కొద్ది నెలల క్రితం ‘డెక్కన్‌ హెరాల్డ్‌’ పత్రికలో ఒక భయానక వార్త వచ్చింది. 2017లో బెంగళూరు చుట్టు పక్కల ఉన్న పట్టణ జిల్లాలలోని దళితులపై 210 దాడులు, గ్రామీణ జిల్లాలలో 106 దాడులు జరిగినట్లు అందులో పేర్కొన్నారు. కేరళలో జూన్‌ 2016 నుంచి ఏప్రిల్‌ 2017 మధ్య 883 దాడులు జరిగాయి. 2007-2017 మధ్య 10 సంవత్సరాలలో దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు 66 శాతం పెరిగినట్లు అదే వార్తా కథనంలో పేర్కొన్నారు. 
ఈ గణాంకాలలో భీతిగొల్పే అంశాలను, నిర్దిష్ట సంఘటనలను పరిశీలిస్తే మరో విషయం బోధపడుతుంది. ఇదే సంవత్సరం ఏప్రిల్‌ 12న 200 మంది దళితులపై మూకదాడికి పాల్పడ్డారు. అందుకు కారణం కర్ణాటక లోని భద్రా నదిలో దళితులు ఈత కొట్టడం. దాడి చేసిన వారు పెద్దగా అరుస్తూ ఈ నది కేవలం అగ్ర కులాలదేనని ప్రకటించారు. దాన్ని బట్టి చూస్తే రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 15 అది అచ్చయిన పేపరు విలువకు కూడా సరితూగదని అర్థమవుతోంది.
ఈ సామాజిక హింస అనేది ప్రత్యేకించి అమాయకులైన కొన్ని కులాల వాళ్ల పైనే జరగడానికి వెనుక ఉన్న ఆలోచనలను మనం అర్థం చేసుకోవాలి. ఈ దాడులు, దౌర్జన్యాలు… భూమి, కూలి, భూమిపై యాజమాన్య హక్కు, పేదరికం, అధికారం లేకపోవడం అనే మౌలిక సమస్యల చుట్టే తిరుగుతాయని తెలుస్తోంది.
ఈ వివరణలు దిగువ స్థాయికి చేరవు. ఎందుకంటే దాడులకు మూలం అయిన బ్రాహ్మణవాదాన్ని వీటిలో మరుగు పరుస్తారు. డా||బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రధానంగా ఈ అంశాన్ని ఎత్తి చూపేవారు. బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా ఒక బలమైన ఉద్యమం అవసరాన్ని నొక్కి చెప్తూ ఇది జరగకుండా దళితుల విముక్తి అసాధ్యం అని వాదించేవారు. నిర్దిష్టంగా మనం దేన్ని వ్యతిరేకిస్తున్నాం? బ్రాహ్మణవాదం లోని మౌలిక అంశాలు ఏంటి?

బ్రాహ్మణ వ్యతిరేకత కాదు
బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించడం అంటే బ్రాహ్మణ వ్యతిరేకత కాదు. ఈ ఆలోచనను కొనసాగిస్తే బ్రాహ్మణులందరూ ఈ దాడులకు బాధ్యత వహించాల్సి వస్తుందనే వరకూ పోతుంది. మరో రకంగా చెప్పాలంటే ముస్లింలందరిని నేరస్తులని, తప్పులు చేసే వారని, అల్లా ఉద్దీన్‌ ఖిల్జీ కాలం నుండి జరుగుతున్నదని, జలియన్‌వాలా బాగ్‌ కాల్పులకు బ్రిటీష్‌ వారందరూ కారకులని, అమాయక ముస్లింల మీద జరుగుతున్న మూక దాడులకు హిందువులందరూ కారణం అనే వరకు పోతుంది. దాడులకు అందరి బాధ్యత వుంటుందనే మోటు వాదనకు మనం గురి కాకూడదు. కుల ఆధారిత సమాజంలో, బ్రాహ్మణ కులంలో పుట్టిన వ్యక్తి బ్రాహ్మణవాదం లోని మౌలిక అంశాలను పాటించక పోవచ్చు. నైతికంగా, మానసికంగా వాటి నుండి తెగదెంపులు చేసుకోవచ్చు కూడా! మను స్మృతిని తగులబెట్టి, తద్వారా బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలని అంబేద్కర్‌, జి.ఎస్‌ సహస్ర బుద్దే (చిట్‌పవన్‌ బ్రాహ్మణుడు) తీర్మానించుకున్నారు.
అయితే అంబేద్కర్‌ మరింత ముందుకు పోయారు. జి.ఐ.పి రైల్వే లోని అణగారిన కులాల కార్మికుల మహాసభ (1938) లో మాట్లాడుతూ ‘బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించాలిగాని… ఒక సామాజిక తరగతిగా వారికి అందుతున్న సౌకర్యాలు, అవకాశాలు, హక్కులను వ్యతిరేకించడం కాదు. ఇది చూడటానికి విచిత్రంగా ఉంటుంది. అయితే బ్రాహ్మణులకు ఒక సామాజిక తరగతిగా వుండే అధికారాలను, సౌకర్యాలను వారి ప్రయోజనాలను కాపాడటం కంటే బ్రాహ్మణవాదం ఏం చేస్తుంది? వాస్తవానికి ఈ మాటలు కలవరపరిచేవిగా వుంటాయి.
