ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రపంచ దేశాలు ఎన్నో చర్యలు చేపడు తున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి 155 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మృతుల సంఖ్య బుధవారం నాటికి 8,092కు పెరిగింది. కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 2 లక్షలకు దాటింది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యూరప్‌ కేంద్రంగా వేగంగా విస్తరిస్తోంది. యూరప్, తూర్పు ఆసియా దేశాలు ఎక్కువగా కరోనా ముప్పు ఎదుర్కొంటున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేసేందుకు భారీ స్థాయిలో డబ్బు ఖర్చు పెడుతున్నాయి. ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంతో పాటు ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో దేశాలు కుదేలవుతున్నాయి.

మీడియా సమాచారం ప్రకారం కరోనాపై పోరుకు పెద్ద ఆర్థికవ్యవస్థలు కలిగిన దేశాలు దాదాపు 200 బిలియన్ డాలర్లు వెచ్చించేందుకు ముందుకు వచ్చాయి. భారత దేశం 3.5 బిలియన్ల డాలర్లను స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కు కేటాయించింది. ఇటలీ 28.3, ఐరోపా సమాఖ్య 27.86, చైనా 16. 7, యూకే 15.3, థాయ్ లాండ్ 12.7, ఆస్ట్రేలియా 11.4 అమెరికా 8.3 బిలియన్ డాలర్లను కేటాయించినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి.