• సోమవారం ప్రారంభోత్సవమన్నారు
  • అంతలోనే దాన్ని వాయిదా వేశారు
  • రోగులకు సమాచారమిచ్చి వెనక్కి!
  • ఆస్పత్రి చుట్టూ పోలీసు బందోబస్తు
  • మంత్రి వస్తున్నారంటూ హడావుడి
  • క్వారంటైన్‌ వారిని రప్పించే యత్నం
  • 3 రోజుల్లో ప్రారంభించే అవకాశం?

మియాపూర్‌ : కొవిడ్‌ రోగుల కోసం గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్‌ ఆస్పత్రి ప్రారంభోత్సవంపై అయోమయం నెలకొంది. ఆ ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఇప్పటికే 3 నెలలు దాటింది. ఆదివారం సాయంత్రం టిమ్స్‌ ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ డైరెక్టర్‌ విమల థామస్‌ ఆధ్వర్యంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఓఎ్‌సడీ, వ్యక్తిగత కార్యదర్శి, పీఏతోపాటు ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బందితో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ నివేదికను మంత్రికి ఇవ్వడంతో సోమవారం ఆస్పత్రిని ప్రారంభించడానికి ఆదేశాలు జారిచేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గ వైద్యాధికారితో పాటు అక్కడ పనిచేస్తున్న వైద్యాధికారులకు జిల్లావైద్య అధికారి స్వరాజ్యలక్ష్మి ఆదివారం రాత్రే ఆదేశాలిచ్చారు. మంత్రి వస్తున్న నేపథ్యంలో.. కరోనా పాజిటివ్‌ వచ్చి హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి సమాచారమిచ్చి వారిని ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. దీంతో సోమవారం పొద్దుటికల్లా టిమ్స్‌ ఆస్పత్రికి రావాలంటూ హోంక్వారంటైన్‌లో ఉన్న 50 మందికి సమాచారం అందించారు. వారంతా ‘ఆస్పత్రికి వెళ్లబోతున్నాం. అక్కడే వైద్యుల సంరక్షణలో ఉండొచ్చు’ అని ఆనందించారు. కానీ, సోమవారం ఉదయాన్నే అధికారులు వారి ఆశలపై నీళ్లుజల్లారు. ‘ఆస్పత్రి ప్రారంభోత్సవం ఈరోజు లేదు. మళ్లీ ఎప్పుడు రావాలో మేమే చెప్తాం.’ అంటూ ఫోన్‌లో చెప్పేసరికి నిరాశకు గురయ్యారు. అంతేకాదు.. సోమవారం ఆస్పత్రి చుట్టూ పోలీసు బందోబస్తుతో హడావుడి చేశారు.

అసలేం జరిగింది?
మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల టిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు ఆస్పత్రి ఇన్‌చార్జిగా ఉన్న నాగేందర్‌ స్థానంలో డైరెక్టర్‌ ఇన్‌చార్జిగా ప్రొఫెసర్‌ విమలథామ్‌సను నియమించారు. అప్పటి వరకూ డిప్యూటేషన్‌పై ఉన్న వైద్యాధికారుల స్థానంలో 70 మంది వైద్యబృందంతో పాటు 210 మంది నర్సులను తీసుకున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌, వైద్యపరీక్షలు నిర్వహించే సిబ్బంది విషయంలో కొంత జాప్యం జరిగింది. ఆస్పత్రి రోగులకు కావాల్సిన డైట్‌ కేంద్రం, శానిటేషన్‌ సిబ్బంది నియామకం, ఎమర్జెన్సీ వాహనాల విషయంలో స్పష్టత లేదు. కాగా.. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారం స్వల్పలక్షణాలున్న రోగులు ఇంటివద్దనే చికిత్స పొందవచ్చు. కానీ, ప్రారంభోత్సవానికి మంత్రి వస్తున్న నేపథ్యంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఫోన్లు చేసి రమ్మన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Courtesy Andhrajyothi