చరిత్ర లోని ఒక అంశాన్ని తీసుకుని పరిశీలిద్దాం. రుగ్వేద కాలం (1500 బి.సి)లో కర్మకాండలను ఒక తరం నుండి మరో తరానికి చేరవేసే పండితుల బృందం వుండేది. సాధారణ కుటుంబాల వారికి, పాలక వర్గాలకు చెందిన రాజకీయ నాయకులకు ఈ విషయాలపై పరిజ్ఞానం వుండేది కాదు. ఈ బృందం లోని బ్రాహ్మణులకు ఉన్న విజ్ఞానానికి గుర్తింపుగా సమాజంలో కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించేవారు. ఇతర సామాజిక తరగతుల వారి మతపరమైన అవసరాలను నెరవేర్చుతున్నందుకు వీరికి సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది. తద్వారా అసమానతలు సృష్టించబడ్డాయి. అంతస్తులవారీ ఏర్పడిన నిర్మాణం మాత్రం అస్థిరంగా, అనిశ్చితమైనదిగా, వెనక్కి నెట్టేదిగానే ఉంది. బ్రాహ్మణులు సామాజిక వ్యవస్థలో అధికులుగా సృష్టించబడిన పరిస్థితి అనిశ్చితంగా ఉంటూ ఇతరులను కించపరచకుండానే తన ఆధిక్యతను కాపాడుకుంటున్నది. వైదిక బ్రాహ్మణవాదం దానధర్మాలు, త్యాగాల చుట్టూ అల్లబడినది. అంబేద్కర్‌ నిరసించి, ధ్వంసం చేయాలన్న బ్రాహ్మణవాదాన్ని దీనినీ మిళితం చేయకూడదు. వీటిని ఒకేలా చూపే ప్రయత్నాన్ని అంగీకరించరాదు.

india, Constitution, Brahmanism, Ambedkar,dalits, inequality, untouchables, ati sudra

లోతైన సంప్రదాయ సిద్ధాంతం
అసలు బ్రాహ్మణవాదం అంటే ఏంటి? ఇది ఒక సామాజిక, రాజకీయ సిద్ధాంతం. దీని నిర్మాణంలో గతం గురించిన ఆదర్శవాద జ్ఞాపకం, భవిష్యత్తు గురించిన దార్శనికత ఉంటుంది. అందులో బ్రాహ్మణులు కేవలం ఆధ్యాత్మిక అంశాల లోనే అగ్రస్థానం కాకుండా ప్రపంచంలో ఆచరణాత్మకమైన ప్రతి అంశానికి సంబంధించిన పరిజ్ఞానం, విజ్ఞత వారికే ఉన్నదని తెలియజేస్తుంది. ఒక సుసంపన్న, సుస్థాపిత సమాజం ఎలా ఉండాలో దాని గురించి, సుపరిపాలన అందించే అత్యున్నత పరిజ్ఞానం వారికే ఉన్నది, సమాజంలో వారికున్న అగ్రస్థానం, వారికున్న అత్యున్నత పరిజ్ఞానం వారికి పుట్టుకతో వచ్చిందనేది చాలా కీలకమైన అంశం. ఈ గుణాల వలన వారు ప్రకృతి సిద్ధంగానే సహజ శక్తి గలవారుగా ఉంటారని, వారు ఒక ప్రత్యేక జాతి అని భావింపబడతారు. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. సవాలు చేయలేరు. బ్రాహ్మణులుగా పుడతారు తప్ప తయారు చేయలేం.
ఈ జన్మలో చేసినదాన్నిబట్టి మరో జన్మలో మనిషి ఆక్రమించే స్థానం నిర్ధారణ అవుతుంది తప్ప ఈ జన్మలో దాని ప్రభావం ఉండదు. ఇది ఒక బ్రాహ్మణులలోనే కాదు అన్ని కులాలకు వర్తిస్తుంది. ఏ కులం వారు ఏ పని చేయాలనేది పుట్టుకతోనే నిర్ణయించబడుతుంది. అతి శూద్రులు, అంటరాని వారు దిగువ నుంచి పుట్టుక తోనే అతి హీనమైన స్థానంలో ఉండాలి. తను చేసే ప్రయత్నం వలన కూడా ఆయన స్థానాన్ని మార్చడానికి వీలు లేదు. ఈ సామాజిక, రాజకీయ సిద్ధాంతం నిచ్చెన మెట్ల సిద్ధాంతాన్ని పటిష్టపరుస్తూ, కఠినమైనదిగా, మార్చలేనిదిగా రూపుదిద్దింది.
