* ఎన్నికల తర్వాత కనుమరుగు
* రాజకీయ సన్యాసమా? వ్యూహమా?
* వైసిపిలో చేరతారనే ప్రచారం!

నెల్లూరు: టిడిపి ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి అత్యంత సన్నిహితులుగా పేరు తెచ్చుకున్న ప్రముఖ నారాయణ విద్యాసంస్థల అధినేత పొంగూరు నారాయణ ఇప్పుడు ఎక్కడున్నారు. ఏమైపోయారు. ఇదే రాష్ట్రంలో రాజకీయాలను నిశితంగా పరిశీలించే వ్యక్తులను, నెల్లూరు జిల్లా ప్రజలను వేధిస్తోన్న ప్రశ్న. జిల్లా ప్రజలకే కాదు ఆ పార్టీ ముఖ్య నేతలకూ అందుబాటులో లేకుండాపోయారు.

గత ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన అజ్ఞాతవాసం వెనుక రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది. తన వియ్యంకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి బిజెపిలో చేరుతారని కొద్ది రోజులు ప్రచారం సాగింది. ఇప్పుడు వైసిపి తీర్థపుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. ప్రజా నాయకులు ఎన్నికలతో సంబంధం లేకుండా ఓడినా, గెలిచినా ప్రజలతోనే ఉంటారు. కార్పొరేట్‌ రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తారు. విజయం సాధిస్తే తమ హోదాను వ్యాపారాలను కాపాడుకోడానికి అడ్డం పెట్టుకుంటారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు.

ట్యూషన్‌ మాస్టర్‌ నుంచి మంత్రి వరకు..
టిడిపి ఓడిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యాపారవేత్తలు సుజనా చౌదరి, సిఎం రమేష్‌ వంటి వ్యక్తులు బిజెపిలో చేరారు. మరికొందరు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోడానికి అధికారంలోని రాజకీయ పార్టీలో చేరాలనే ఆలోచనతో నారాయణ ఉన్నట్లు ప్రచారం జరుగుతోది. ఆయన దేశంలోని పది రాష్ట్రాల్లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ఏడాదికి రూ.2,500 కోట్లు విద్యా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. 25 ఏళ్ల నుంచి విద్యా వ్యాపారంలో ఉంటూ కోట్ల రూపాయలకు పడగెత్తారు. ట్యూషన్‌ మాస్టర్‌ నుంచి మంత్రి వరకు ఎదిగారు. టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై విమర్శలు చేసేవారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలపై ఆ పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నారాయణకు, వైసిపి పెద్దల మధ్య సయోధ్య కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసం పెద్ద మొత్తంలో పార్టీకి నిధి ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది.

టిడిపికి తెరవెనుక ఆర్థిక సహకారం అందిస్తూ వచ్చిన నారాయణకు చంద్రబాబునాయుడు 2014 ఎన్నికల ఎన్నికల్లో ఉభయగోదావరి, ఉత్త్తరాంధ్ర జిల్లా బాధ్యతలు అప్పగించారు. భారీ మొత్తంలో ఖర్చుపెట్టి ఎక్కువ స్థానాలు సాధించడానికి నారాయణ కృషి చేశారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో నారాయణకు చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. నూతన రాజధాని నిర్మాణంలో కీలక బాధ్యతలు ఆయనకే అప్పగించారు. సింగపూర్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు, 33 వేల ఎకరాల భూ సమీకరణలో నారాయణ కీలకపాత్ర పోషించారు. మంత్రిగా ఉన్న సమయంలో రెండేళ్ల కాలంలోనే నెల్లూరు నగరానికే రూ.5,500 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఏ అజెండాతో ఏ జెండా పట్టుకొని భవిష్యత్తులో కనిపిస్తారో వేచి చూడాల్సిందే.

Courtesy Prajasakti