* టి.సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు
– హైదరాబాద్‌ బ్యూరో:
రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్‌టిసి రూట్ల ప్రయివేటీకరణపై కేబినేట్‌ నోట్‌ను సీల్డ్‌ కవర్‌లో అడ్వకేట్‌ జనరల్‌ బిఎస్‌ ప్రసాద్‌ గురువారం న్యాయస్థానానికి అందజేశారు. ఈ సందర్భంలో చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌ రెడ్డిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌..వాటికి అంత గోప్యత ఎందుకని ప్రశ్నించింది. జీవో వచ్చిన తర్వాతే కేబినెట్‌ నిర్ణయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ఏజీ వివరణ ఇచ్చారు. రూట్ల ప్రయివేటీకరణపై ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉన్నందున కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సమాధానం కూడా వినాల్సిఉందని న్యాయస్థానం పేర్కొంది. పర్మిట్లపై అమలులోఉన్న మధ్యంతర ఉత్తర్వులను కోర్టు సోమవారం వరకు పొడిగించి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించిన పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా పడింది.

విలీనం డిమాండ్‌ తాత్కాలిక వాయిదా : జెఎసి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని, మిగిలిన డిమాండ్లపై చర్చలకు పిలవాలని ఆర్టీసీ జెఎసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గురువారం హైదరాబాద్‌లోని ఎంప్లాయీస్‌ యూనియన్‌ కార్యాలయంలో జెఎసి నేతలు అఖిలపక్ష నాయకులతో భేటీఅయ్యారు. అనంతరం జెఎసి కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ… ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదని, అరెస్టు చేసిన ఆర్టీసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కోర్టుతో పాటు ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రంలో 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇస్తే వెనుకబడిన వర్గాల ప్రజలు రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆర్టీసీని రక్షించాలంటూ శుక్రవారం బైక్‌ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. జెఎసి నేతలు 16న హైదరాబాద్‌లో దీక్ష, 17, 18న డిపోల వద్ద కార్మికుల సామూహిక దీక్ష, 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్‌ బంద్‌ నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి వెల్లడించారు.

Courtesy Prajasakti..