ఈ పథకంలో అంతులేని అవినీతి జరిగింది. కొన్నిచోట్ల గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపారు. లేని గొర్లను ఉన్నట్లుగా, కోటి పిల్లలు పుట్టినట్లుగా అధికారులు కాగితాల్లో చూపించారు. ఈ గొర్రెల ద్వారా 2.77 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగిందని దొంగలెక్కలు చూపుతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. నిజంగానే ఇంత గొర్రెల సంపద, మాంసోత్పత్తి రాష్ట్రంలో పెరిగి ఉంటే మాంసం ధరలు తగ్గాలి కదా!

రెండేండ్లలో పూర్తి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌ 2017 జూన్‌ 20న కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించి మూడేండ్లు పూర్తయిన నేపథ్యంలో, ఆచరణలో ఏం జరిగింది అనే సమగ్ర విశ్లేషణ అవసరం.

రాష్ట్రంలో గొల్ల కురుమలు సుమారు 29.5లక్షల జనాభాతో మొత్తం జనాభాలో 7శాతంగా ఉన్నారు. గొర్రెల పెంపకం వృత్తితో సుమారు 7.15 లక్షల కుటుంబాలు జీవిస్తున్నారు. పథకం ప్రారంభానికి ముందే రాష్ట్రంలో 1.28 కోట్ల గొర్రెలు, 46.75 లక్షల మేకల సంపద ఉంది. వీటితో ప్రతి సంవత్సరం 1.45 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసోత్పత్తి జరిగింది. మాంసాహారులు కూడా రాష్ట్రంలో ఎక్కువ. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మాంసం ఇక్కడి వినియోగానికి సరిపోకపోవడంతో ప్రతి రోజు 400 నుండి 600 లారీల గొర్రెలను ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లోటు తీర్చడానికి, గొల్లకురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి 75 శాతం సబ్సిడీతో రెండేండ్లలో 7.29 లక్షల మందికి 1.53 కోట్ల గొర్రెలు పంపిణీ చేయాలని, లక్ష్యాన్ని పెట్టుకున్నారు. జాతీయ సహకార అభివృద్థి సమాఖ్య (ఎన్‌.సి.డి.సి.) వద్ద రాష్ట్ర ప్రభుత్వం 3.75 వేల కోట్ల ఋణం తీసుకుంది.

పంపిణీ చేసే గొర్రెలన్నింటికి దాణా, మెడికల్‌ కిట్లు, మేతకోసం సబ్సిడీపై గడ్డిగింజలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించారు. గొర్రెలను మన పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించారు. పథకంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుందన్నారు. గొల్లకురుమల నిజాయితీ గురించి, వందలాది గొర్రెల్లో సరైన గొర్రెలను గుర్తించడంపై వారికున్న నైపుణ్యాన్ని గురించి అసెంబ్లీ సాక్షిగా పొగిడారు. మంత్రుల నుండి గ్రామ పంచాయితీ వార్డు సభ్యుని దాకా, ఐ.ఏ.ఎస్‌ ఆఫీసరు నుండి అటెండర్‌ దాకా అందరూ అలర్టై గ్రామాలకు తరలి గ్రామసభలు పెట్టారు. గొర్రెల పెంపకందార్ల సొసైటీల్లో కొత్త సభ్యులను చేర్పించారు. లాటరీలు తీసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. గొల్ల కురుమలు సి.ఎం. చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, గొర్రె పిల్లలను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఆచరణలో గత మూడేండ్లలో 3.66 లక్షల మందికి (మొత్తం లబ్ధిదారుల్లో సగం మంది) 76.86 లక్షల గొర్రెలను పంపిణీ చేసి ఆర్ధాంతరంగా పథకాన్ని నిలిపివేశారు. గొర్రెలు వస్తాయనే ఆశతో లబ్ధిదారుని వాటాధనం క్రింద సుమారు 28 వేల మంది ఒక్కొక్కరు రూ.31,250 చొప్పున, 87.5 కోట్ల రూపాయలు డి.డి.లు తీసి ప్రభుత్వ ఖజానాలో జమచేసి రెండేండ్లుగా వేచి చూస్తున్నారు. కానీ, ఈ పథకంలో అంతులేని అవినీతి జరిగి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. ఇప్పటి వరకు పంపిణీ చేసిన గొర్రెల్లో అధికశాతం కమీషన్‌లకు కక్కుర్తిపడి, దళారీలతో కుమ్మక్కై ఈతకు ఉపయోగపడని చిన్నపిల్లలు, ముసలి గొర్రెలున్నాయి. కొంతమంది పశువైద్యాధికారులు ఒక్కో యూనిట్‌లో రూ.12 వేల నుండి 22 వేల వరకు కమీషన్‌లు తీసుకున్నారు. కొన్నిచోట్ల గొర్రెలు కొనకుండానే కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపారు. రాష్ట్రానికి దిగుమతి చేసుకునే గొర్రెల లారీలూ ఆగలేదు. 2018 అక్టోబర్‌ నుండి 2019 మార్చి వరకు దేశవ్యాప్తంగా జరిగిన పశుగణన లెక్కల్లో తమ బండారం బయటపడుతుందని అధికారులు మాత్రం లేని గొర్లను ఉన్నట్లుగా, కోటి పిల్లలు పుట్టినట్లుగా కాగితాల్లో చూపించారు. ఈ గొర్రెల ద్వారా 2.77 లక్షల మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి పెరిగిందని దొంగలెక్కలు చూపుతూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

