి చేయాల్సి వచ్చిందని అన్నారు. దాడుల్లో తమ కానిస్టేబుల్ మోహిత్ కుమార్ తో పాటూ ఇంకో ముగ్గురు పోలీసులకీ బుల్లెట్ గాయాలయ్యాయని చెబుతున్నారు. నైజా సరాయ్ వాసి రికార్డ్ చేసిన ఓ వీడియోలో కాల్పులు జరుపుతున్న పోలీసులు స్పష్టంగా కనిపిస్తున్నారు.

 ఫైరింగ్ ముగిసిన అనంతరం పోలీసులు ఇళ్లపై దాడులకి కూడా తెగబడ్డారు. ఇంకో వీడియో ఫుటేజ్లో ఓ పెద్దాయనని చేతిలో లాఠీలతో ఉన్న పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం కూడా నిక్షిప్తమైంది. పెద్దాయన పేరు షంసుద్దీన్ గా తేలింది.

 మా అన్నయ్యకి పక్షవాతం వల్ల ఓ కాలు పనిచేయడం లేదు,ఎవరైనా సహాయం చేస్తే తప్ప నడవడం లేడు. పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టి మరీ ప్రవేశించారు” అని సిరాజుద్దీన్ చెప్పారు.

 మసీదుకి దగ్గరగా ఉండడం వల్లే షంసుద్దీన్ ఇంటిని టార్గెట్ చేసారని తెలుస్తోంది. ఆయన భార్యా,పిల్లలు కూడా ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు. ఇక్కడికి వంద మీటర్ల దూరంలోనే ఇంకో ఇంటికీ తాళం వేసి ఉంది,మహ్మద్ హసీన్ అనే ఒకతన్ని అతని భార్య కాళ్ల మీద పడి ప్రాధేయపడుతున్నా వినకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని నైజా సరాయ్ వాసులు చెప్తున్నారు.

 దగ్గర్లోనే ఇంకో ఇంట్లో ఓ యువతి,ఆమె తల్లి “పోలీసులు తమ ఇంటిపై దాడి చేసి కిచెన్ సింక్,టీవీ,ఫ్యాన్ పగలగొట్టారు. మేం ఇంటి మరమ్మతుల కోసం దాచుకున్న 50,000 కూడా తీసుకెళ్లారు. చేతులు కట్టుకుని నిలబడ్డా కూడా వదలకుండా మాపై దాడి చేసారు” అని వాపోయారు. “నా కొడుకు కనీసం ఆ రోజు ఇంట్లో నుంచి బయటకి కూడా రాలేదు,తనని కూడా తీసుకెళ్లారని” అంటున్నారు.

 మా సోదరుడిని తీసుకెళ్లడానికైనా మా ఇంటిని నాశనం చేయాల్సిన అవసరం ఏముంది?” అని నిషాద్ పర్వీన్ ప్రశ్నిస్తోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఇంకో యువతి “మా ఇంట్లోకి చొరబడి గ్యాస్ సిలిండర్ పైపుని కట్ చేసి,ఇంటిని పేల్చేస్తామని బెదిరించారు. మా సోదరుడు కమ్రాన్ అహ్మద్ ని కూడా తీసుకెళ్లారు” అని చెబుతోంది. వీరందరి ఆచూకీ తెలియక కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులని ప్రశ్నిస్తే మాకేమీ తెలీదని,మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేయాలని అడుగుతున్నట్టు తెలుస్తోంది.

 శుక్రవారం రోజు నెహ్టౌర్ లో చనిపోయిన ఇద్దరు యువకులది మాత్రం నైజా సరాయ్ కాదు. దగ్గర్లోని ఏజెన్సీ చౌక్ ప్రాంతంలో పోలీసులు,నిరసనకారుల మధ్య జరిగిన అల్లర్లలో వీళ్లు చనిపోయారు.

 నా కొడుకు అనాజ్ హుస్సేన్ మనవడి కోసం పాలు తీసుకొచ్చేందుకు వెళ్లి బుల్లెట్ ఫైరింగ్ లో చనిపోయాడు” అని అర్షద్ హుస్సేన్ చెప్పారు. ఇంకో రైతు ఓమ్ రాజ్ సైని కూడా ఇలాగే బుల్లెట్ దాడిలో చనిపోయాడు. ఐతే మహమ్మద్ సులేమాన్ అనే ఓ విద్యార్థిని మాత్రం చాలా దగ్గర నుంచే కాల్చి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

 దగ్గర్లోని తాన్ మసీదులో ప్రార్థనలు చేయడానికి వెళ్లిన సులేమాన్ ని ఓ స్వీట్ షాప్ దగ్గర పోలీసులు చుట్టుముట్టారు,తర్వాత పక్కనే ఇంకో ప్రాంతంలో అతని శవం దొరికింది. పోస్ట్ మార్టమ్ సమయంలో కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. బిజ్నోర్ కి శవాలని తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేయమన్నారు ఐతే మేం నిరాకరించడంతో నెహ్టౌర్ కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంధువుల ఊళ్లో అంత్యక్రియలు నిర్వహించడానికి ఒప్పుకున్నారు” అని కుటుంబ సభ్యులు తెలిపారు.

 ప్రధానమంత్రి కి గానీ, ముఖ్యమంత్రి కి గానీ పిల్లలు లేరు. అందుకని మా పిల్లల్నీ చంపేస్తారా?, ప్రశాంతంగా బతకనివ్వరా?” అని సులేమాన్ తండ్రి ప్రశ్నించారు.

 బిజ్నోర్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో తమపై జరుగుతున్న దాడులు బయట ప్రపంచానికి తెలియట్లేదనీ,తమ ప్రాంతంలో ఎన్నడూ మతపరమైన కల్లోలాలూ,అల్లర్లూ జరిగిందే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రే ముస్లింలపై జరిగే హింసని సమర్థించే విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇంక మాకు రక్షణ ఎలా సాధ్యం?” అని నైజా సరాయ్ వాసులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు.

(Courtesy Scroll)