by: Mohammad Alamullah 

జామియా విద్యార్థులు,ఫ్యాకల్టీపై ఢిల్లీ పోలీసుల కర్కశత్వాన్ని కొన్ని మీడియా ఛానెళ్లు రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. బలప్రయోగంతో క్యాంపస్ లోకి ప్రవేశించిన పోలీసులు జామియా విద్యార్థులు, ఫ్యాకల్టీని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఆ సమయంలో క్యాంపస్ లోపలే ఉన్న నేను,అక్కడేం జరిగిందో అందరికీ చెప్పాలనుకుంటున్నాను.

Police detain an injured student outside Jamia Millia Islamia university on Sunday night
Police detain an injured student outside Jamia Millia Islamia university on Sunday night

నిజానికి విద్యార్థుల నిరసనలు మధ్యాహ్నం సమయానికే ముగిసిపోయాయి,ఆతర్వాత మేమంతా లైబ్రరీలో చదువుకుంటున్నప్పుడు హఠాత్తుగా అరుపులూ,బుల్లెట్ శబ్దాలూ వినిపించాయి. బయటికెళ్లి చూసిన మాకు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న పోలీసులు కనిపించారు. జామియాలో విద్యుత్ సరఫరా నిలిపివేసి మహిళలతో సహా విద్యార్థులందరిపైనా అత్యంత అమానవీయంగా దాడికి పాల్పడ్డారు.

క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది, కొంతమంది విద్యార్థులు భయంతో మసీద్ లోనూ,లైబ్రరీలోనూ తలదాచుకున్నారు. నిరాయుధులైన విద్యార్థులు క్యాంటీన్లో ఉన్న సాల్ట్ వాటర్ ని తమ రక్షణకై ఉపయోగించారు.

కాసేపటికి పరిస్థితులు మరింత దిగజారడంతో సుమారు రెండొందల కెపాసిటీ ఉన్న లైబ్రరీలో అప్పటికే చాలామంది పోగవడంతో కదలడం,శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. లైబ్రరీలో లైట్లన్నీ ఆఫ్ చేసి,కిటీకీలూ,తలుపులకి కుర్చీలు అడ్డుపెట్టాం.

బుల్లెట్ ఫైరింగ్ శబ్దాలూ,మహిళా విద్యార్థుల ఆర్తనాదాలూ,రక్తం మరకలు,గాయపడిన శరీరభాగాలతో ఆ ప్రదేశమంతా భయంకరంగా మారింది.

లైబ్రరీలో రీడింగ్ సెక్షన్ బయట నిల్చున్న కొంతమంది విద్యార్థులు లోపల టియర్ గ్యాస్ ప్రయోగించడం వల్ల ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్న తమ సహ విద్యార్థుల కోసం ప్రార్థించసాగారు.దాదాపు మృత్యువు దగ్గరికి వెళ్లొచ్చినట్టే అనిపించింది. కొంతసేపటికి సీఆర్పీఎఫ్ బలగాలు తలుపులు బద్దలు కొట్టుకుని లైబ్రరీలోకి ప్రవేశించారు. లోపల ల్యాప్ ట్యాప్స్,బుక్స్ అన్నీ నేలపై చిందరవందరగా పడున్నాయి. వాళ్లు మమ్మల్ని లాఠీలతో కొడుతూ,చేతులు పైకెత్తి నిల్చొమ్మని చెప్పారు. అదే పొజిషన్లో మా అందర్నీ లైబ్రరీ బయటకి తీసుకొచ్చి ఆ చీకట్లో దారిపొడవునా బూతులు తిడుతూ నడిపించారు. రాళ్లతో దాడి చేసామంటూ మాపై విరుచుకుపడ్డారు. వాళ్ల మొహాల్లో మాపై కూడగట్టుకున్న ద్వేషమంతా స్పష్టంగా కనిపించింది‌.

ఆ కర్ఫ్యూ సిచ్యుయేషన్లో జొలీనా అనే ప్రాంతం దగ్గర మమ్మల్ని వదిలిపెట్టారు.పోలీసులు కొన్ని ఇటుక ముక్కలు అక్కడ చిందరవందరగా చల్లి విద్యార్థులే వాటితో వారిపై దాడికి ప్రయత్నించినట్టుగా చిత్రీకరించారు. ఇంకా మాకు ఫైరింగ్ శబ్దాలు వినిపిస్తున్నాయి. మెట్రో కూడా నిలిపివేయడంతో హాజీ కాలనీ వరకూ నడుచుకుంటూ వెళ్లాం. మా తోటి మహిళా విద్యార్థులని సురక్షితంగా ఇళ్లకి చేర్చాము.

ఇండ్లకి చేరుకునేసరికి అర్థరాత్రి అయ్యింది. జరిగిన సంఘటనలు అసలెలా వ్యక్తీకరించాలో కూడా అర్థం కాలేదు. పోలీసులు మసీదుపై,అందులో ప్రార్థనలు చేస్తున్న వారిపై కూడా దాడి చేసారు. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఒకే ఒక్క సాయంత్రంలో జామియా పూర్తిగా మారిపోయింది.

సుమారు వంద టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించబడ్డాయి,పలు రౌండ్ల ఫైరింగ్ జరిగింది. గేట్ల దగ్గర ఉండే గార్డులని కాళ్లూ,చేతులూ విరిగేంతలా కొట్టారు‌. జామియా లోపల మసీదు యొక్క పగిలిన కిటికీ అద్దాలు,తలుపులూ,ముసాల్లాలపై పడ్డ రక్తపు మరకలే ఆ వ్యథని తెలియజేస్తున్నాయి.

జామియా విద్యార్థులతో పోలీసుల ప్రవర్తన అత్యంత అమానవీయంగా ఉంది. ప్రతీ గంటా చాలా భయంకరంగా గడిచింది. నిరాయుధులైన విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసారు. ఈ సంఘటన నుంచి మేమిప్పుడప్పుడే కోలుకోలేము. ఆ తర్వాత మా సహ విద్యార్థులలో కొందరిని పోలీసులు డీటైన్ చేసారనే సమాచారాన్ని మాకు తెలియజేసారు. వాళ్లు ఎక్కడున్నారో ప్రస్తుతం మాకు తెలీకపోయినా  సురక్షితంగానే ఉండాలని ఆశిస్తున్నాం.