– త్వరలోనే సమాధానమిస్తామన్న ప్రభుత్వం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ, కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా, ఇతర బీజేపీ సీనియర్‌ నాయకులు బహిరంగ సభల్లో తమ ప్రత్యర్థులను తరుచూ ”అర్బన్‌ నక్సల్స్‌” అంటూ విమర్శిస్తున్నారు. అయితే, ఈ నేపథ్యంలో ప్రముఖ న్యూస్‌ ఛానల్‌ ”ఇండియా టుడే” ఈ అంశంపై స్పష్టత కోరుతూ.. ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని ప్రశ్నించింది. ‘అర్బన్‌ నక్సల్స్‌’ అంటే ఎవరు? వారు ఎక్కడ పనిచేస్తారు? వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? ఇప్పటివరకూ ఎంతమంది అర్బన్‌ నక్సల్స్‌ అరెస్టు చేయబడ్డారు? వారిలో ఎంత మంది దోషులుగా నిర్ధారించబడ్డారు? వారిని నియంత్రించడానికి భారత ప్రభుత్వం ఎప్పుడైనా ప్రయత్నించారా? అయితే, ఎప్పుడు? అనే ప్రశ్నలను కేంద్ర హౌం శాఖపై సంధించింది. వీటిపై స్పష్టత ఇవ్వాలని ‘ఇండియా టుడే’ తన దరఖాస్తులో పేర్కొన్నది. అలాగే ‘తుక్డే- తుక్డేగ్యాంగ్‌” అంటే ఎవరని మరో దరఖాస్తులో ప్రశ్నించింది.

ఈ రెండు పదాలపై సరైన వివరణ కావాలని కోరింది.
వీటిపై ఆర్టీఐ స్పందిస్తూ.. తగిన సమాధానం ఇవ్వడానికి దరఖాస్తును సంబంధిత శాఖలకు బదిలీ చేస్తున్నామనీ, తర్వలోనే సమాధానం వస్తుందని సంబంధిత అధికారులు యోగేశ్‌ మోహన్‌ దీక్షిత్‌ సంతకం ఇచ్చారు.

గతేడాది డిసెంబర్‌18 న జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ‘అర్బన్‌ నక్సల్స్‌’ అంటూ విరుచుకుపడ్డారు. అంతకుముందు నవంబర్‌ 16న కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని అర్బన్‌నక్సల్స్‌పై, జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులపై నియంత్రణ చర్యలు చేపడుతామని హెచ్చరించారు. ఇటీవల ఢిల్లీ ఎన్నిక ప్రచారంల్లో బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ మాట్లాడుతూ.. ”ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అర్బన్‌ నక్సల్‌కు ఉదాహరణ” అని ఆరోపించారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కేంద్రం విద్వేషాలను సృష్టిస్తున్నది..

Courtesy Nava Telangana