– అంతులేని నిరుద్యోగుల ఆత్మహత్యలు
– మోడీ సర్కార్‌కు పట్టని గోస..
కొండూరి వీరయ్య

కేంద్రప్రభుత్వం 2018కి గాను జాతీయ నేర గణాంక నివేదిక (ఎన్సీఆర్బీ) విడుదల చేసింది. ఈ నివేదికను పరిశీలిస్తే యువతరం గత మూడు దశాబ్దాల్లో లేనంతగా రోడ్ల మీదకు ఎందుకు వచ్చి ఆందోళనలను చేస్తున్నదో అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. 2018లో కేంద్ర హౌంశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం… 1,34,516 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో దాదాపు పది శాతం అంటే 12,936 మంది నిరుద్యోగ యువకులే. సగటున ప్రతి గంటకో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది 2018లో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య కంటే ఎక్కువ. సాధారణంగా ఏడాదికి సంబంధించిన వార్షిక నివేదికలు మరుసటి ఏడాదిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తున్న పార్లమెంటరీ సాంప్రదాయం. ఈ వాస్తవాలు ఇంత దారుణంగా ఉన్నాయి గనుకే మోడీ సర్కారు 2019 ఎన్నికలకు ముందు ఈ వివరాలు వెల్లడించటానికి సిద్ధం కాలేదు. రైతాంగం ఆత్మహత్యల గురించి ప్రభుత్వం వెల్లడించే లెక్కల్లో రైతుకు నిర్వచనం మార్చి మరీ ఇస్తున్నారు. అందువల్ల ఈ కాలంలో ప్రాణాలు తీసుకున్న రైతుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది కానీ ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నది. దీనికి అదనంగా ప్రాణాలు తీసుకుంటున్న నిరుద్యోగుల సంఖ్య పెరగటం.. పెరుగుతున్న సంక్షోభానికి నిదర్శనంగా ఉంది.

2017లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల సంఖ్య మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యలో ఏడున్నర శాతం. 2018లో ఈ సంఖ్య మొత్తం చనిపోయిన వారిలో పది శాతానికి పెరిగింది. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవటానికి ఇంతకు మించిన ఆధారం ఏమీ అక్కర్లేదు. 2017లో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య 1,29,887గా ఉంటే 2018లో ఈ సంఖ్య 1,34,516కి పెరిగింది. అంటే 2017లో 10,349 మంది నిరుద్యోగ సమస్య కారణంగా ఆత్మహత్యకు పాల్పడితే తర్వాత ఏడాది 12,936 మంది ఈ కారణంతో ప్రాణాలొదిలారు. ఈ దిగువన ఇచ్చిన పట్టిక ఆధారంగా దీనిని పరిశీలించవచ్చు.

మొత్తం ఆత్మహత్యలు నిరుద్యోగులు
2015 1,33,623 10,912
2016 1,31,008 11,173
2017 1,29,788 12,241
2018 1,34,516 12,936

ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల్లో 82 శాతం మంది యువకులు. 18 శాతం యువతులు ఉన్నారు. నిరుద్యోగ యువకుల్లో తమిళనాడు, మహారాష్ట్ర అగ్రభాగాన ఉండటం గమనార్హం. రైతాంగంలో మహారాష్ట్ర 34 శాతంతో ముందు పీఠిన ఉంటే తర్వాత 23 శాతంతో కర్నాటక, తొమ్మిది శాతంతో తెలంగాణ, ఆరున్నర శాతంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన కుటుంబాల్లో లక్షకన్నా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలు 66 శాతం ఉంటే 30 శాతం కుటుంబాల సగటు ఆదాయం ఐదు లక్షల కన్నా తక్కువగా ఉంది.

అంటే 66 శాతం కుటుంబాల్లో తలసరి దినసరి ఆదాయం 70 రూపాయలకంటే తక్కువగా ఉంది. ఈ నామమాత్రపు ఆదాయాలతో అటు చదువులు, ఆరోగ్య ఖర్చులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ వివరాలు పరిశీలిస్తే అర్థమవుతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలూ వీరి జీవితాలు నిలుపుకోవటానికి ఉపయోగపడటం లేదన్న వాస్తవం కూడా హౌంశాఖ నివేదికలు పరిశీలిస్తే స్పష్టమవుతున్నది. ఏ దేశంలోనైనా ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతూ ఉంటే దాని ప్రభావం పెరుగుతున్న ఆత్మహత్యల రూపంలో వ్యక్తమవుతుందని ప్రపంచ ఆర్థిక ఫోరం పరిశోధన వెల్లడించింది. 2008 ప్రపంచ ద్రవ్య పెట్టుబడి సంక్షోభానికి మూలమైన అమెరికాలో ఆ సంవత్సరం నిరుద్యోగం, దానితో వచ్చే మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక దాదాపు 40 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ నివేదిక తెలిపింది. లాన్సెట్‌ అనే ఆరోగ్య పరిశోధనలు ప్రచురించే పత్రిక కూడా ఈ విషయంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 21వ శతాబ్దం తొలి దశాబ్దకాలంలో ఆర్థిక సమస్యలు, ఆత్మహత్యల మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధించటానికి దాదాపు 68 దేశాల నుంచి సమాచారం సేకరించి లాన్సెట్‌ పత్రిక విశ్లేషణలు జరిపింది.

ఈ అధ్యయనాల్లో ఆర్థిక సమస్యలు, ముఖ్యంగా నిరుద్యోగం మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో 30 శాతం మందిని ఈ దిశగా ప్రేరేపించిన కారణంగా ఉందని ప్రకటించింది. పని చేయగలిగిన వారిని నిరుద్యోగులుగా మార్చటం, పని చేయటానికి సిద్ధంగా ఉన్న వారికి పని కల్పించకపోవటం వంటి ఫలితాలకు దారితీసే విధానాలు సమాజంపై మరింత ప్రమాదకర ప్రభావాన్ని కలగచేస్తున్నాయని ఈ పరిశోధన వెల్లడించింది. ఏదో ఒక పని చేసుకునే వాళ్లంటే సమాజం గౌరవించే తీరుకు.. ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నారంటే గౌరవించే తీరుకు మధ్య ఉన్న తేడానూ లాన్సెట్‌ పరిశోధనలో చర్చించారు. అర్హత, శక్తి, అవసరం ఉన్న యువతకు ఉపాధి కల్పించటం కేవలం దేశం ఆయా కుటుంబాలను బాగు చేయటా నికి మాత్రమే కాదు. మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థను కూడా బాగు చేయటానికి ఉపయోగపడుతుంది. ఈ విశ్లేషణలన్నీ భారతదేశానికి కూడా యథాతథంగా వర్తించేవిగా ఉండటం గమనార్హం. దేశంలోమోడీ పరిపాలనలో నికరంగా పది శాతం మంది అర్హులైన యువకులు, విద్యా ధికులైన యువకులు నిరుద్యోగులుగా మారుతున్నారని కేంద్ర ప్రభుత్వ గణాంక సంస్థలు ఇచ్చిన నివేదికలే వెల్లడిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో మోడీ వాగ్దానం చేసిన నవభారతంలో యువతరానికి తావు లేదని హౌంశాఖ విడుదల చేసిన ఆత్మహత్యల నివేదిక స్పష్టం చేస్తున్నది.

(Courtesy Nava Telangana)