నిజంగానే ఇంత గొర్రెల సంపద, మాంసోత్పత్తి రాష్ట్రంలో పెరిగి ఉంటే మాంసం ధరలు తగ్గాలి. కాని, కరోనా కాలంలోనూ హైదరాబాద్‌ నగరంలో కిలో మటన్‌ ధర గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 1000 రూపాయలకు పెరిగింది. దీనికి అసలు కారణం ఇతర రాష్ట్రాలనుండి రావలసిన గొర్రెల, మేకల దిగుమతి నిలిచిపోవడమే. గొర్రెల పంపిణీ సరిగ్గా జరిగుంటే ఆ పంపిణీ చేసిన గొర్రెలకు పిల్లలు పుట్టుంటే సంపద పెరగడంతోపాటు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెల దిగుమతి ఆగిపోయేవి, మటన్‌ ధరలు కూడా తగ్గేవి. విచిత్రంగా మనం గొర్రెలు కొనుగోలు చేసిన పక్క రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రల్లో కూడా పశుగణన లెక్కల్లో గొర్రెల సంఖ్య పెరిగింది. ఇక ఇచ్చిన జీవాలకు సరిపడా మేత, నీరు లేక వలసలు తప్పడంలేదు. రైతుల భూముల్లో 50 శాతం సబ్సిడీతో గడ్డి విత్తనాలు అందిస్తామని ఇవ్వలేదు. గ్రామీణాభివృద్ది శాఖ వారితో నీటితొట్లు, షెడ్లు కట్టిస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు చేసింది మాత్రం శూన్యం. పైగా మేతకోసం అడవికిపోతే కేసులు బనాయించి జరిమానాలు విధిస్తున్నారు. జీవాలకు సరైన సమయంలో వైద్యం అందడం లేదు. పశువైద్య సిబ్బంది ఖాళీలు భర్తీచేయలేదు, కొత్తగా పశువైద్యశాలల ఏర్పాటు చేయలేదు. గొర్రెలకు బీమా చేసినప్పటికీ అవి చనిపోయినపుడు పరిహారం ఇవ్వలేదు. ఈ వ్యవహారం తెలిసినప్పటికీ సి.ఎం గాని, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు గాని ఏ ఒక్కరోజు సమీక్ష నిర్వహించలేదు, అవినీతి అరికట్టలేదు. పైగా అవినీతికి పాల్పడిన అధికారులకే ప్రమోషన్లు కూడా ఇచ్చారు.