అమలు జరుగుతున్న నిచ్చెన మెట్ల సిద్ధాంతం సహజంగానే ఉన్నట్లు కనపడుతుంది. ఏ ఒక్కరూ కూడా తన స్థానాన్ని మార్చుకోవడానికి వీలుండదు. పైకి గాని కిందికి గాని మారడానికి వీలుండదు. మారడానికి ప్రయత్నించినా అది నైతికంగా తప్పు. దళితులు బ్రాహ్మణవాదం దృష్టిలో వాళ్ల స్థానం లోనే ఉండాలి. వారు తమ స్థానాన్ని మెరుగుపర్చుకునే ప్రయత్నం చేస్తే అణచివేయాలి.
బ్రాహ్మణవాదం అనేది కరుడుగట్టిన సాంప్రదాయకమైన, యథాతథ స్థితిని కోరుకునే సిద్ధాంతం. ఉన్నత కులాలోని వారు తమ సౌకర్యాలు, సామాజిక హోదా, అధికారం శాశ్వతంగా ఉండాలనుకునే వారికి సంబంధిం చింది. ఈ సిద్ధాంతం అసంబద్ధమైనదైనా భారతదేశంలో నలుమూలలకు పాకింది. ప్రపంచంలో కూడా విస్తరించి చాలా కాలంగా ఉండగలుగుతున్నది. అగ్ర కులాల వారు ఇతర మత భావాలను, ప్రపంచ దృక్పథాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించరు. దీని అర్థం ఏమిటంటే బ్రాహ్మణ బుద్దిస్టులు, జైనులు ఉండవచ్చు. ఇస్లాం లేక క్రైస్తవం లోకి మతం మార్చుకున్న వారు కూడా ఇదే విధానాన్ని పాటిస్తున్నారు. దళిత ముస్లింలను, క్రిస్టియన్లను న్యూనతా భావంతో చూసే ముస్లింలు, క్రైస్తవులు…మరో అర్థంలో బ్రాహ్మణులు లేక ఠాకూర్లు అవుతారు.
బ్రాహ్మణవాదం అమలులో ఉన్న అధికారం, సౌకర్యాలు ఉన్నత స్థానాన్ని సహజమైనదిగా చూపెడుతుంది. రాజులు దీన్ని ప్రేమిస్తారు. ధనవంతులైన వ్యాపారులు, భూస్వాములకు ఇది సంతోషాన్ని కలిగిస్తుంది. అతి శూద్రుల మీద పెత్తనం వహించడానికి శూద్రులకు ఈ సిద్ధాంతం అవకాశం కల్పిస్తున్నందున వారు కూడా ఏకీభవిస్తున్నారు లేక ఒత్తిడికి లొంగిపోతున్నారు. ఎందుకంటే వీరి కింది వారు, వీరు చెప్పినట్లు పని చేసే వాళ్లుగా ఉన్నారు గనక ఉన్నత స్థానాలలో ఉన్న వారికి ఇది మంచిదిగానే అనిపిస్తున్నది. రెండోది వీరి కింది వారు ఎక్కువగా ఏమీ అడగటానికి వీలుండదు. ఈ నిచ్చెన మెట్ల సిద్ధాంతాన్ని అంగీకరించేవారు ఏ కులానికి, లింగానికి సంబంధించిన వారైనా బ్రాహ్మణిస్టులే.
ఈ సిద్ధాంతం ప్రజలను ఉమ్మడిగా కదిలించేందుకు మౌలికంగానే వ్యతిరేకమైనది. అది వ్యక్తి స్వేచ్ఛను కూడా అంగీకరించదు. ఎందుకంటే అది నిచ్చెన మెట్ల సిద్ధాంతాన్ని గొప్పదిగా భావిస్తుంది. అందరూ సమానంగా ఉండే సమాజాన్ని అది కోరుకోదు. మనుషులను విడదీస్తుంది. సౌభ్రాతృత్వానికి పూర్తిగా వ్యతిరేకమైనది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వానికి బ్రాహ్మణవాదం పూర్తి వ్యతిరేకమని అంబేద్కర్‌ చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. దీన్నిబట్టి చూస్తే బ్రాహ్మణవాదం, భారత రాజ్యాంగం ఒక దానికి ఒకటి మౌలికంగానే వ్యతిరేకం అని అర్థం అవుతుంది. ఎవరైతే నిజాయితీగా రాజ్యాంగం మూల సూత్రాలను అంగీకరిస్తారో వారు సహజంగానే బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. రెండో వైపున ఎవరైతే బ్రాహ్మణవాదానికి కట్టుబడి ఉంటారో వారు రాజ్యాంగంలో పొందు పరిచిన విలువలకు కట్టుబడి లేనట్టే.
                                                                                                       (‘ది హిందూసౌజన్యంతో) 
                                                                                                             – రాజీవ్‌ భార్గవ

                                                                                             (Courtacy Prajashakti)