నాడు తెలంగాణ ఏర్పాటుకు సాధనాలయిన సమ్మెలు, నిరసనలు నేడు సహింపరానివైపోయాయి. ప్రజల న్యాయమైన నిరసనలపై నిరంకుశ ధోరణులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చట్టబద్దమైన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఉక్కుపాదం మోపుతుండటం ఇందుకు పరాకాష్ట. సమ్మె నివారణకు ఏ మాత్రం ప్రయత్నించకుండా కార్మికులను అని వార్యంగా సమ్మెలోకి నెట్టిన సర్కారే, ఇప్పుడు సమ్మెహక్కునూ వమ్ము చేయ పూనుకోవడం ప్రజాస్వామ్యానికి సవాలు గా మారింది.

ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి జారీ చేసిన హెచ్చరికలు ఈ ఆందోళనను మరింత తీవ్రం చేస్తున్నాయి.
తెలంగాణ జనజీవితంలో భాగమైన బతుకమ్మ, దసరా పండుగల వేళ.. ప్రజల్ని అనేక ప్రయాసలకు గురిచేస్తున్న ఈ సమ్మెకు బాధ్యులు ఎవరు? నెల రోజుల ముందే కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా.. ఎలాంటి చర్యలూ, చర్చలకూ కనీస ప్రయత్నాలు చేయని ప్రభుత్వం.. తీరా సమ్మెకు రెండు రోజుల ముందు అధికారులతో కమిటీ వేయడం, ఆ కమిటీకి సంప్రదింపులే తప్ప సమస్య పరిష్కారానికి ఏ అధికారాలూ ఇవ్వకపోవడం సమస్యను జటిలం చేసింది. పైగా సమ్మెకు ముందు కనీస స్పందన కనపరచని ముఖ్యమంత్రి ఇప్పుడు కార్మికులపై కన్నెర్రజేయటం, ఏకపక్షంగా సమ్మెలో ఉన్న 48,000మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు హుకుం జారీ చేయడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. గతంలో తమిళనాట సమ్మెచేస్తున్న 1.70లక్షలమంది ఉద్యోగులను ఇలాగే డిస్మిస్‌ చేసిన జయలలిత నియంత పోకడలనే మన ముఖ్యమంత్రీ అను సరిస్తున్నారు. కానీ, ఆమెకు ప్రజాక్షేత్రంలో పాఠం నేర్పిన సంగతే యాది మరిచినట్టున్నారు. సకల జనుల సమ్మెలూ, సడక్‌ బందులూ రాష్ట్ర ఏర్పాటుకే కాదు, రాష్ట్రంలో తమ అధికారానికీ కారణమయ్యాయన్న సంగతి కూడా ఆయన మరిచినట్టున్నారు! అంతేనా.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామనీ, ప్రభుత్వో ద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకూ వేతనాలు పెంచుతామన్న ఉద్యమకాలం నాటి వాగ్దానం సైతం ఆయనకు గుర్తులేకపోవడం విచారకరం!