ఈ పథకం ఎవరికి ఉపయోగపడిందో పరిశీలిస్తే, మొదటి వరుసలో లాభపడ్డది రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ. మొదటి విడుత గొర్రెల పంపిణీ జరుగుతుండగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అధికార పార్టీ పెద్దఎత్తున ప్రచారం చేసుకుంది. గొల్లకురుమలు అధికార పార్టీకి 90శాతం ఓట్లేసి టి.ఆర్‌.ఎస్‌.ని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చి తమ నీతిని ప్రదర్శించారు. ఇక రెండో లబ్ధిదారులు పశుసంవర్థక శాఖ అధికారులు, దళారీలు. దళారీలు లేకుండా చూస్తామని ప్రకటించినప్పటికీ మొత్తం కొనుగోలులో దళారీలదే పైచేయి. డాక్టర్లు దళారులు కలిసి నాసిరకం గొర్రెలిచ్చి వచ్చిన కమిషన్‌ను పంచుకొని అందులో కొంతసొమ్మును నేతలకూ ముట్టచెప్పారు. ఇక గొల్లకురుమలు గొర్రెలకు మేత, నీరు, వైద్యంలేక గొర్రెలు చనిపోతుంటే దిక్కుతోచని స్థితిలో అక్కడక్కడా గొర్రెలు అమ్ముకుంటే కేసులు పెట్టి జైలుకు పంపారు. ఆఖరికి వీరికి దక్కింది గొర్రె తోక మాత్రమే. పథకం ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి ఆశించినట్టు ఈ మూడేండ్లలో గొల్లకురుమలందరికి గొర్రెల పంపిణీ జరుగలేదు, వీరు 20 వేల కోట్లకు అధిపతులూ కాలేదు.

మాంసాభివృద్ధితోపాటు, గొల్లకురుమలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికుంటే పథకంలో అవినీతికి ఆస్కారం లేకుంగా కఠినమైన నిబంధనలు రూపొందించాలి. మిగిలిన సగం మంది లబ్ధిదారులందరికీ వారి అక్కౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేసి వారికి ఇష్టం వచ్చిన చోట నాణ్యమైన గొర్రెలు కొనుక్కునే అవకాశమివ్వాలి. స్థానిక దక్కని జాతి గొర్రెలనిచ్చి ఉన్ని పరిశ్రమనూ, తెలంగాణకు చిహ్నమైన ‘‘గొంగడి’’ని ప్రోత్సహించాలి. ఈ వృత్తికి అనుబంధంగా ఉన్న తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలో గొర్రెల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. కొత్త కొత్త గొర్రెల జాతులను ప్రవేశపెట్టి మాంసం ఉత్పత్తి పెంచే చర్యలు చేపట్టాలి. ఉన్నత చదువులు చదివిన గొల్ల కురుమ యువతకు పరిశ్రమలకు ఇస్తున్నట్లు భూమి, విద్యుత్తు, నీరు తదితర సౌకర్యాలతో కనీసం 30 లక్షల రూపాయలతో యూనిట్‌లను నిర్ణయించి పెద్ద మొత్తంలో గొర్రెల ఫారాలు (కోళ్ల ఫారాల మాదిరిగా) ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. మార్కెట్‌ సౌకర్యం కల్పించి దళారుల మోసాన్ని అరికట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగళ్లను సొసైటీలకు అప్పగించి, గొర్రెల అమ్మకం, కొనుగోలు తూకం వేసి జరిగే విధంగా చూడాలి. అక్కడే గొర్రెల వధశాలలను ఏర్పాటు చేసి మాంసాభివృద్ది కేంద్రాలు అభివృద్ధి చేయాలి. కెసిఆర్‌ను నమ్మిన గొల్లకురుమలు ఎన్నికల్లో తమనీతిని ప్రదర్శించారు. ప్రభుత్వం కూడా నమ్మిన గొల్లకురుమలను వమ్ము చేయదని ఆశిస్తున్నాను.

ఉడుత రవీందర్‌
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం

Courtesy AndhraJyothy