• ఉత్తర్వులు జారీ చేసి నాలుగు నెలలు
  • ఇంకా చైర్మన్‌, డైరెక్టర్ల నియామకం నో
  • రెగ్యులర్‌ ఎండీ లేకున్నా సంస్కరణ పథం
  • ఇబ్బందులు తప్పవంటున్న కార్మిక వర్గాలు
  • ఆర్టీసీకి సంబంధించి తీసుకునే నిర్ణయాలను తొలుత టీఎ్‌సఆర్టీసీ బోర్డులో చర్చిస్తారు. అవసరమైన మేరకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. కానీ, ఇప్పుడు బోర్డు లేదు. బోర్డు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసినా పూర్తిస్థాయి కమిటీని నియమించలేదు. రెగ్యులర్‌ ఎండీ కూడా లేరు. ఇటువంటి పరిస్థితుల్లోనే, సగం బస్సులను ప్రైవేటుకు అప్పగిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. టీఎ్‌సఆర్టీసీ బోర్డు అనుమతి లేకుండా కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చా? అవి చెల్లుబాటు అవుతాయా? అనే సందేహాలను కార్మిక వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత, 27 ఏప్రిల్‌ 2016న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ)ను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అప్పట్లో రామగుండం ఎమ్మెల్యేగా ఉన్న సోమారపు సత్యనారాయణను చైర్మన్‌గా నియమించింది. కమిటీ పదవీ కాలం ముగిసిన తర్వాత బోర్డును పునరుద్ధరించలేదు. దీని ఏర్పాటుకు 4 జూలై 2019న ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇందులో చైర్మన్‌ ను, మరో 12 మంది వివిధ శాఖల అధికారులను డైరెక్టర్లుగా నియమిస్తారు. ఉత్తర్వు వెలువరించి నాలుగు నెలలు అవుతున్నా, నామినేటెడ్‌ పోస్టుగా ఉండే చైర్మన్‌ పదవిని కూడా భర్తీ చేయలేదు. ఆర్టీసీకి పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ కూడా లేరు. దాంతో, బోర్డు సమావేశాలూ జరగడం లేదు. బోర్డు ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. అద్దె బస్సుల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తుండడంతో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముందని కార్మికులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు కేబినెట్‌ నిర్ణయాలు తీసుకున్నా.. బోర్డు ఏర్పడిన తర్వాత దాని ఆమోదం తీసుకుంటే సరిపోతుందని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.

Courtesy Andhrajyothy…