Image result for teku lakshmi case"

  •  దిశ విషయంలో ఒక న్యాయం? ఇక్కడో న్యాయమా?
  •  అక్కడిలాగే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలి
  •  ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆందోళనలు తీవ్రం

ఆసిఫాబాద్‌, డిసెంబరు:దిశ ఘటన నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో.. ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం ఎల్లాపటార్‌లో గత నెల 24న జరిగిన దళిత మహిళ హత్యాచారం కేసు నిందితుల సంగతేంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వారినీ ఇదే విధంగా శిక్షించాలనే డిమాండ్‌ తీవ్రమవుతోంది. కాగా, బెలూన్లు అమ్ముకుని జీవనం సాగించే మహిళను అడవిలోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసి, గొంతులో కత్తి దించి చంపివేసినా.. దిశ ఉదంతానికి ముందే ఇది చోటుచేసుకున్నా నిందితుల పట్ల పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. దిశ విషయంలో తీవ్రంగా స్పందించిన సమాజం.. ఈ కేసులో పట్టనట్లు వ్యవహరించిందని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పోలీసులపై గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ అసహనం వ్యక్తం చేయడం, శుక్రవారం దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో.. శుక్రవారం ఆసిఫాబాద్‌, లింగాపూర్‌, జైనూరు, రెబ్బెన మండలాల్లో దళిత బహుజన, ప్రజా సంఘాలు, కాంగ్రెస్‌, బీజేపీ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. ఓ దశలో ఇక్కడా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తారని వదంతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులపై ఒత్తిడి కనిపిస్తోంది. ఇప్పటికే ముగ్గురు నిందితులను వారు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. 10వ తేదీతో రిమాండ్‌ ముగిశాక విచారణ కోసం కస్టడీ కోరనున్నారు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి పోలీసులపైనే ఉంది. మరోవైపు ఎల్లాపటార్‌ ఘటనలో సత్వర న్యాయం జరగాల్సిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు.

(Courtesy Andhrajyothi)