అబద్ధాల షా…
ఎన్నార్సీపై పార్లమెంటు వేదికగా హోంమత్రి బహిరంగ ప్రకటన
ఎన్నికల ర్యాలీల్లోనూ అవే వ్యాఖ్యలు
సీఏఏ వ్యతిరేక నిరసనలతో మాట మారుస్తున్న మోడీ సర్కారు
ఎన్పీఆర్‌పై అదే తీరు..

న్యూఢిల్లీ : దేశవ్యాప్త ఎన్నార్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని లోక్‌సభలో కేంద్ర హౌంశాఖ సహాయమంత్రి నిత్యానంద్‌ రారు తెలిపిన నేపథ్యంలో ఎన్నార్సీపై కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన అబద్ధాలు చెబుతున్నారనీ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి పార్లమెంటుతో పాటు దేశాన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్లమెంటులోనే గాక గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారసభలతో పాటు మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పలు సందర్భాల్లో ఎన్నార్సీ గురించి ఆయన ప్రస్తావించారు. అయితే సీఏఏ వ్యతిరేక నిరసనలతో కేంద్రం ఒక్కసారిగా మాట మార్చింది. ఏకంగా ప్రధాని మోడీ సైతం దేశవ్యాప్త ఎన్నార్సీపై క్యాబినెట్‌లో గానీ, తమ పార్టీలో గానీ చర్చ జరగలేదని చెప్పారు. అయితే అంతకుముందు దేశవ్యాప్త ఎన్నార్సీని అమలుచేస్తామన్న షా.. అనూహ్యంగా మాట మార్చి మోడీ చెప్పిందే నిజమని తెలపడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త ఎన్నార్సీపై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యల పరంపర.

  • 2019 నవంబర్‌ 20.. పార్లమెంటు సమావేశాల సందర్భంగా షా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలుచేస్తాం. అదే సమయంలో అసోంలోనూ మళ్లీ చేపడతాం’
  • 2019 డిసెంబర్‌ 02.. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న అమిత్‌ షా ప్రసంగిస్తూ.. ‘ఈరోజు నేను మీకు ఒకటి స్పష్టం చేయదలుచుకున్నాను. 2024 పార్లమెంటు ఎన్నికలకంటే ముందే దేశవ్యాప్త ఎన్నార్సీని నిర్వహిస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటున్న ఆక్రమణదారులందరినీ దేశం నుంచి తరిమేస్తాం’
  • 2019 డిసెంబర్‌ 10.. పార్లమెంటులో హౌంమంత్రి.. ‘ఎన్నార్సీ రాబోతుంది. మానసికంగా సిద్ధంగా ఉండండి’.

పార్లమెంటులో ఉన్న సంఖ్యాబలంతో డిసెంబర్‌లో కేంద్రం తీసుకొచ్చిన సీఏఏపై దేశం ఒక్కసారిగా అట్టుడికింది. కుల, మత బేధాలు లేకుండా అసోం నుంచి తమిళనాడు వరకూ ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూపీతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు చేసిన హింసాకాండతో సుమారు 30 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. దీంతో కేంద్రం మళ్లీ తనకు అలవాటైన అబద్ధాలనే నమ్ముకున్నది.
– 2019 డిసెంబర్‌ 22.. ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో మోడీ.. ‘ఎన్నార్సీపై ఇప్పటివరకూ కేంద్ర మంత్రివర్గంలో గానీ పార్టీలో గానీ చర్చ జరగలేదు’

ొ2019 డిసెంబర్‌ 24.. ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షా మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఎన్నార్సీపై చర్చే అవసరం లేదు. ప్రధాని చెప్పిందే నిజం’
– 2020 ఫిబ్రవరి 04.. పార్లమెంటులో కేంద్రం.. ‘జాతీయస్థాయిలో ఎన్నార్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు’

హౌంమంత్రే గాక పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలూ ఈ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిని జాతీయస్థాయిలో అమలుచేస్తామని మోడీ సర్కారు ఏకంగా గతేడాది రాష్ట్రపతి ప్రసంగంలోనే చెప్పించిన విషయాన్నీ మరిచింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత నిర్వహించిన పార్లమెంటు సమావేశాల్లో (2019 జూన్‌ 20) ఉభయసభలను ఉద్ధేశించి రామ్‌నాథ్‌ కోవింద్‌ మాట్లాడుతూ.. ‘ఎన్నార్సీని అమలుచేయడానికి మోడీ సర్కారు కృతనిశ్చయంతో ఉన్నది. అక్రమ వలసదారులున్న ప్రాంతాల్లో దీనిని అమలుచేయడానికి కేంద్రం కట్టుబడి ఉంది’ అని ప్రకటించారు.

ఇదేగాక జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్‌) గురించి మోడీ సర్కారు అబద్ధాలనే ప్రచారం చేస్తున్నది. ఎన్డీయే మొదటి పాలనలోనే నిర్వహించిన పార్లమెంటు సమావేశాల సందర్భంగా (2014 నవంబర్‌ 26) రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హౌంశాఖ సమాధానమిస్తూ… ‘ఎన్పీఆర్‌ అనేది దేశ పౌరులెవరు..? కానివారెవరు..? తేల్చే సాధారణ నివాసితుల రిజిష్టర్‌. పౌరుల పౌరసత్వ స్థితిని నిర్ధారించి ఎన్నార్సీని అమలుచేయడంలో ఎన్పీఆర్‌ అనేది కీలకం’ అని తెలిపింది. దీనిపైనా వ్యతిరేకతలు వెల్లువెత్తుతుండటంతో.. అది సాధారణ జనగణనే అని ప్రచారం చేస్తున్నది.

Courtesy Nava Telangana