అమెరికా పర్యటనతో దేశానికి దక్కిందేంటి?
ఇరు దేశాల మధ్య ఎక్కడి సమస్యలు అక్కడే.
నిరాశతో వెనుదిరిగిన పియూష్‌ గోయల్‌
ఆర్థికమాంద్యం దెబ్బతో ముందుకురాని అమెరికా కంపెనీలు
హౌడీ-మోడీ, ఐరాసలో భారత ప్రధాని మోడీ ప్రసంగాలు, అధ్యక్షుడు ట్రంప్‌తో దోస్తానా…భారతదేశానికి ఏమైనా మేలు చేసిందా? ఇరు దేశాల మధ్య కొత్త వాణిజ్య ఒప్పందం కుదిరిందా? కనీసం స్తంభించిన వర్తక వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయా? అని ప్రశ్నించుకుంటే…లేదనే సమాధానం వస్తోంది. అమెరికాలోని ప్రఖ్యాత కంపెనీల సీఈఓలు, వాణిజ్య ప్రముఖులు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి అనాసక్తి చూపారనీ, మనదేశ ఆర్థికమాంద్యం వారిని వెనకడుగు వేసేలా చేసిందనీ ప్రముఖ ఆంగ్ల దినపత్రికల్లో కథనాలు వెలువడ్డాయి.
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఆసాంతం భారతీయ మీడియాలో మారుమ్రోగింది. అమెరికాలో ప్రధాని విమానం దిగిన దగ్గర్నుంచీ…ఢిల్లీకి చేరేంతవరకు ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. మేమిద్దరమూ మంచి స్నేహితులమని ప్రధాని మోడీ- అధ్యక్షుడు ట్రంప్‌ తెలియజేశారు. ఒకర్నొకరు పొగుడుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో పెద్దగా పురోగతి లేదని అక్కడా, ఇక్కడా కొన్ని పత్రికలు వార్తా కథనాలు పేర్కొన్నాయి. ప్రఖ్యాత కంపెనీల సీఈఓ, వ్యాపారవేత్తలతో జరిగిన సమావేశాలు పెద్దగా ఫలించలేదన్న సంగతి పలువురు పాత్రికేయ ప్రముఖులు తమ విశ్లేషణల్లో తెలిపారు.
ఈ విషయాల్ని భారత్‌లోని చాలా కొద్ది పత్రికలు, టీవీ ఛానల్స్‌ మాత్రమే తెలిపాయట. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్‌ గోయల్‌ తీవ్ర నిరాశతో తిరిగివచ్చారని వార్తా కథనాలు వెలువడ్డాయి. భారతదేశంలో నెలకొన్న తీవ్ర ఆర్థికమాంద్యం అక్కడి కంపెనీలను ఆందోళనకు గురిచేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీడియా విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
వెల్‌ పొలిటికల్‌ ప్లాన్డ్‌…
ప్రధాని మోడీ, ట్రంప్‌ ఇరువురి రాజకీయ ప్రచారం (వెల్‌ పొలిటికల్‌ ప్లాన్డ్‌) కోసం జరిగిన కార్యక్రమాలుగా అమెరికా మీడియా ప్రవర్తించింది. అందుకే ఆయా కార్యక్రమాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వాస్తవానికి ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. భారత్‌లో నెలకొన్న ఆర్థికమాంద్యం, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో భారత్‌ ర్యాంక్‌ పడిపోవటం అక్కడి కంపెనీలను ముందడుగు వేయనీయలేదని సమాచారం. ప్రధాని మోడీ, పియూష్‌ గోయల్‌ స్వయంగా కలిసినప్పటికీ అక్కడి కంపెనీలు మనదేశంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.
తాను అధికారంలో వచ్చాక విదేశాల్లో, అందునా అమెరికాలో భారత్‌ ప్రతిష్ట పెరిగిందని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. అయితే వారం రోజుల తన పర్యటనతో ప్రధాని భారతదేశానికి చేకూర్చిన లబ్ది ఏంటి? ఇరు దేశాల వాణిజ్య సంబంధాలు మెరుగుపడ్డాయా? అని మీడియా కథనాల్లో పలువరు ప్రముఖులు ప్రశ్నలు లేవనెత్తారు. మనదేశంలోని సగటు పౌరుడిలోనూ ఇదే సందేహం వ్యక్తమవుతోందనీ, కాకపోతే దీనిని మీడియా చేస్తున్న అతి ప్రచారం తొక్కిపెడుతోందని వారు అన్నారు

Courtesy Navatelangana