అయినా ఇప్పుడు కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలేమీ కాదు కదా! నష్టాల ఊబిలో చిక్కుకున్న సంస్థను కాపాడమంటున్నారు. గడిచిన మూడేండ్లుగా పట్టించుకోని తమ వేతన సవరణలను కాస్త పరిశీలించమంటున్నారు. కార్మికుల డిమాండ్లలో సగానికి పైగా పైసా ఖర్చులేకుండా పరిష్కారమయ్యేవే గాక, సంస్థను నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేవి కూడా. కానీ చిత్తశుద్ధి లేని సర్కారు వాటిని చెత్తబుట్టలో పడేసి, అవే నష్టాలను సాకుగా చూపి సంస్థను నిర్వీర్యం చేయజూస్తున్నది. పుష్కలమైన మానవ వనరులు, అవసరానికి మించిన ఆక్యుపెన్సీ నిష్పత్తి ఉండి కూడా ఆర్టీసీ నష్టాల్లో ఉండటం విచిత్రం. ప్రస్తుతం ఆర్టీసీ ఏటా రూ.700 కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నదనీ, మొత్తంగా రూ.2000 కోట్ల మేర నష్టాల్లో ఉందని చెపుతున్నారు. కానీ ప్రభుత్వం ఆర్టీసీకి బకాయిపడ్డ మొత్తం రూ.2500 కోట్లు. ఈ బకాయి చెల్లించకపోగా, ఆర్టీసీ కో-ఆపరేటీవ్‌ సొసైటీ డబ్బు 500 కోట్లూ, ఆఖరికి కార్మికుల పీఎఫ్‌ డబ్బులు కూడా యాజమాన్యమే వాడుకున్నది. ఈ విషయాలన్నీ మరుగునపెట్టి సంస్థ నష్టాలకు కార్మికుల్ని కారకులుగా చూపడం ఎలా సమంజసం? ఇక ఆర్టీసీలో ఇంధన ఖర్చు ఏడాదికి రూ.1300 కోట్లు. ఇందులో సగానికి పైగా.. అంటే సుమారు రూ.650 కోట్లు పన్నులే. ఈ పన్నులో కేంద్రం వాటా పోగా 300 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నది. ఈ మొత్తాన్ని తిరిగి ఆర్టీసీకి బదలాయిస్తే ఏటా వచ్చే నష్టాల్లో సగం తుడిచిపెట్టుకుపోతుంది. ఇది కాకుండా మోటారు వాహన పన్ను కింద రూ.290 కోట్లు, విడిభాగాల కొనుగోలుపై రూ.150 కోట్లు ఏటా ఆర్టీసీ ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఈ మొత్తాల నుంచి ఆర్టీసీని మినహాయించడంతో పాటు, ఇష్టా రాజ్యంగా కొనసాగుతున్న అక్రమ ప్రయివేటు రవాణాను నియంత్రిస్తే ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కడమే కాదు, లాభాలలో ప్రయాణిస్తుంది. ఆర్టీసీకి ఈ కనీస చేయూతనందించడం ప్రభుత్వ బాధ్యత. ఎందుకంటే సమాజ అభివృద్ధిలో ప్రజారవాణా వ్యవస్థ అత్యంత మౌలికమైనదీ, కీలకమైనదీ కాబట్టి. కానీ ప్రభుత్వం ఆ పని చేయకపోగా, నష్టాలకు కారణంగా నిలవడం విషాదకరం!
ఈ పరిస్థితుల్లో సమ్మెకు దిగిన కార్మికుల ఆవేదనను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. వారిని విధుల నుంచి తొలగించడం, అవసరమైతే ఆర్టీసీని మూసేస్తామని బెదిరించడం సహేతుకం కాదు. పరిస్థితి చూస్తోంటే సమ్మెను సాకుగా తీసుకుని, సంస్థను ప్రయివేటీకరించాలన్న తమ అంతరంగాన్ని అమలు పరిచేందుకు ఏలికలు పాచికలేస్తున్నారా అన్న అనుమానాలూ రాకపోవు! లేదంటే ఏకపక్షంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించడమే గాక, అద్దె బస్సులకు ఆహ్వానం పలకడం, సమ్మెలో ఉన్న ఉద్యోగుల స్థానంలో కొత్త రిక్రూట్‌మెంట్స్‌కు ఆదేశాలివ్వడం, కొత్తగా రిక్రూటయ్యేవారు భవిష్యత్తులో ఏ యూనియన్‌లోనూ చేరబోమన్న ఒప్పంద పత్రాలను సమర్పించాలని ఆజ్ఞాపించడం దేనికి సూచికలు..!? ఇన్ని చేసినా ఈ బెదిరింపులకు ఏ ఒక్క కార్మికుడూ లొంగకపోవడం గమనార్హం. తమ డిమాండ్ల సాధనకే కాదు, ప్రజాతంత్ర హక్కుల కోసమూ వారు నిలబడుతున్న తీరు అభినందనీయం. వారికి మద్దతుగా నిలబడటం ఇప్పుడు ప్రజలందరి కర్తవ్యం. ఆర్టీసీ రక్షణకే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణకూ ఇది అనివార్యం.

Courtesy Nava telangana…