• ఇంకెంతకాలం ఇలా కొనసాగిస్తారు
  • వారంలోగా చెప్పండి: హైకోర్టు

హైదరాబాద్‌ : చైర్‌పర్సన్‌ లేకుండా రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఇంకెంతకాలం కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. ఎప్పుడు నియమిస్తారో వారం రోజుల్లో చెప్పాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితోకూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.  చైర్‌పర్సన్‌ పదవీ కాలం ముగిసి రెండేళ్లు గడిచినా కొత్త చైర్‌పర్సన్‌ను నియమించకపోవడంపై సామాజిక కార్యకర్త రేగులపాటి రమ్యారావు.. ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. చైర్‌పర్సన్‌ లేకపోవడంతో కమిషన్‌ ముందు 46 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు.

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ టి.వెంకట రత్నం 2018 జూలైలో పదవీ విరమణ చేసిన తర్వాత రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నియమించాలంటూ జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నియామకానికి ఇంకా ఎంతకాలం పడుతుందో వారం రోజుల్లో చెప్పాలని ఆదేశించింది. ఈ కేసులో ఎమికస్‌ క్యూరీగా న్యాయవాది వసుధా నాగరాజ్‌ను కోర్టు నియమించింది.

Courtesy Andhrajyothi