తెనాలి : నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు పరచడం హర్షణీయమని, ఆయేషా మీరా తల్లి సంషాద్‌ బేగం అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నిర్భయ నిందితులు నలుగురినీ ఉరి తీసిన విషయం తెలిసిందే. దీనిపై.. ఇబ్రహీంపట్నంలో 13 ఏళ్లక్రితం హత్యకు గురైన తెనాలికి చెందిన బీఫార్మసీ విద్యార్థిని తల్లి సంషాద్‌ బేగం గుంటూరు జిల్లా తెనాలిలో విలేకరులతో మాట్లాడారు. నిర్భయ తల్లికి ఎట్టకేలకు ఊరట లభించిందని, తన కుమార్తె ఆత్మకు ఎప్పటికి శాంతి చేకూర్చుతారో ప్రభుత్వమే బదులివ్వాలని డిమాండ్‌ చేశారు. నిర్భయ తల్లి జరిపిన అవిశ్రాంత న్యాయ పోరాటం తన వంటి తల్లులకు స్ఫూర్తిదాయకమని, ఆమెకు చేతులెత్తి మొక్కుతున్నానని చెప్పారు.  తన కుమార్తె ఆయేషామీరా హత్య కేసులో 13 ఏళ్లు దాటిపోతున్నా ఇంకా నిందితులనే గుర్తించలేకపోయారని, నిర్భయ వంటి చట్టాలు ఎన్ని వచ్చినా రాజకీయ జోక్యం ఉంటే ఏ కేసూ తేలదనే అభిప్రాయానికొచ్చామని తెలిపారు. నిర్భయ సంఘటన తర్వాత దేశంలోనే కాక తెలుగు రాష్ట్రాల్లో అనేక సంఘటనలు జరిగాయని, దిశ వంటి చట్టాలు కూడా తర్వాత పుట్టుకొచ్చాయని, ఎన్ని చట్టాలు వచ్చినా అమలులో చిత్తశుద్ధి లోపిస్తే ఈ చట్టాలేవీ అబలకు ఆలంబన కావని చెప్పారు. నేడు న్యాయ వ్యవస్థ గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ, నిర్భయ కేసు సాగదీతలో వైఫల్యాలు కనిపిస్తున్నాయన్నారు. ముఖ్యంగా న్యాయవాదులు.. అటువంటి కరడుగట్టిన నేరస్తులకు అండగా నిలవటం సిగ్గుచేటని, ఇలాంటి కేసులలో దోషులకు అనుకూలంగా వాదించొద్దని కోరారు. మైనారిటీ కావటంవల్లే తమకు నేటికీ న్యాయం జరగలేదని సంషాద్‌ బేగం ఆరోపించారు. ఉన్మాది డబ్బున్నవాడయితే, అతడిని ఈ చట్టాలు ఏమీ చేయలేవని అన్నారు.

Courtesy Andhrajyothi