ఆల్బెండజోల్‌ పంపిణీ చేసినప్పుడల్లా అపశ్రుతులేసహస్ర మృతిపై హెచ్చార్సీ ఆగ్రహం
మార్చి 11కల్లా నివేదిక ఇవ్వాలి
జగిత్యాల కలెక్టర్‌కు కమిషన్‌ ఆదేశం
పెద్దపల్లిలో 16 మంది పిల్లలకు అస్వస్థత
మహబూబ్‌నగర్‌లో ముగ్గురికి..  
వైద్య, ఆరోగ్య శాఖ విచారణ షురూ

పిల్లల్లో నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయడం.. ఏటా అపశ్రుతులు చోటుచేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా చిన్నారి సహస్ర.. ఆల్బెండజోల్‌ మాత్ర వికటించి మృతి చెందింది. ఆ చిన్నారి మృతికి బాధ్యులెవరు? ఏటా ఏదో ఒక ఘటన జరుగుతున్నా.. యంత్రాంగం ఏం చేస్తోంది? నులిపురుగుల మందులతో చిన్నారుల ప్రాణాల  మీదకు వస్తుంటే పట్టించుకోరా? రెండో రోజూ పంపిణీ కొనసాగిస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ధర్మపురిలో ఆల్బెండజోల్‌ మాత్ర వికటించి సహస్ర(7) మృతిచెందడంతో పాటు 19 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై మార్చి 11లోగా నివేదిక ఇవ్వాలని జగిత్యాల కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి, సంక్షేమ అధికారులకు మంగళవారం నోటీసులు జారీ  చేసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన వార్తను సుమోటోగా స్వీకరించింది. మరోవైపు సహస్ర మృతిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. జేడీ చంద్రశేఖర్‌ ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యాధికారులు, సిబ్బందిని విచారించారు. సహస్ర చదువుతున్న పాఠశాల సిబ్బందిని, స్థానిక ఆశావర్కర్లను ప్రశ్నించి పలు వివరాలు రికార్డు చేసుకున్నారు.

సహస్ర తల్లి నుంచి వివరాలు సేకరించారు. చిన్నారి తీసుకున్న మాత్రలను వరంగల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రం అమర్‌నగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలను వేశారు. 16 మంది విద్యార్థులకు సోమవారం రాత్రి నుంచే కడుపునొప్పి, వికారం, తలనొప్పిగా ఉండడంతో మందులు వేశారు. ఉదయం  వారిని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆస్పత్రికి వెళ్లి, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించా రు. చందపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినిని కూడా ఆస్పత్రిలో చేర్పించారు. కాగా.. మహబూబ్‌నగర్‌లోని మోతీనగర్‌లో ఇద్ద రు చిన్నారులకు మాత్రలు వేసుకున్న వెంటనే కడుపునొప్పి వచ్చింది. ఏనుగొండలో ఓ బాలుడికి ముఖంపై మచ్చలు రావడంతో పాటు విరేచనాలు అయ్యాయి.

దీంతో అందరినీ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలకు ఎక్కువ నులిపురుగులు ఉన్నందున కడుపునొప్పి వచ్చిందని, మరో బాలుడికి పురుగులుండడంతోనే విరేచనాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా ఽధారూరులో అభిరాం(5)కు సోమవారం ఆల్బెండజోల్‌ మాత్ర వేశారు. ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులు అవడంతో పాటు ముఖంపై దద్దుర్లు వచ్చాయి. వెంటనే ఏఎన్‌ఎం వెళ్లి సిరప్‌ ఇవ్వడంతో బాలుడు మంగళవారం కోలుకున్నాడు.

గత ఏడాదీ ఇదే పరిస్థితి..
గత ఏడాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బకాల్‌వాడీ ఉన్నత పాఠశాలలో ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేయగా, ఐదుగురు విద్యార్ధులు కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు. అదేరోజు ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండేళ్ల చిన్నారి ఈ మాత్ర వికటించి ప్రాణాలు కోల్పోయాడు. 20 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. తెలంగాణలో గత ఏడాది ఆల్బెండజోల్‌లో నాణ్యత లేని కారణంగా చివరి నిమిషంలో 18 జిల్లాల్లో పంపిణీని నిలిపివేశారు. ఒడిసా డ్రగ్‌ కెమికల్స్‌ కంపెనీ నుంచి సరఫరా అయిన ఆల్బెండజోల్‌లో నాణ్యత లేకపోవడంతో పంపిణీ చేయలేదు. దానిపై ‘పిల్లల ప్రాణాలతో చెలగాటం’ పేరిట ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది.

తేడా ఎందుకొస్తోంది?
ఈ ఏడాది వేరే కంపెనీ నుంచి 1.13 కోట్ల మాత్రలను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ద్వారా కొనుగోలు చేశారు. మొత్తం 36 బ్యాచ్‌లలో ఈ 1.13 కోట్ల మాత్రలు తయారయ్యాయి. బ్యాచ్‌కు ఒకటి చొప్పున శాంపిళ్లు తీసినట్లు అధికారులు చెబుతున్నారు. సగటున 2.76 లక్షల మాత్రలకు ఒక బ్యాచ్‌ చొప్పున తయారయ్యాయి. 1.13కోట్ల మాత్రలకు కేవలం 36శాంపిళ్లనే పరీక్షలకు పంపారు. అంత తక్కువగా శాంపిళ్లు తీస్తే సరైన ఫలితం ఎలా వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మల్టీనేషనల్‌ కంపెనీలూ ఒక బ్యాచ్‌ మెడిసిన్‌ తయారు చేయాలంటే బ్యాచ్‌కు 1-1.5లక్షల సా మర్థ్యమే ఉంటుందని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. కానీ, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి ఆల్బెండజోల్‌ సరఫరా చేసిన కంపెనీకి అంత సామర్థ్యం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడే ఏదో తేడా వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Courtesy Andhrajyothi