•  ఆ జీవోలను ఎందుకు దాస్తున్నారు?
  • పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి..
  • రాష్ట్ర సర్కారుకు హైకోర్టు ఆదేశం
  • లక్ష జీవోల్లో 42 వేలు రహస్యంగానే.. వాటినీ వెబ్‌సైట్‌లో పెట్టాలి: పిటిషనర్‌

హైదరాబాద్‌ : ప్రభుత్వం జారీచేసే జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకుండా రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని గత ఏడాది సెప్టెంబరులోనే ఆదేశాలు జారీచేసినప్పటికీ… ఇంత వరకు కౌంటర్‌ ఎందుకు వేయలేదని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యంలో ఫిబ్రవరి 28లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఏ. అభిషేక్‌రెడ్డితోకూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

ప్రభుత్వం జారీచేసే జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్‌రావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ… ప్రభుత్వ పాలన పారదర్శకంగా సాగడం లేదని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలిసారి అధికారంలోకి వచ్చిన నాటినుంచి నుంచి 2019 ఆగస్టు 15 వరకు  మొత్తం 1,04,171జీవోలు జారీచేసిందని వివరించారు.

42,462 జీవోలను రహస్యంగా ఉంచిదన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా వ్యవహరించలేదన్నారు.  రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం చాలా జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం లేదన్నారు. ప్రభుత్వం తొక్కిపెట్టిన జీవోలను వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టేలా ఆదేశించాలని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఒక అధికారిని బాధ్యుడిగా నియమించాలని కోరారు.

Courtesy Andhrajyothi